Assembly Election Results 2022 Date: నరాలు తెగే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెర.. 5 రాష్ట్రాల ఎన్నికల లెక్కింపునకు సర్వం సిద్ధం
Assembly Election Results 2022 Tomorrow: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా ? లేక తారుమారు అవుతాయా ? వేచిచూడాలి. 300 సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ నేతలు ధీమాతో ఉన్నారు. గతంలో కంటే..
దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు(Assembly Election Results ) మరికొన్ని గంటల్లో వెలువడుతాయి. కౌంటింగ్‌కు(Counting) అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ కమలం వికసిస్తుందని అన్ని ఎగ్జిట్‌పోల్స్ తేల్చిచెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా ? లేక తారుమారు అవుతాయా ? వేచిచూడాలి. 300 సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ నేతలు ధీమాతో ఉన్నారు. గతంలో కంటే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు సీఎం యోగి. అయితే ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు నిజం కాదని , ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని అఖిలేశ్‌యాదవ్ అంటున్నారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను తాము నమ్మడం లేదని , ప్రజలను భ్రమించే ప్రయత్నాలను బీజేపీ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఎన్నికల్లో గెల్చేందుకు బీజేపీ కుట్ర చేసిందన్నారు. వారణాసిలో ఈవీఎంల తరలింపు వ్యవహారంలో తప్పు జరిగిందని రిటర్నింగ్ అధికారి స్వయంగా చెప్పడం ఇందుకు నిదర్శనమన్నారు.
యూపీలో 403 సీట్లలో బీజేపీ 40 శాతం ఓట్లతో 211 నుంచి 225 సీట్లు సాధిస్తుందని TV9-పోల్‌స్ట్రాట్ ఎగ్జిట్‌పోల్ చెప్పింది. సమాజ్‌వాదీకి 146 నుంచి 160 సీట్లు, బీఎస్పీకి 14 నుంచి 24, కాంగ్రెస్‌కు నాలుగు నుంచి ఆరు సీట్లు వస్తాయని TV9-పోల్‌స్ట్రాట్ తెలిపింది. పంజాబ్‌లో కూడా ఆమ్‌ఆద్మీ పార్టీ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతునట్టు అన్ని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేశాయి. కాంగ్రెస్ నేతల్లో కూడా గెలుపుపై పెద్ద నమ్మకం కన్పించడం లేదు. ఆప్ తరపున భగవంత్ మాన్ సీఎం కావడం ఖాయమన్న సంకేతాలు అందుతున్నాయి. 117 స్థానాలకు పంజాబ్‌లో ఎన్నికలు జరగ్గా ఆప్ స్పష్టమైన మెజారిటీతో అధికారం లోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. పంజాబ్‌లో కౌంటింగ్ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఉత్తరాఖండ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో ఉత్కంఠ నెలకొంది. 70 స్థానాల ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతాయి. ఫలితాల అనంతరం ఎమ్మెల్యేల బేరసారాలకు తెరలేస్తుందనే అంచనాల నడుమ ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను క్యాంప్‌లకు తరలించడం కోసం హెలికాఫ్టర్లను సిద్ధం చేసింది. ఉత్తరాఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం గెలుపొందిన పార్టీ అభ్యర్ధి ఏ ఒక్కరూ ప్రత్యర్ధి శిబిరంలోకి వెళ్లకుండా నిరోధించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ భూపేష్ బాఘేల్‌కు కట్టబెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో గెలుపొందిన అభ్యర్ధులంతా డెహ్రాడూన్ తిరిగిరావాలని పార్టీ ఆదేశించింది. ఉత్తరాఖండ్‌లో హంగ్ తప్పదని చాలా ఎగ్జిట్‌పోల్స్ సూచించడంతో పార్టీల్లో టెన్షన్ నెలకొంది. అయితే గెలుపు తమదే అంటున్నారు బీజేపీ నేతలు.
గోవాలో 40 స్థానాల్లో బీజేపీ – కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. గోవాలో అప్పుడే క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్ధులను రిసార్ట్‌కు తరలించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించినప్పటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది కాంగ్రెస్ . ఈసారి కూడా అదే జరుగుతుందన్న భయం కాంగ్రెస్‌ను వెంటాడుతోంది.
అందుకే 40 మంది అభ్యర్ధులను నార్త్ గోవా లోని రిసార్ట్‌కు తరలించారు. కాంగ్రెస్ క్యాంప్ బాధ్యతను ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌కు అప్పగించారు. గతంలో జరిగిన పొరపాటు రిపీట్ కాకుండా చూస్తామన్నారు డీకే శివకుమార్. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో 20 స్థానాలు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ఏ పార్టీకి కూడా మెజారిటీ వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. గోవాలో కాంగ్రెస్‌కు 17-19 , బీజేపీకి 11-13, ఆప్‌కు 1-4 స్థానాలు వచ్చే అవకాశముందని టీవీ9-పోల్‌స్ట్రాట్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో ఆప్ కింగ్‌మేకర్‌గా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. మణిపూర్‌లో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అంటున్నారు బీజేపీ నేతలు . మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు విన్నర్‌ను తేలుస్తాయి.
ఇవి కూడా చదవండి: Eyes Care Tips: కళ్లల్లో మంట, దురదతో ఇబ్బంది పడుతున్నారా? ఈ హోం రెమెడీస్‌ని అనుసరించండి..
Russia Ukraine War Live: ఉక్రేనియన్ సైన్యం చేతిలో మరో రష్యన్ సైనికాధికారి మృతి