AIMIM: యూపీ ఎన్నికల్లో ఎంఐఎం ఎవరి కొంప ముంచింది? ఎవరికి మేలు చేసింది?

UP Election Results 2022: ఎన్నికల్లో గెలుపు దారి రెండు రకాలు. ఒకటి తన పక్ష ఓట్లు రాబట్టుకోవడం. రెండు ప్రత్యర్థిని కట్టడి చేయడం.. ఆ పక్ష ఓట్లను చీల్చడం ద్వారా విజయం దక్కించుకోవడం. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు వ్యూహాలు బాగానే పని చేశాయి.

AIMIM: యూపీ ఎన్నికల్లో ఎంఐఎం ఎవరి కొంప ముంచింది? ఎవరికి మేలు చేసింది?
Akhilesh Yadav, Asaduddin Owaisi
Follow us

|

Updated on: Mar 12, 2022 | 3:31 PM

UP Election Results 2022: ఎన్నికల్లో గెలుపు దారి రెండు రకాలు. ఒకటి తన పక్ష ఓట్లు రాబట్టుకోవడం. రెండు ప్రత్యర్థిని కట్టడి చేయడం.. ఆ పక్ష ఓట్లను చీల్చడం ద్వారా విజయం దక్కించుకోవడం. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు వ్యూహాలు బాగానే పని చేశాయి. తమ ప్రత్యర్థి ఓట్లను చీల్చడం ద్వారా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో బీజేపీనే ఎక్కువగా లాభపడింది. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ, ఆప్ ఓట్లు బాగా చీలాయి. మరోవైపు ఎంఐఎం ముస్లిం ప్రాబల్యం ఉన్న చోట 100 సీట్లల్లో పోటీ చేసి మిగతా వారి గెలుపునకు గండి కొట్టింది. ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కించుకోలేదు. కానీ ఆ పార్టీకి యూపీలో 4,50,929 ఓట్లు వచ్చాయి. గతం కంటే ఓట్ల శాతాన్ని 0.25 శాతం పెంచుకుంది. ఈ సారి ఆ పార్టీకి వచ్చిన ఓట్ షేర్ 0.49 శాతం.

యూపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అసదుద్దీన్‌ ఒవైసీ బాగా ప్రభావితం చేస్తారని అంచనాలు వేశాయి ప్రధాన పార్టీలు. ఫలితాలు ఇందుకు విరుద్దంగా వచ్చినా.. పరోక్షంగా కమలం గుర్తు పార్టీకి అది మేలే చేసింది. బీహార్ ఎన్నికల్లో ముస్లిం ఓట్లను భారీగా చీల్చి అప్పుడు ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాకూటమి ఓటమికి ఎంఐఎం కారణమైంది. అందుకేనేమో బీజేపీకి బీ టీమ్ గా ఒవైసీ ఉన్నారనే చర్చ అప్పటి నుంచే మొదలైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా పరోక్షంగా కాషాయ పార్టీకి సాయపడుతున్నారని విపక్షాలు ఆరోపించాయి.

ఫార్ములా పాతదే…అయినా..

యూపీలోని హాపూర్ జిల్లాలో ఫిబ్రవరి 3న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారు మీద దుండగులు తుపాకీ కాల్పులు జరిపారు. ఎవరికి ఏమి కానప్పటికీ దేశవ్యాప్తంగా అది కలకలం రేపింది. కాల్పులు జరిగాయో లేదో వెంటనే ఒవైసీకి జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. పార్లమెంటులోను దీని పై చర్చ జరిగింది. తనకు ‘జడ్ కేటగిరీ’ భద్రత వద్దని, తనను ‘ఎ క్లాస్’ సిటిజన్‌గా చూడాలని ఒవైసీ చట్ట సభలోనే చెప్పడం ఆసక్తికరంగా మారింది. కాల్పుల ఘటనతో తమ ఓట్లు పెరుగుతాయని అంచనా వేసినా అనుకున్నట్లు జరగలేదు. తమ ఓట్లకు ఎంఐఎం గండి కొడుతుందని సమాజ్‌వాదీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ బాహాటంగానే చెప్పడం హాట్ టాపికైంది. ముస్లిం-యాదవ్‌ ఓట్ల కలయికతో ఆజంగఢ్‌లో ఎస్పీ ఎన్నో ఏళ్లుగా గెలుస్తూ వస్తోంది. అదే తరహాలో M-D (ముస్లిం-దళిత) ఫార్ములాతో ఎంఐఎం ప్రయత్నం చేసింది. ఆజంగఢ్‌ ఫార్ములాను దెబ్బతీసేందుకు బీజేపీ వ్యూహ రచన చేసింది. ఇందులో పావుగా ఒవైసీ మారారనే వాదన లేకపోలేదు. తెలంగాణ వెలుపల మహారాష్ట్ర, బీహార్ అసెంబ్లీల్లో అడుగుపెట్టిన ఎంఐఎం, యూపీలో ఖాతా తెరవటానికి గట్టి ప్రయత్నమే చేసింది.

