Griha Laxmi Card: మహిళలకు బంపర్ ఆఫర్.. అధికారంలోకి వస్తే ప్రతి నెల రూ.5,000.. ప్రకటించిన టీఎంసీ!
Goa Assembly Elections 2022: గోవాలో పాగా వేయడమే లక్ష్యంగా దూకుడుతో ముందుకెళ్తున్న తృణమూల్ కాంగ్రెస్.. మహిళలకు అదిరిపోయే హామీ ఇచ్చింది.
TMC Griha Laxmi Card in Goa: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మారిన తృణమూల్ కాంగ్రెస్ (TMC).. ఇతర రాష్ట్రాలపై గురి పెట్టింది. ఈ క్రమంలోనే గోవాలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తోంది. గోవాలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే టీఎంసీ ఓటర్లను ఆకర్షించేందుకు హామీ వర్షం కురిపిస్తోంది. టీఎంసీని గెలిపిస్తే.. రాష్ట్రంలోని 3.5 లక్షల మంది మహిళలకు రూ.5,000 చొప్పున నేరుగా బదిలీ చేయడానికి వీలు కల్పించే గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది.
ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు హామీ వర్షం కురిపిస్తున్నాయి. ఈసారి గోవాలో పాగా వేయడమే లక్ష్యంగా దూకుడుతో ముందుకెళ్తున్న తృణమూల్ కాంగ్రెస్.. మహిళలకు అదిరిపోయే హామీ ఇచ్చింది. టీఎంసీని అధికారంలోకి తీసుకొస్తే ప్రతి కుటుంబంలోని మహిళకు గృహలక్ష్మీ పథకం కింద నెలకు రూ.5,000 చొప్పున, మొత్తం ఏడాదికి రూ.60,000 ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తామని టీఎంసీ పార్టీ గోవా వ్యవహారాల ఇన్‌ఛార్జి, ఎంపీ మెహువా మొయిత్రా హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన కార్డుల్ని పంపిణీ చేస్తామన్నారు.ఈ కార్డులపై ఉన్న యూనిక్ ఐడింటిఫికేషన్ నంబర్లు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలులోకి వస్తాయని హామీ ఇచ్చారు. గోవాలోని ప్రతి మహిళకు నెలవారీ ఆదాయ ప్రోత్సహకంగా ఉంటుందని ఆమె తెలిపారు.
ఈ పథకం ద్వారా గోవాలోని 3లక్షల 50 వేల కుటుంబాలకు చెందిన మహిళలందరికీ వర్తిస్తుందని మెహువా స్పష్టంచేశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న గృహ ఆధార్ పథకంలో గరిష్ఠ ఆదాయ పరిమితిని కూడా తాము తొలగిస్తామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మహిళలకు కేవలం రూ.1,500 మాత్రమే ఇస్తోందని గుర్తు చేశారు. వాస్తవానికి గృహ ఆధార్ పథకం అమలుకు ఏడాదికి రూ.270 కోట్లు కావాల్సి ఉన్నప్పటికీ.. గోవా ప్రభుత్వం కేవలం రూ.140 కోట్లు మాత్రమే కేటాయించడంతో చాలా మంది లబ్ధి పొందలేకపోతున్నారని ఎంపీ విమర్శించారు. తాము తీసుకురాబోయే ప్రాజెక్టుకు రాష్ట్ర బడ్జెట్‌లో ఆరు నుంచి ఎనిమిది శాతం నిధుల్ని ఖర్చు చేస్తామన్నారు. మరోవైపు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ వచ్చే గోవా ఎన్నికల్లో మొత్తం 40 స్థానాల నుంచి పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Also… Wedding in heavy rain: వరుడి వింత చేష్టలు..వానవెలిసేదాక ఆగలేకపోయాడు..! వైరల్ అవుతున్న వీడియో..