AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nalgonda District: మొండెం లేని తల కేసులో వీడుతున్న మిస్టరీ.. వెలుగులోని సంచలన విషయాలు !

నల్లగొండ జిల్లాలో మెట్టు మహాంకాళి మాత పాదాల వద్ద లభ్యమైన మొండెం లేని తల కేసు మిస్టరీ వీడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో పది రోజులకు ఓ సంచలన విషయం బయటకు వచ్చింది.

Nalgonda District: మొండెం లేని తల కేసులో వీడుతున్న మిస్టరీ.. వెలుగులోని సంచలన విషయాలు !
Nalgonda Murder Case
Ram Naramaneni
|

Updated on: Jan 20, 2022 | 5:18 PM

Share

నల్లగొండ జిల్లాలో మెట్టు మహాంకాళి మాత పాదాల వద్ద లభ్యమైన మొండెం లేని తల కేసు మిస్టరీ వీడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో పది రోజులకు ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. హత్య చేయబడ్డ జయేందర్ నాయక్ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గుప్త నిధులు, క్షుద్రపూజల కారణంగానే నరబలి ఇచ్చారాన్న అనుమానాలు బలపడుతున్నాయి. నరబలి వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం.

ఉగ్రరూపానికి మారుపేరైన మహంకాళి మాత పాదాల చెంత తల ఉంచడంలోనే నరబలి జరిగింది అన్న ప్రచారం జరిగింది. ఈనెల 10న తెల్లవారు జామున నల్గొండ జిల్లా చింతపల్లి మండలం విరాట్‌నగర్‌ కాలనీ నాగార్జున సాగర్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారి వెంట ఉన్న మెట్టు మహంకాళీ మాత విగ్రహం పాదాల వద్ద మొండెం లేని తల వెలుగు చూసిన ఈ సంఘటన మూఢ నమ్మకాలకు బలం చేకూరుస్తోంది. నల్గొండ, నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లో గిరిజనులు ఎక్కువగా ఉంటారు. గతంలోనూ ఈ ప్రాంతాల పరిధిలో గుప్త నిధుల కోసం, అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్యలు జరిగాయి. నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం, నాంపల్లి మండలం ముష్టిపల్లి, దేవరకొండ గుట్టల్లోనూ గుప్త నిధుల కోసం ఇలాంటి ఘటనలు జరిగాయి.

హత్య చేయబడ్డ వ్యక్తి సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యపాడు తండాకు చెందిన జయేందర్ నాయక్ (30) గా పోలీసులు గుర్తించారు. హత్య మిస్టరీని ఛేదించేందుకు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. గత 18 నెలలుగా మతిస్థిమితం కోల్పోయి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని తుర్కయాంజాల్‌ సమీపంలోని ఓ ఆలయం వద్ద ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తుండేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఈనెల 13న సాయంత్రం తుర్కయాంజిల్ లోని ఓ నాలుగు అంతస్థుల భవనంపై మట్టి ఇటుకల మధ్యలో దుప్పట్లో చుట్టి ఉన్న జయేందర్ నాయక్ మొండెంను పోలీసులు గుర్తించారు. అయితే మొండెం దొరికిన భవనంలోనే గత ఆరు నెలలుగా నిద్రించేవాడని పోలీసులు గుర్తించారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆ భవనం నుంచి వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. ఎవరా ఇద్దరు వ్యక్తులు…? ఎందుకింత దారుణంగా హత్య చేసి తలను 50 కిమీ దూరంలో ఉన్న మహంకాళి మాత పాదాల వద్ద వదిలి వెళ్ళి పోయారు…. అన్నది తేలాల్సి ఉంది. హత్య జరిగిన భవనం కూడా ఓ గిరిజనుడిది కావడం, ఆ భవనం యజమానికి ఇద్దరు భార్యలు ఉండడం.. అదే సమయంలో ఆ ఇంటి యాజమాని సైతం గతంలో హత్యకు గురికావడం వంటి విషయాలు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి.

నాలుగేళ్లుగా నిర్మాణంలోనే ఆగిపోయిన ఆ భవనంలోనే ఎందుకు హత్య చేశారు. హత్య చేయబడ్డ వ్యక్తికి అదే ప్రాంతంలో ఉన్న తండాకు చెందిన ఓ మహిళతో గతంలో అక్రమ సంబంధం నేపథ్యంలో ఇలా చేశారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ హత్య వెనుక ఓ రియల్టర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించి అతనితో సహా మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కోటీశ్వరులు కావడం కోసం అనుకున్నది సాధించాలనే దురాలోచనలతో నరబలి ఇచ్చారా… నిర్మాణంలో ఉన్న ఆ భవనంలో లోపాలు సరిచేయడానికి ఇలా చేశారా అన్న ప్రచారాలకు పులిస్టాప్ పెట్టాలంటే పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. మిర్యాలగూడలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో జయేందర్ నాయక్ మతిస్థిమితం కోల్పోయారని.. అయితే మతి పోయిన వ్యక్తిని బలి ఇస్తే అడిగేవారు ఉండరని భావించిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని… ఇది నరబలి అని జయేందర్ నాయక్ తండ్రి శంకర్ నాయక్ ఆరోపిస్తున్నారు.

కాగా ఈ హత్య కేసు  మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. సవాల్గా మారిన ఈ కేసు విచారణలో రాచకొండ పోలీసుల సహకారం కూడా నల్గొండ జిల్లా పోలీసులు తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ కేసును దర్యాప్తు పూర్తి చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

Also Read:  ఏపీలో ప్రమాదకరంగా కరోనా వ్యాప్తి.. భారీగా పెరిగిన యాక్టివ్ కేసులు.. ఆ 2 జిల్లాల్లో కల్లోలం

సాయి మాలలో ఇంట్లోకి వచ్చారు.. ఆశీస్సులు ఇస్తారనుకుంటే.. సీన్ రివర్స్