తండ్రిని చంపిన భర్తపై పగ పెంచుకుంది.. పుట్టింటి వారి సహాయంతో హతమార్చింది.. పోలీసుల ఎంట్రీతో బయటపడ్డ భార్య బండారం

తండ్రిని హత్య చేసిన భర్తపై పగబట్టిన భార్య అతనితో మంచిగా ఉంటూనే సమయం కోసం వేచిచూసి పుట్టింటివారితో కలిసి హతమార్చింది.

తండ్రిని చంపిన భర్తపై పగ పెంచుకుంది.. పుట్టింటి వారి సహాయంతో హతమార్చింది..  పోలీసుల ఎంట్రీతో బయటపడ్డ భార్య బండారం
Murder

Wife killed Husband: నాలుగు రోజుల నుంచి తమ్ముడు కనిపించకుండా పోయాడు. అతని భార్యను ఆరా తీస్తే పని మీద పోయాడని, నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది. అనుమానం వచ్చిన అన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నిద్రపోతున్న భర్తను పుట్టింటి వారి సహాయంతో హతమార్చి సాగర్ కాల్వలో పడేసినట్లు ఒప్పుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తండ్రిని హత్య చేసిన భర్తపై పగబట్టిన భార్య అతనితో మంచిగా ఉంటూనే సమయం కోసం వేచిచూసి పుట్టింటివారితో కలిసి హతమార్చింది. నాగర్ కర్నూలు జిల్లా మాడ్గుల మండలం ఇర్విన్‌ పంచాయతీ పరిధి గాంగ్యనగర్‌తండాకు చెందిన వడ్త్య శంకర్‌(28)కు చెట్లకుంటతండాకు చెందిన మమతతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. చెట్లకుంటతండాలోనే నివాసముంటున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. శంకర్‌కు మామ మేరావత్‌ లాలుతో తరచూ పొలం విషయంలో గొడవలు జరిగేవి. రెండున్నరేళ్ల కిందట ఇద్దరు కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లికి పని కోసం వెళ్లారు. అక్కడ గొడవ జరగడంతో రోలుతో మామను కొట్టి హత్యచేశాడు శంకర్‌. ఈ కేసులో జైలుకెళ్లి వచ్చాడు.

ఇదిలావుండగా, తండ్రిని చంపిన భర్తను ఎలాగైనా అంతం చేయాలనుకున్న భార్య మమత, అతనిపై పగ పెంచుకొంది. పది రోజుల క్రితం పుట్టింటి వారిని ఇంటికి పిలిపించుకుంది. శంకర్‌ నిద్రపోయాక బంధువులతో కలిసి గొంతుకు తాడు బిగించి చంపేసింది. మృతదేహాన్ని నల్గొండ జిల్లా నిడమనూరు వద్ద సాగర్‌ ఎడమ కాలువలో పడేశారు. ఈనెల 19న శంకర్‌కు అన్న రవీందర్‌నాయక్‌ ఫోన్‌ చేయగా సమాధానం రాలేదు. తమ్ముడి జాడ కనిపించకపోవడంతో మరదల్ని ప్రశ్నించగా తనకు తెలియదని చెప్పడంతో మాడ్గుల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తమ్ముడి అత్తింటివారిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో భార్య మమతను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

అయితే, తనకు తెలియదని ముందుకు బుకాయించిన మమత, పోలీసులు తమదైన స్టైలులో విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భర్తను తామే కుటుంబసభ్యుల సహాయంతో హత్య చేసినట్లు నేరం అంగీకరించింది. దీంతో హత్యకు పాల్పడిన మమత(23), శంకర్‌ అత్త సోని(50), తోడళ్లుళ్లు బాలాజీ(35), గోపి(31), వదినలు అనిత(27), సునీత(25)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మాడ్గుల సీఐ తెలిపారు.