యూపీలో ముస్లింలు, బీసీలు, దళితుల్లో మద్దతున్న పార్టీలతో కలిసి ‘భాగీదారి పరివర్తన్ మోర్చా’ కూటమిని ఏర్పాటు చేసింది ఎంఐఎం. బాబు సింగ్ కుష్వహా సారథ్యంలోని జన్ అధికారి పార్టీ, వామన్ మేష్రామ్ నేతృత్వంలోని భారత్ ముక్తి మోర్చా, అనిల్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోని జనతా క్రాంతి పార్టీ, రాంప్రసాద్ కశ్యప్‌కు చెందిన భారతీయ వించిత్ సమాజ్ పార్టీలు ఈ కూటమిలో భాగస్వాములు. ముస్లిం-దళిత ఓటర్లను ఆకట్టుకుని గెలుపుబాట పట్టాలనుకుంది ఎంఐఎం. వ్యూహంలో భాగంగా దళితులకు టికెట్లు ఇచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో ఓట్లు రాకపోవడం గమనార్హం.

గతంలో మూడు రాష్ట్రాల అసెంబ్లీలలో పాగా వేసింది ఎంఐఎం. తెలంగాణలో ఏడు, బిహార్ లో ఐదు, మహారాష్ట్రలో రెండు అసెంబ్లీ సీట్లు గెలుచుకుని తన సత్తా చాటుకుంది. గతంలో బీహార్‌లో 5 సీట్లు గెలవడంతోపాటు, అనేక చోట్ల ఆర్‌జేడీ ఓటమికి కారణమైంది. అనేక రాష్ట్రాలలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా పోటీ చేస్తూ వస్తున్న మజ్లిస్‌ సీట్లను పెంచుకుంటూ పోతోంది. 2017లో ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 78 చోట్ల పోటీ చేసిన ఎంఐఎం 31 చోట్ల గెలిచి సత్తా చాటింది. అంతే కాదు 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 38 స్థానాల నుంచి బరిలోకి దిగింది మజ్లిస్. ఆ పార్టీకి 0.24 శాతం ఓట్లు వచ్చాయి. అప్పుడు 37 సీట్లలో అసలు డిపాజిట్లు కూడా లభించలేదు. కానీ ఈ సారి 100 సీట్లలో పోటీ చేసి 4,50,929 ఓట్లు సంపాదించింది. నోటా’కు పడిన ఓట్ల కంటే తక్కువ (0.69 శాతం) అయినా 0.49 శాతం ఓట్లు సాధించడం మజ్లిక్ కే చెల్లింది. గతంలో పోల్చుకుంటే 0.25 శాతం ఓట్లు పెరుగుదల ఆ పార్టీకి వచ్చింది.

