భార్య కాపురానికి రావటంలేదని దారుణానికి ఒడిగట్టిన భర్త.. నిప్పంటుకుని దంపతుల దుర్మరణం
క్షణికావేశం ఓ రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. సంసారం అన్నాక, గొడవలు రాకుండ ఉండవు. అంత మాత్రాన, అదే సాకుగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
wife and husband suicide : క్షణికావేశం ఓ రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. సంసారం అన్నాక, గొడవలు రాకుండ ఉండవు. అంత మాత్రాన, అదే సాకుగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా కలహాలు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. వరంగల్ కరీమాబాద్ 23వ డివిజన్ ఎస్‌ఆర్‌ఆర్ తోటలో భార్యాభర్తలిద్దరు మంటల్లో కాలిబూడిదయ్యారు. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మిల్స్‌కాలనీ పోలీసుల కథనం ప్రకారం.. ఎస్‌ఆర్‌ఆర్ తోటకు చెందిన బండి భాస్కర్(43) ఆటో డ్రైవర్‌గా స్ధిరపడ్డాడు. భార్య విజయ(35)తో కలిసి బట్టల వ్యాపారం కూడా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వారికి 13 సంవత్సరాల అశ్రిత్ అనే కుమారుడున్నాడు. రెండు నెలలుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా భర్తపై విజయ మిల్స్‌కాలనీ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.భర్త వేధింపులు భరించలేక తన తల్లిగారింట్లోనే ఉంటోంది విజయ.
ఇదే క్రమంలో భార్యను పంపించాలని భాస్కర్ స్థానిక పెద్దలను ఆశ్రయించారు. ఇక నుంచి బుద్ధిగా ఉంటానంటూ కబురు కూడా చెప్పాడు. అయితే ఆమె మాత్రం కాపురానికి రానని తేల్చి చెప్పేసింది. దీంతో భాస్కర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం వారి కుమారుడు అశ్రిత్ పుట్టిన రోజు సందర్భంగా విజయ తన తల్లిగారింటి వద్ద కేకు కోసి సంబురాలు చేసుకుంటున్న సమయంలో అటుగా వచ్చిన భర్త భాస్కర్, విజయతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అప్పటికే తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని వచ్చిన భాస్కర్ భార్య దగ్గర వరకు వెళ్లి తాను నిప్పటించుకొని భార్యను గట్టిగా పట్టుకున్నాడు. ఆ మంటలకు అక్కడున్న వారంతా పరుగులు తీశారు. ఎదురింటికి చెందిన ఓ మహిళ భాస్కర్‌ను వారించే ప్రయత్నం చేయగా ఆమెనూ పట్టుకోబోయాడు. ఆమె అక్కడ నుంచి పరుగులు తీసి తప్పించుకుంది.
దీంతో తీవ్రంగా గాయపడ్డ భాస్కర్ అక్కడికక్కడే మృతి చెంది. మరోవైపు పూర్తిగా కాలిన విజయ కూడా కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలింది. అందరూ చూస్తుండగానే భార్యాభర్తలిద్దరు మృతిచెందడం తీవ్ర విషాదం నింపింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.