Assembly Elections 2022: యూపీలో బీజేపీ గెలుస్తుందా? పంజాబ్ అధికారం ఎవరిది? ఐదురాష్ట్రాల ఎన్నికలపై సర్వే ఏమంటోంది?
దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2022 ప్రారంభంలో జరగనున్నాయి. ఈ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Assembly Elections 2022: దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2022 ప్రారంభంలో జరగనున్నాయి. ఈ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలో ప్రభుత్వం ఉండగా, పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందో ఏబీపీ సీ-ఓటర్ సర్వే ద్వారా డేటాను విడుదల చేసింది. ఆ సర్వ్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మళ్ళీ..
ఉత్తరప్రదేశ్‌లో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని సర్వేలో తేలింది. రాష్ట్రంలో 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు 213-221 సీట్లు సాధించవచ్చు. మరోవైపు బీజేపీ కూటమికి 41 శాతం ఓట్లు రావచ్చు. ఇది కాకుండా, సమాజ్ వాదీ పార్టీ (SP), దాని మిత్రపక్షాలు 152-160 స్థానాల్లో విజయం సాధించవచ్చు. ఓట్ల శాతం పరంగా కూడా 31 శాతంతో ఈ కూటమి రెండో స్థానంలో ఉంది. సర్వే ప్రకారం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) 16-20 సీట్లు (ఓట్ల శాతం-15), కాంగ్రెస్ 6-10 సీట్లు (ఓట్ల శాతం-9) అలాగే ఇతరులు 2-6 సీట్లు (ఓట్ల శాతం-4) పొందవచ్చు.
పంజాబ్‌లో అతిపెద్ద పార్టీగా ఆప్ ..
మరోవైపు పంజాబ్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య గట్టిపోటీ కనిపిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 42-50 (ఓట్ల శాతం-35), శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) 16-24 సీట్లు (ఓట్ల శాతం-21), ఆమ్ ఆద్మీ పార్టీకి 47-53 సీట్లు (ఓట్ల శాతం-36) రావచ్చు. ఇక్కడ బీజేపీ పనితీరు దిగజారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీకి 0-1, ఇతరులకు 0-1 స్థానాలు వస్తాయని అంచనా.
ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఆధిక్యం సాధ్యమే
సర్వే ప్రకారం, ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఆధిక్యంలోకి వస్తుందని, అయితే ఇక్కడ కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వగలదని అంచనా. రాష్ట్రంలో 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ బీజేపీ 36-40 స్థానాల్లో (ఓట్ల శాతం -41) విజయం సాధిస్తుంది. మరోవైపు కాంగ్రెస్‌కు 30-34 సీట్లు (ఓట్ల శాతం-36), ఆమ్ ఆద్మీ పార్టీకి 0-2 (ఓట్ల శాతం-12), ఇతరులకు 0-1 సీట్లు వస్తాయని అంచనా.
గోవాలో కూడా బీజేపీ పుంజుకోవచ్చు
గోవాలో కూడా బీజేపీ పుంజుకునేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సర్వే ప్రకారం రాష్ట్రంలో బీజేపీకి 19-23 సీట్లు (ఓట్ల శాతం-36) రావచ్చు. మరోవైపు కాంగ్రెస్‌కు 2-6 సీట్లు (ఓట్ల శాతం-19), ఆమ్ ఆద్మీ పార్టీకి 3-7 సీట్లు (ఓట్ల శాతం-24) రావచ్చు. ఇతరులు 8-12 సీట్లు గెలుచుకుంటారని సర్వేలో అంచనా వేశారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.
మణిపూర్‌లో హంగ్ వచ్చే అవకాశం..
కాగా, మణిపూర్‌లో బీజేపీ 25-29 స్థానాల్లో (ఓట్ల శాతం-39) విజయం సాధిస్తుంది. రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా మెజారిటీని దాటే పరిస్థితి కనిపించడం లేదు. సర్వే ప్రకారం, కాంగ్రెస్‌కు 20-24 సీట్లు (ఓట్ల శాతం-33), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) 4-8 సీట్లు (ఓట్ల శాతం-9), ఇతరులకు 3-7 (ఓట్ల శాతం-19) రావచ్చు.
ఇవి కూడా చదవండి: Zika Virus: పెరుగుతున్న జికా వైరస్ వ్యాప్తి.. గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే..
Health with Ghee: మన ఆరోగ్యానికి ఏ నెయ్యి మంచిది? పసుపు నెయ్యి.. తెల్లని నెయ్యి మధ్య తేడాలేంటి?
CBSE Exams: సీబీఎస్‌ఈ..ఐసీఎస్ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలి..సుప్రీంకోర్టులో పిటిషన్!