పాకిస్తాన్‌లో అద్భుతం..! కుప్పకూలిన కరాచీ భవనం శిథిలాల్లోంచి మూడు నెలల చిన్నారి నవ్వులు..?
27 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ప్రమాదంలో మూడు నెలల చిన్నారి అద్భుతంగా బయటపడింది. తాను, తన సహచరులు సంఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే శిథిలాల కింద ప్రాణాలతో బయటపడిన వారి కోసం గాలింపు ప్రారంభించామని రెస్క్యూ వర్కర్ మజార్ అలీ తెలిపారు. శిథిలాల కింద మూడు నెలల వయసున్న ఆడ శిశువు సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించామని, పసికందు తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల మృతదేహాలు కొంత దూరంలో గుర్తించామని చెప్పారు.

పాకిస్తాన్‌లో ఒక భవనం కూలిపోయిన ఘటనలో ఊహించని ఒక అద్భుతం జరిగింది. కరాచీలోని లియారి ప్రాంతంలో ఐదు అంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. ప్రమాదం చాలా పెద్దది కావడంతో 53 గంటలకు పైగా నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగాయి. శిథిలాల కింద నుంచి మొత్తం 27 మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాల్లో ఒకే కుటుంబానికి చెందినవారు 20 మంది ఉన్నారు. మృతుల్లో 15 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. రోజుల తరబడి సాగిన ఈ ఆపరేషన్‌లో శిథిలాలను తొలగించడానికి భారీ యంత్రాలు, ఆధునిక పరికరాలను ఉపయోగించినట్లు సమాచారం.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కూలిపోయిన భవనం 30 సంవత్సరాల పురాతనమైనదిగా తెలిసింది. గతంలోనే ఈ భవనం సురక్షితం కాదని గుర్తించారట. కాగా, సంబంధిత అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. అయితే, ఆశ్చర్యకరంగా ఈ భయంకర ప్రమాదంలో మూడు నెలల బాలిక సురక్షితంగా బయటపడింది. ఆమెకు ఎటువంటి హాని కలుగలేదు. స్వల్ప గాయాలతో మృత్యువును జయించి బయటపడ్డ ఆ చిన్నారి గురించి విని అందరూ ఆశ్చర్యపోయారు.
ఇంత పెద్ద ప్రమాదం ఎలా, ఎందుకు జరిగిందనే దానిపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లియారిలోని దాదాపు 22 శిథిలావస్థలో ఉన్న భవనాల్లో 14 భవనాలను ఖాళీ చేయించామని సింధ్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, దీని వెనుక ఉన్న కారణాల గురించి అధికారులు ఇంకా ఏమీ చెప్పలేదు. ఈ భవనం కూడా శిథిలావస్థలో ఉందని, బలహీనంగా ఉండటం వల్ల కూలిపోయిందని చెబుతున్నారు.
కానీ, 27 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ప్రమాదంలో మూడు నెలల చిన్నారి అద్భుతంగా బయటపడింది. తాను, తన సహచరులు సంఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే శిథిలాల కింద ప్రాణాలతో బయటపడిన వారి కోసం గాలింపు ప్రారంభించామని రెస్క్యూ వర్కర్ మజార్ అలీ తెలిపారు. శిథిలాల కింద మూడు నెలల వయసున్న ఆడ శిశువు సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించామని, పసికందు తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల మృతదేహాలు కొంత దూరంలో గుర్తించామని చెప్పారు. చిన్నారి ఒంటినిండా దుమ్ముతో కప్పబడి ఉందని, చిన్న గాయం కారణంగా ఆమె ముక్కు నుండి రక్తం కారుతోందని మజార్ చెప్పారు. ఇది కాకుండా, బాలిక శరీరంపై ఎటువంటి గాయాలు లేవని ఆయన అన్నారు.
శిశువు దొరికిన కొద్ది దూరంలోనే ఆమె తల్లి మృతదేహం శిథిలాల నుండి బయటకు తీశారు. అక్కడే వారి కుటుంబంలోని ఇతర సభ్యుల మృతదేహాలను కూడా భారీ శిథిలాల నుండి బయటకు తీశారు. భవనం కూలిపోతున్న క్రమంలోనే ఆ తల్లి తన బిడ్డను కాపాడటానికి పసికందును దూరంగా విసిరివేసి ఉండవచ్చునని, ఆ కారణంగానే చిన్నారి ప్రాణాలతో బయటపడి ఉంటుందని మజార్ అభిప్రాయపడ్డారు. ఇక సంఘటనా స్థలంలో గాయపడిన వారంతా సమీప ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




