Covid19 Restrictions: షాపింగ్‌ మాల్స్‌, థియేటర్లపై కోవిడ్ ఆంక్షలు.. ఎన్నికల ర్యాలీలు మాత్రం భేషుగ్గా జరుపుకోవచ్చు!

దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ జడలు విప్పుకుంటోంది.. మొన్నటి వరకు నిద్రాణంగా ఉన్న ఆ మహమ్మారి కోరలు చాస్తూ స్వైరవిహారం చేస్తోంది.. ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయనాయకులు కూడా దీని బారిన పడుతున్నారు.

Covid19 Restrictions: షాపింగ్‌ మాల్స్‌, థియేటర్లపై కోవిడ్ ఆంక్షలు.. ఎన్నికల ర్యాలీలు మాత్రం భేషుగ్గా జరుపుకోవచ్చు!
Election
Follow us
Balu

| Edited By: Balaraju Goud

Updated on: Jan 04, 2022 | 3:17 PM

Coronavirus Effect on Elections: దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ జడలు విప్పుకుంటోంది.. మొన్నటి వరకు నిద్రాణంగా ఉన్న ఆ మహమ్మారి కోరలు చాస్తూ స్వైరవిహారం చేస్తోంది.. ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయనాయకులు కూడా దీని బారిన పడుతున్నారు. ఇక చాపకింద నీరులా ఒమిక్రాన్‌ కూడా విస్తరిస్తోంది.. ఇప్పటికే చాలా రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలు విధించాయి. వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం కొన్ని చర్యలు తీసుకున్నాయి. స్కూళ్లు, కాలేజీలను మూసేశాయి. పలు నగరాలలో నైట్‌ కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. ఢిల్లీలో అయితే రెడ్‌ అలర్ట్‌ ఆంక్షలు విధించబోతున్నారు.

ఇక, రానున్నది ఎన్నికల కాలం.. ర్యాలీలు, సభలు సమావేశాలు తప్పనిసరి! కోవిడ్‌తో నేతలకు పనేముంటుంది? ఇంతకు ముందు కూడా ఇలాంటి రాజకీయ సభల వల్లే కదా వైరస్‌ వ్యాప్తి చెందింది..? విచిత్రమేమిటంటే నైట్‌ కర్ఫ్యూలను అమలు చేస్తున్న చోటే పగటి పూట రాజకీయ ర్యాలీలు జరగడం! ప్రజా రవాణాపై, శుభకార్యాలపై, అంత్యక్రియలపై పాల్గొనే వారిపై పరిమితులు పెట్టిన ప్రభుత్వాలు ఎన్నికల ర్యాలీలు, సమావేశాలలో పాల్గొనే వారిపై కూడా పరిమితులు పెట్టాలి కదా! ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లలో ఇప్పటికే సభలు సమావేశాలు ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నాయి. గోవా కూడా ఇందుకు మినహాయింపు కాదు. పంజాబ్‌లో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలలో ప్రత్యక్ష తరగతులనైతే మూసివేస్తున్నారు కానీ రాజకీయ సభలపై ఎలాంటి ఆంక్షలను విధించలేదు. బార్లు, సినిమా థియేటర్లు, మల్టిపెక్స్‌లు, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, స్పా సెంటర్లు, మ్యూజియంలు ఇలా జనాలు ఎక్కువగా వచ్చే ప్రతి చోటా కొన్ని ఆంక్షలు పెట్టారు. 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక స్పోర్ట్స్‌ గ్రౌండ్స్‌, స్విమ్మంగ్‌ పూల్స్‌, జిమ్‌ సెంటర్లలను పూర్తిగా క్లోజ్‌ చేశారు.

Elections

Elections

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రేపోమాపో నోటిఫికేషన్‌ రాబోతున్నది. అప్పటి వరకు ఎదురుచూడటం ఎందుకని ఆల్‌రెడీ ప్రచారం మొదలు పెట్టేశాయి రాజకీయ పార్టీలు. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌లలో అయితే ర్యాలీలు, బహిరంగసభలు జోరుగా సాగుతున్నాయి. కరోనా ఆంక్షలు విధించిన ప్రభుత్వాలు సభలు, సమావేశాలపై ఎలాంటి ఆంక్షలు విధించకపోవడమే విచిత్రం. పంజాబ్‌లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పాజిటివిటీ రేటు కూడా బాగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం అవసరమా అన్న వాదన వినిపిస్తోంది.. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఎన్నికలను నిర్వహిస్తామని ఎన్నికల సంఘం చెబుతుంది కానీ.. అది అయ్యే పనేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఎన్నికల వేళ కొనసాగుతున్న ప్రచార ర్యాలీలు, సభలు తప్పనిసరిగా కరోనా సూపర్‌ స్ప్రెడర్లుగా మారే ప్రమాదం ఉంది.. నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికలను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. కోవిడ్‌ నిబంధనలను పట్టించుకోకుండా, నిర్లక్షంగా వ్యవహరిస్తూ రాజకీయ సమావేశాలను నిర్వహిస్తే మాత్రం థర్డ్‌ వేవ్‌ ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఎన్నికలను మరెప్పుడైనా నిర్వహించుకోవచ్చు కానీ.. కరోనాను కట్టడి చేయడం సాధ్యమయ్యే పనికాదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడమే ఉత్తమమని కొందరు చెబుతున్నారు. రాజకీయ పార్టీలు మాత్రం ఎన్నికలు జరిపాల్సిందేనని గట్టిగా పట్టుబడుతున్నాయి.. ఎన్నికల సంఘం కూడా నిర్ణీత సమయంలోనే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది.

ఒకప్పుడు అయితే ఎన్నికల సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివెళ్లేవారు. నాయకుల ప్రసంగాలతో ఉత్తేజితులయ్యేవారు.. ఇప్పుడలా కాదు.. సమావేశాల కోసం ప్రజలకు ఏదో ఒక ఆశ చూపించి బలవంతంగా తీసుకెళ్లే రోజులివి! పది మంది గుమిగూడే చోటకు వెళ్లడం ప్రమాదకరం అన్న స్పృహ ఎంతమందికి ఉంటుంది? చూస్తున్నాంగా… షాపింగ్‌ మాల్స్‌, థియేటర్లలో జనం ఎలా ఉంటున్నారో.. చివరకు ఆధ్యాత్మిక కేంద్రాలలో కూడా ఇదే పరిస్థితి.. ఇలాంటప్పుడు ఎన్నికల ర్యాలీలలో జనం మాస్కులు పెట్టుకుని వస్తారని, భౌతిక దూరం పాటిస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది.. ఈ మధ్యన జరిగిన ఎన్నికలు కరోనాను ఎలా వ్యాపింపచేశాయో చూశాం.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు విజ్ఞతతో వ్యవహరించాలని, జనానికి కరోనా అంటించకుండా చూసుకోవాలని ఆశించడం మినహా మనం చేసేదేమీ లేదు.

Read Also….  AIIMS Hospital: వైద్యులకు సెలవులు రద్దు.. వెంటనే విధులకు హాజరు కావాలని ఎయిమ్స్ ఆదేశం!