Goa Election Results 2022: గోవాలో గెలుపు గుర్రం ఎక్కేదెవరు.. ఇంట్రస్టింగ్ వివరాలు మీకోసం..
Goa Election Results 2022: ఉత్కంఠ వీడనుంది. ఫలితాలు తేలనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. విజేత ఎవరో తెలియనుంది.
Goa Election Results 2022: ఉత్కంఠ వీడనుంది. ఫలితాలు తేలనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. విజేత ఎవరో తెలియనుంది. ఎవరి విశ్లేషణ వారిదే. గెలుపు ఎవరిదైనా ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశ రాజకీయ పరిణామాల్లో కీలక మార్పు రానుంది. ఫలితాలకు ముందే చిన్న రాష్ట్రమైన గోవాలో ఎలా ఉందో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం..
చరిత్ర.. భారతదేశంలో పశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉంది గోవా. దీనికి కొంకణ తీరమని పేరు. వైశాల్యపరంగా దేశంలో రెండవ అతిచిన్న రాష్ట్రం. జనాభాలో నాలుగవ అతిచిన్న రాష్ట్రం. సిక్కిం, మిజోరామ్, అరుణాచల్ ప్రదేశ్ లు గోవా కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు. గోవా రాజధాని పనజీ. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వాళ్లు గోవాలో వ్యాపారం మొదలు పెట్టి అక్కడే మకాం వేశారు. అక్కడే అధికారాన్ని హస్తగతం చేసుకుని 450 ఏళ్ల పాటు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 1961లో భారత ప్రభుత్వం సైనికచర్య ద్వారా గోవాను తన అధీనంలోకి తీసుకునే వరకు వారి పాలనలోనే ఉంది గోవా. గోవా అంటే చాలు కుర్రకారు క్యూ కట్టే పరిస్థతి. పకృతి సోయగం, చక్కని బీచ్ లు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద ఈ రాష్ట్రం సొంతం.
పోటీ చేసింది.. గోవాలో ఇప్పటి వరకు బీజేపీ అధికారంలో ఉంది. మొత్తం 40 స్థానాలున్న ఇక్కడ బీజేపీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ 37 సీట్లల్లో పోటీ చేసింది. ఇక జీఎఫ్పీ 3, ఆప్- 39 (ఒకచోట ఇండిపెండెంట్‌కు మద్దతు), తృణమూల్ కాంగ్రెస్ 26, ఎంజీపీ 13, ఎన్సీపీ- 13 (ఒక చోట ఇండిపెండెంట్‌కు మద్దతు) శివసేన 10 చోట్ల పోటీ చేశాయి.
వారే ప్రచార సారథులు.. బీజేపీకి సీఎం అభ్యర్ధి ప్రమోద్ సావంత్ అన్నీ తానై చూసుకున్నాడు. సిట్టింగ్ సిఎం అయిన సావంత్ ఎంత వరకు పార్టీని ముందుకెళతాడనేది ఆసక్తికరమే. ఇక కాంగ్రెస్ ఇక్కడ సిఎం అభ్యర్థి ప్రకటించలేదు. అయినా దిగంబర్ కామత్ ప్రచారం సంగతి చూశాడు. ఆప్ సీఎం అభ్యర్ధిగా అమిత్ పాలేకర్ రంగంలోకి దిగగా.. తృణమూల్ కాంగ్రెస్ పక్షాన మహు మోత్రా, ఎంజీపీకి సుదిన్ ధవళీకర్, ఎన్సీపీకి జోసె ఫిలిప్ డిసౌజా, శివసేనకి జితేష్ కామత్ లు గెలుపు బాధ్యతలను భుజానా ఎక్కించుకున్నారు.
పొత్తులు.. బీజేపీ, ఆప్ పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగాయి. గోవా ఫార్వర్డ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ 37 సీట్లలో పోటీ చేస్తూ, జీఎఫ్పీకి 3 సీట్లు కేటాయించింది. తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీఎఫ్) కలిసి పోటీ చేశాయి. మరో కూటమిగా ఎన్సీపీ+శివసేన పొత్తులతో బరిలోకి దిగాయి.
