Jagityal Road Accident: కుటుంబాన్ని మింగేసిన డీసీఎం వ్యాన్.. జగిత్యాల జిల్లా రోడ్డు ప్రమాదంలో చిన్నారులతో సహా తండ్రి మృతి
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృత్యువాతపడగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలను కోల్పోయారు.
Jagityal Road Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృత్యువాతపడగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలను కోల్పోయారు. వెల్గటూరు మండలం పాశిగామ శివారులో గురువారం సాయంత్రం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో పాటు మరో బాలుడు సైతం తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వెల్గటూరు మండలం కొత్తపేటకు చెందిన కోడిపుంజుల తిరుపతి (40) స్థానికంగా చికెన్ సెంటర్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి భార్య మనోజ, కొడుకులు ఆదిత్య, కన్నయ్యతో పాటు కూతురు చిట్టీ ఉన్నారు. తిరుపతి భార్య మనోజ అత్త గత మూడు నెలల కిందట మృతి చెందింది. గురువారం మూడు నెలల మాసికం కార్యక్రమం ఉండడంతో కుటుంబసమేతంగా హాజరయ్యేందుకు.. తిరుపతి ద్విచక్ర వాహనంపై ధర్మపురి మండలం దమ్మన్నపేటకు బయలుదేరాడు.
కార్యక్రమం పూర్తి అయిన అనంతరం తిరిగి ప్రయాణంలో భార్య, పిల్లలతో కలిసి తిరిగి కొత్తపేట వస్తుండగా.. పాశిగామ శివారులో వెనుక నుంచి వచ్చిన డీసీఎం వ్యాన్ వారి బైక్‌ను ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో వాహనంపై ఉన్న వారంతా ఎగిరిపడ్డారు. వారిపై నుంచి వాహనం దూసుకెళ్లడంతో శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. తీవ్ర గాయాలతో చిట్టీ, కన్నయ్య అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. తిరుపతిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. భార్య మనోజ, కుమారుడు ఆదిత్యకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో రక్తపు మరకలు, తెగిపడ్డ శరీర భీతావహ దృశ్యాలు కనిపించాయి.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.