Yogi Adityanath Asaduddin Owaisi

Yogi Adityanath. Asaduddin Owaisi

ఈ సారి…

యూపీలోని బహ్రాయిచ్ జిల్లాలోని నాన్‌పారా, అయోధ్య జిల్లాలోని రౌదౌలి, సిద్దార్థ్ నగర్ జిల్లాలోని దొమరియాగంజ్, ఘజియాబాద్ జిల్లాలోని సహరాన్‌పూర్ దేహత్, సాహిబాబాద్, మీరట్ జిల్లాలోని సివాల్ కాస్తంత పోటీనిచ్చింది మజ్లిస్ పార్టీ. ఈ పార్టీ పోటీ చేసిన అత్యధిక స్థానాల్లో ముస్లిం ఓటర్లే ఎక్కువ. ఒక్క సీటు దక్కించుకోక పోయినా ఎస్పీ విజయవకాశాలకు ఎంఐఎం అడ్డంకిగా మారింది. 45 చోట్ల ఎస్పీ ఓటమికి ఎంఐఎం ఓట్ల చీలికే ఒక కాారణంటున్నారు విశ్లేషకులు. యూపీలో ఖాతా తెరవక పోయినా ఏ ఒక్క స్థానంలోనూ రెండో స్థానంలోను కనిపించలేదు ఎంఐఎం.

బీజేపీ అనుకున్నట్లే…

యూపీలో 403 స్థానాలకుగాను 256 సీట్లను దక్కించుకుంది బీజేపీ. 110 సీట్లతో సమాజ్ వాదీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ కేవలం రెండు సీట్లు, బీఎస్పీ ఒక సీటుకే పరిమితమైంది. ఇతరులు 34 సీట్లను సొంతం చేసుకున్నా విశేషం. మాములుగా అయితే యూపీలో ముస్లింల ఓట్లు సమాజ్‌వాది పార్టీకి ఎక్కువగా పడుతుంటాయి. ఆ పార్టీ ఓటు బ్యాంకును ఒవైసీ సాయంతో చీలిస్తే బావుంటుందనేది బీజేపీ ప్రణాళిక. ఈ రాష్ట్రంలో ముస్లింల ఓట్లు 19 శాతం ఉన్నాయి. 100కు పైగా స్థానాల్లో గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయి వారికి ఉంది. ముస్లిం ఓట్లు చీలిపోతే ప్రధానంగా లబ్ధి పొందేది బీజేపీనే. అసదుద్దీన్ అజాంగఢ్ ఫార్ములాతో సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలకు చెందిన ఓటు బ్యాంక్ కు గండి పడింది. మజ్లిస్ పార్టీ యూపీ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీకి సాయం చేసిందనే చెప్పాలి. హిందూ ఓట్లు బీజేపీకి పడేలా, ముస్లిం ఓట్లు వేరే ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు కాకుండా ఎంఐఎంకి పడేలా విభజించినట్లు అయింది. కావాలని అలా చేయక పోయినా అంతిమంగా కమల వికాసానికి బలం చేకూర్చే చర్యే ఇది.

అనుమానం….

యూపీ ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలు కారణమవుతాయని ముందే అఖిలేష్ యాదవ్ చెప్పినా..ఫలితాల తర్వాత ఆ ఊసే లేదు. కానీ పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ఊరుకోలేదు. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం ద్వారా యూపీ సహా ఇతర రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిందని బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఆరోపించడం ఆసక్తికరం. ఇది ప్రజల తీర్పు కాదు. ఎన్నికల యంత్రాంగం, కేంద్ర బలగాల సహాయంతో సాధించిన విజయని వారి గెలుపును తక్కువ చేసి చూపించారు మమత. ఇది సైమీ పైనల్.. 2024లో తిరిగి కేంద్రంలో అధికారంలోకి వచ్చేది మేమేనంటూ కమలం విజయదరహాసం చేస్తోంది. కాదు కాదు అప్పటికి మార్పు తథ్యం. గెలుపు మాదేనంటున్నాయి విపక్షాలు. అప్పటి లోపు ఎన్ని మార్పులు, చేర్పులు వస్తాయో వేచి చూడాల్సిందే.

-కొండవీటి శివనాగరాజు, సీనియర్ జర్నలిస్టు, రీసెర్చ్ డెస్క్, టీవీ9 తెలుగు

Also Read..

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు షాక్‌.. 4 దశాబ్దాల కనిష్ఠ స్థాయికి తగ్గిన పీఎఫ్ వడ్డీ రేటు..!

Radhe Shyam: రాధేశ్యామ్ సినిమాపై మీమ్స్‏తో ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన తమన్..