ఎవరెవరు ఎన్ని స్థానాలలో పోటీ.. (మొత్తం సీట్లు – 40) బీజేపీ – 40 కాంగ్రెస్ – 37 జీఎఫ్‌పీ – 3 ఆప్ – 39 (ఒకచోట ఇండిపెండెంట్‌కు మద్దతు) తృణమూల్ – 26 ఎంజీపీ – 13 ఎన్సీపీ – 13 (ఒక చోట ఇండిపెండెంట్‌కు మద్దతు) శివసేన – 10
గోవా అసెంబ్లీలో మొత్తం స్థానాలు: 40 (1 స్థానం ఎస్సీ రిజర్వుడు) పోటీలో ఉన్న మొత్తం అభ్యర్ధులు: 301 మొత్తం ఓటర్లు: 11,56,762 పోలింగ్ జరిగిన తేదీ: 14-02-2022 తాజాగా నమోదైన పోలింగ్: 79.61 2017 ఎన్నికల్లో నమోదైన మొత్తం పోలింగ్: 81.21
కీలక స్థానాల్లో పోటీ.. శాంక్వీలిమ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేత ప్రమోద్ సావంత్ పోటీ చేస్తుండగా.. మార్గోవాలో కాంగ్రెస్ నేత దిగంబర్ కామత్ బరిలో దిగారు. కాలాన్ గు సీటు నుంచి కాంగ్రెస్ నేత మైఖేల్ లోబో, సైంట్ క్రూజ్ నుంచి ఆప్ నేత అమిత్ పాలేకర్, మార్కైమ్ నుంచి మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నేత సుదిన్ ధవళీకర్ రేసులో ఉన్నారు. ఇక పంజీం నుంచి ఈ సారి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు ఉత్పల్ పారికర్.
ఆశలు.. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లలో అంతర్గత సమస్యలు, ఫిరాయింపుల బెడద ఎదుర్కుంది. ఈ ఎన్నికల్లో మైనింగ్ అంశం గోవాలో కీలకంగా మారింది. ముడి ఉక్కు ఖనిజం, మాంగనీస్ ఉత్పత్తిలో దేశంలో గోవా మూడో స్థానంలో ఉంది. అక్రమ మైనింగ్ తవ్వకాల ఆరోపణలు, ఫిర్యాదులతో 2018లో మైనింగ్ కార్యకలాపాలను నిలిపేసింది సుప్రీంకోర్టు. ఫలితంగా మైనింగ్‌పై ఆధారపడి ఉపాధి కోల్పోయిన కుటుంబాలు కీలకంగా మారాయి. అంతే కాదు అవినీతి, జూద సంస్కృతి కంట్రోల్ చేయడం, భాషా బోధన అంశాలు కూడా ప్రచారంలో కీలకాంశాలుగా మారాయి. ఓటర్లు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓటేశారు.
కమలం వికసించేనా.. బీజేపీ గత ఎన్నికల్లో 40కిగాను కేవలం 13 స్థానాల్లోనే గెలిచింది. అయినా ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ల మద్దతుతో ఆధికారంలోకొచ్చింది బీజేపీ. అధికార వ్యతిరేకతతోపాటు, కాంగ్రెస్ నుంచీ వలస వచ్చినవారికి ప్రాధాన్యత ఇవ్వడంతో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. హిందూత్వ ఎజెండా స్థానంలో అభివృద్ధి ఎజెండా తెచ్చిన మనోహర్ పారికర్ వంటి బలమైన నాయకుడు లేకపోవడం లోటే అని చెప్పాలి. దీనికి తోడు పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్‌కు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాడు. పదేళ్లుగా అధికారంలో ఉండి అవినీతి ఆరోపణలు పెరిగిపోవడం ఇబ్బందే. స్వయంగా బీజేపీ సీనియర్ నేత, 2020 అగస్టు వరకూ గోవా గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలు కలకలం రేపాయి.
