AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: తల్లికి వందనం డబ్బులతో తాగేశాడని… మద్యంలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య

తల్లికి వందనం డబ్బులతో తాగేశాడని.. మద్యంలో విషం కలిపి భర్తను హత్య చేసిందో భార్య. అన్నమయ్య జిల్లా రెడ్డిగానిపల్లెలో జులై 2న ఈ ఘటన జరగ్గా.. ఈ కేసును పోలీసులు ఛేదించారు. మదనపల్లె మండలం రెడ్డిగానిపల్లెలో చంద్రశేఖర్ అనే వ్యక్తి జులై 2వ తేదీ అనుమానాస్పద రీతిలో...

Crime: తల్లికి వందనం డబ్బులతో తాగేశాడని... మద్యంలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య
Wife Murder Husband
K Sammaiah
|

Updated on: Jul 08, 2025 | 12:04 PM

Share

తల్లికి వందనం డబ్బులతో తాగేశాడని.. మద్యంలో విషం కలిపి భర్తను హత్య చేసిందో భార్య. అన్నమయ్య జిల్లా రెడ్డిగానిపల్లెలో జులై 2న ఈ ఘటన జరగ్గా.. ఈ కేసును పోలీసులు ఛేదించారు. మదనపల్లె మండలం రెడ్డిగానిపల్లెలో చంద్రశేఖర్ అనే వ్యక్తి జులై 2వ తేదీ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తులో చంద్రశేఖర్‌ను హత్య చేసింది అతని భార్య రమాదేవిగా తేలింది. ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం డబ్బుతో మద్యం తాగాడన్న కోపంతో ఓ భార్య తన భర్తను కడతేర్చింది.

మదనపల్లె మండలం రెడ్డిగానిపల్లెకు చెందిన వంకోళ్ల చంద్రశేఖర్‌ (46) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తాడు. 20 ఏళ్ల కిందట రమాదేవితో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. చంద్రశేఖర్‌ నిత్యం మద్యం తాగి కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఈ క్రమంలో రమాదేవి పాలెంకొండకు చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లలిద్దరికీ తల్లికి వందనం డబ్బు రమాదేవి ఖాతాలో పడింది. ఈ డబ్బు ఆమె ఏటీఎం ద్వారా చంద్రశేఖర్‌ తీసుకున్నాడు. ఆ డబ్బు ఇవ్వాలని భర్తతో భార్య గొడవపెట్టుకుంది.

ఈ నెల 2వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో చంద్రశేఖర్‌ మద్యాన్ని గ్లాసులో పోసి ఇవ్వమని భార్యకు చెప్పాడు. దీంతో రమాదేవి మద్యంలో విషం కలిపి ఇచ్చింది. దాన్ని తాగిన అతను మళ్లీ భార్యతో గొడవపడ్డాడు. ఈ గొడవలో ఆమె భర్త గొంతును నులిమి, కర్రతో కాలిపై కొట్టింది. దీంతో చంద్రశేఖర్‌ నడవలేక అక్కడే పడిపోయి వేకువజామున రక్తం కక్కుకుని ఇంట్లోనే చనిపోయాడు.

రక్తం మొత్తం శుభ్రం చేసిన రమాదేవి కూలీపనులకు వెళ్లిపోయింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ఆమె మద్యం తాగడంతో తన భర్త చనిపోయినట్లు చుట్టుపక్కల వారికి తెలిపింది. విషయం తెలుసుకున్న మృతుడి సోదరుడు మహేశ్‌ గ్రామానికి చేరుకుని సోదరుడి శరీరంపై గాయాలుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పట్లో అనుమానాస్పదమృతి కేసు నమోదు చేశారు.

పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మద్యంలో విషం కలపడం, గొంతు నులమడం ద్వారా మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. దీంతో రూరల్‌ సీఐ కళా వెంకటరమణ తమ సిబ్బందితో రమాదేవిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుంది. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.