ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో పెను విషాదం.. విహారయాత్రకు వెళ్లి విగత జీవులుగా మిగిలారు..

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాలలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ముగ్గురు యువకులు మృతి చెందారు.

  • Publish Date - 12:06 am, Mon, 21 December 20
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో పెను విషాదం.. విహారయాత్రకు వెళ్లి విగత జీవులుగా మిగిలారు..

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాలలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. వీరంతా కల్లూరు మండలం బత్తలపల్లికి చెందిన గ్రామస్థులు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పులిగుండాల ప్రాజెక్ట్ దగ్గరకు సరదాగా గడిపేందుకు జంగారామ నరసింహారెడ్డి, వేమిరెడ్డి సాయిరెడ్డి, శీలం వెంకట చలపతి రెడ్డి, అవులూరి శంకర్ రెడ్డి, వేల్పుల నరసింహారావు, పొదిలి శ్రీనివాసరావు, కలసని ఉపేందర్, వేల్పుల మురళి, కూరాకుల శ్రీకాంత్‌లు కలిసి వెళ్లారు.

అక్కడ సరదాగా వంట చేసుకొని తిని ఆనందంగా గడిపారు. అనంతరం జంగారామ నరసింహారెడ్డి, వేమిరెడ్డి సాయిరెడ్డి, శీలం వెంకట చలపతి రెడ్డితో పాటు మరో ఇద్దరు ఈత కొట్టేందుకు చెరువులోకి దిగారు. అయితే ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో వారందరు ఒక్కసారిగా కొట్టుకుపోయారు. గమనించిన మిగతావారు వారిలో ఇద్దరిని కాపాడారు. మిగిలిన ముగ్గురు గల్లంతై మృతిచెందారు.ఈ ఘటనతో బత్తలపల్లిలో విషాదం అలుముకుంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, మత్స్యకారులు వలతో చెరువులో వెతగ్గా చీకటి పడ్డ తర్వాత మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, ఏసీపీ వెంకటేశ్​, ఆర్డీవో సూర్యనారాయణ పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.