గోవాలో ప్రతి చోటా అవినీతి ఉందని వ్యాఖ్యానించడంతో ప్రతిపక్షాలకు ఆదే ప్రధానాస్త్రంగా మారింది. ఓటర్ల పై ప్రభావం చూపింది. కాసినోలపై (జూదం) నిషేధం విధిస్తామని 2012లో మొదటిసారి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ నెరవేరలేదు. కాసినో ఇండస్ట్రీకి బీజేపీ కొమ్ముకాస్తోందని ఆప్ వంటి పార్టీలు ప్రధానంగా ఆరోపించాయి. అయితే ఏపార్టీకి మెజార్టీ రాకపోయినా బీజేపీనే పెద్ద పార్టీగా నిలుస్తుందని అధిక శాతం సర్వేలు చెప్పాయి. స్థానిక నేతలతోపాటు అమిత్ షా విస్తృతంగా ప్రచారం చేయడం కలిసి వచ్చే వీలుంది.
కాంగ్రెస్.. గతంలో గెలిచిన 17 మందిలో ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి బీజేపీలోకి దూకడం మాములు విషయం కాదు. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి లూజినో ఫలేరియా తృణమూల్‌లో చేరడం కూడా పెద్ద దెబ్బే. ఈ పరిణామాలతో నాయకత్వ సమస్య ఏర్పడింది. ఫలితంగా 31 మంది కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్. రాహుల్ గాంధీ ప్రచారం చేసినా అంత ప్రయోజనం ఉంటుందా అనే చర్చ సాగుతోంది.
ఆప్… ఢిల్లీలో సత్తా చాటుతున్న ఆప్ ఈ సారి ఎన్నికల్లో ఆప్ సత్తా చాటే అవకాశాలున్నాయి. హంగ్ వస్తే ఆప్‌దే కింగ్ మేకర్ పాత్ర అవుతుంది. గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోయినా 6.27 శాతం ఓట్లు సాధించి అనేక చోట్ల మూడో స్థానంలో నిలిచింది ఆప్. కాసినోల నిషేధం, మైనింగ్ పునరుద్దరణ వంటి అంశాలు తమకు నిర్ణయాత్మక స్థాయిలో సీట్లు సాధించిపెడతాయని భావిస్తోంది. ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్, ఓబీసీ భండారీ సామాజిక వర్గానికి చెందిన తమ సీఎం అభ్యర్ధి అమిత్ పాలేకర్‌పైనే ఆధారపడుతుంది ఆప్. మొదట్లో కొంత హడావిడి చేసిన మమతా బెనర్జీ తర్వాత వెనక్కు తగ్గడం ఆశ్చర్య పరిచింది. ఇక ఎన్సీపీ, శివసేన పార్టీల ప్రభావం కూడా పెద్దగా లేదనే చెప్పవచ్చు.
గతం కంటే పోలింగ్ ఎక్కువ నమోదైంది కాబట్టి మరోసారి మాదే విజయం అంటోంది కమలం గుర్తు పార్టీ. కాదు కాదు తామే హస్తగతం చేసుకుంటామని ధీమాగా చెబుతోంది కాంగ్రెస్. ఈనెల 10న వచ్చే ఫలితాలతో ఉత్కంఠకు తెరపడనుంది.
కొండవీటి శివనాగరాజు, సీనియర్ జర్నలిస్టు, రీసెర్చ్ ప్రొడ్యూసర్, టీవీ9 తెలుగు.
Also read:
Viral Video: పాముతోనే ఆటలాడాలనుకున్నాడు.. దాని రియాక్షన్‌కు దిమ్మ తిరిగిపోయింది.. షాకింగ్ వీడియో..
Chilli Price: బంగారంతో పోటీ పడుతున్న ఎర్రబంగారం.. ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..!
Andhra Pradesh: ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్.. కీలక ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ కమిషనర్..