Call Data Leak: మొన్న బెదిరింపు కాల్స్..నేడు కాల్ డేటా లీక్ వ్యవహారంతో తల పట్టుకుంటున్న ఎమ్మెల్సీ

ఎవరికైనా ఎమ్మెల్సీ పదవి వస్తే సంతోషిస్తారు..కానీ ఇక్కడ సిన్ రివర్స్..ప్రొద్దుటూరు రమేష్ యాదవ్ కి ఎమ్మెల్సీ పదవి వచ్చినప్పటి నుంచి కష్టాలు రెట్టింపు అవుతున్నాయి.

Call Data Leak: మొన్న బెదిరింపు కాల్స్..నేడు కాల్ డేటా లీక్ వ్యవహారంతో తల పట్టుకుంటున్న ఎమ్మెల్సీ
MLC Ramesh Yadav
Follow us
Janardhan Veluru

|

Updated on: Jul 20, 2021 | 2:46 PM

Kadapa News: ఎవరికైనా ఎమ్మెల్సీ పదవి వస్తే సంతోషిస్తారు..కానీ ఇక్కడ సిన్ రివర్స్..ప్రొద్దుటూరు రమేష్ యాదవ్ కి ఎమ్మెల్సీ పదవి వచ్చినప్పటి నుంచి కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. మొన్న ఎమ్మెల్సీ గా ఎన్నికైన రెండు రోజులకే ఇంటర్నెట్ ద్వారా బెదిరింపు కాల్స్ రావడం,ఇప్పుడేమో ఆ ఎమ్మెల్సీ కి చెందిన ఒక 3 నెలల కాల్ డేటా ప్రవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో ఆ ఎమ్మెల్సీ తల పట్టుకుంటున్నారు. ఎమ్మెల్సీ కాల్ డేటా విషయంలో ఇప్పటికే ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇంతకీ ఆ ఎమ్మెల్సీ కాల్ డేటా లీక్ స్టోరీ ఏంటో చూద్దాం.

ప్రొద్దుటూరుకి చెందిన రమేష్ యాదవ్ గవర్నర్ కొటాలో వైసిపి నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మొదట ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పీఠంపై కూర్చోవాలని ఆయన ఆశపడ్డారు. అయితే కొన్ని సామాజిక సమీకరణాలు నేపథ్యంలో రమేష్ యాదవ్‌కి మున్సిపల్ చైర్మన్ పీఠం అందినట్లే అంది మిస్ అయ్యింది. దీనితో వైసిపి అధిష్టానం మంచి అవకాశం కల్పిస్తామని ఆయనకు భరోసా ఇచ్చారు. తర్వాత కొన్ని రోజులకే ఊహించని అవకాశం రమేష్ యాదవ్ తలుపు తట్టింది. వైసిపి తరుపున గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో అటు వైసిపి స్థానిక నేతలు,జిల్లా స్థాయి నేతలు ఆశ్చర్యపోయారు. అయితే ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే గుర్తు తెలియని ఆగంతుకుడి నుంచి జూన్ 25,26 వ తేదీలలో బెదిరింపు కాల్స్ రావడంతో కంగుతిన్నాడు. దీనిపై ప్రొద్దుటూరులోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచే ఎమ్మెల్సీకి కష్టాలు రెట్టింపు అయ్యాయి..

ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌కి బెదిరింపు కాల్స్ వచ్చాయిని ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు విచారణ చేపట్టారు.ఈ నేపథ్యంలో విచారణ లో భాగంగా ఎమ్మెల్సీ కాల్ హిస్టరీ కావాలని పోలీసులు కోరారు. జూన్ 25,జూన్ 26 వ తేదీ కి చేందిన రెండు రోజుల కాల్ డేటా తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో ఎమ్మెల్సీ అందుకు ఒప్పుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. రెండు రోజుల కాల్ డేటా తీసుకోవాల్సిన వారు దాదాపు 3 నెలల కాల్ డేటాని తీసుకోవడంతో పాటు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ఆ కాల్ డేటా లీక్ కావడంతో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కంగుతిన్నారు. దీనిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కి చెందిన కాల్ డేటా లీక్ కావడం వాస్తవమని నిర్దారించుకున్న జిల్లా పోలీస్ ఉన్నత అధికారులు.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఎమ్మెల్సీకి చెందిన కాల్ డేటా కంప్యూటర్‌లో ఈ-మెయిల్స్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు కాల్స్ డేటా లీక్ అయినట్లు సమాచారం. దీనితో ఉన్నత పోలీసు అధికారులు సీరియస్గా తీసుకుని… ఎమ్మెల్సీ కాల్ డేటా లీక్ పై ఇంకా ఎవరెవరు ఉన్నారో పోలీసులు విచారిస్తున్నారు.

మరో వైపు 3 నెలల కాల్ డేటా లీక్ పై ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ స్పందించారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలీసు శాఖ ఇన్వెస్టిగేషన్ చేస్తోందని, అతి త్వరలో నిందితులను పట్టుకొని శిక్షిస్తారని పోలీసు శాఖపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఫిర్యాదులో భాగంగా ఇప్పటికే కాల్ డేటా విషయంపై ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారని,తనకు తగిన న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్నారు..

ఏది ఏమైనప్పటికి ఎమ్మెల్సీ గా ఎన్నికైనప్పటి నుంచి రమేష్ యాదవ్ కి బెదిరింపు కాల్స్, కాల్ డేటా లీక్ కావడంతో రాజకీయ శత్రువులు ఏర్పడుతున్నారనేది అర్థం అవుతుంది. మరో వైపు ఎమ్మెల్సీకి బెదిరింపు కాల్స్ వచ్చిన రెండు రోజుల డేటాను మాత్రమే సేకరిస్తామని ఎమ్మెల్సీ నుంచి అనుమతి తీసుకుని పోలీసులు 3 నెలల కాల్ డేటా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? పోలీసులు నుంచి కాల్ డేటా తీసుకున్న ప్రైవేట్ వ్యక్తులు ఎవరు? వారికి ఎమ్మెల్సీ 3 నెలల కాల్ డేటా ఏం అవసరం? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

(సేరి సురేష్, TV9 తెలుగు, కడప జిల్లా)

Also Read..

ఖమ్మం జిల్లాలో వైఎస్‌ఆర్‌టీపీ ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’.. నాగేశ్వరరావు కుటుంబ కష్టాలు విని కన్నీరు పెట్టుకున్న షర్మిల

రైతులకు మరో గుడ్ న్యూస్.. వరిగడ్డిని బంగారంగా మార్చే గోల్డెన్ ప్లాన్..