SCCL: సింగరేణి ఘటనలో న‌లుగురి మృతదేహాలు లభ్యం.. సంతాపం తెలిపిన మంత్రులు.. కార్మికులకు అండగా ఉంటామన్న సీఎండీ

గనిలోని 21 డిప్‌ 24 లెవల్‌, 3ఎస్‌పీ 2 సీం వద్ద గని పైకప్పు రక్షణ చర్యలు చేపడుతున్న టింబర్‌మెన్‌ బేర లచ్చయ్య (60), సపోర్ట్‌మెన్‌ వీ క్రిష్ణారెడ్డి (59), బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహారాజు (30), రెంక చంద్రశేఖర్‌(30)కార్మికులు బండ కింద కూరుకుపోయి అక్కడికక్కడే మరణించారు.

SCCL: సింగరేణి ఘటనలో న‌లుగురి మృతదేహాలు లభ్యం.. సంతాపం తెలిపిన మంత్రులు.. కార్మికులకు అండగా ఉంటామన్న సీఎండీ
Singareni Mine Mishap
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 10, 2021 | 9:24 PM

Singareni Mine Mishap: మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండలం శ్రీరాంపూర్‌ డివిజన్‌ పరిధిలోని ఎస్సార్పీ 3 గనిలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు ప్రాణాలను కోల్పోయారు. గనిలోని 21 డిప్‌ 24 లెవల్‌, 3ఎస్‌పీ 2 సీం వద్ద గని పైకప్పు రక్షణ చర్యలు చేపడుతున్న టింబర్‌మెన్‌ బేర లచ్చయ్య (60), సపోర్ట్‌మెన్‌ వీ క్రిష్ణారెడ్డి (59), బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహారాజు (30), రెంక చంద్రశేఖర్‌(30)కార్మికులు బండ కింద కూరుకుపోయి అక్కడికక్కడే మరణించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న గని అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ టీంతో సహాయక చర్యలు చేపట్టారు. గనిపై కప్పు 14 మీటర్ల పొడవు, 10 ఫీట్ల వెడల్పు, 15 ఫీట్ల మందంతో కూలిందని అధికారులు తెలిపారు. రాత్రి 9 గంటల వరకు నలుగురి మృతదేహాలను రెస్క్యూ టీం వెలికితీశారు.

గని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడంపై గుర్తింపు కార్మిక సంఘం, టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కార్మికుల కుటుంబాలకు టీబీజీకేఎస్‌ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా రక్షణ చర్యలు పటిష్టం చేయాలని అధికారులను కోరారు.

కార్మికుల మరణం పట్ల మంత్రులు హ‌రీశ్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కార్మికుల మృతి దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.

కార్మికులు మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.తక్షణమే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో కార్మికుల భద్రత విషయంలో తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సింగరేణి డీజీఎంఎస్ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ) కు లేఖ రాయనున్నట్లు తెలిపారు.

ఇదిలావుంటే, గని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడంపై సంస్థ సీఅండ్‌ఎండీ ఎన్‌ శ్రీధర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై తక్షణమే విచారణ జరిపి నివేదికనివ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ అండగా ఉంటుందని తెలిపారు. కంపెనీ తరపున చెల్లించాల్సిన పరిహారాన్ని తక్షణమే వారి కుటుంబసభ్యులకు అందజేయాలని ఆదేశించారు. కార్మికుల మృతి ఆ కుటుంబంలో తీవ్ర శోకం నింపుతుందని, వారు లేని లోటు కంపెనీ తీర్చలేక పోయినప్పటికీ తోటి సింగరేణి కుటుంబ సభ్యులుగా వారికి యాజమాన్యం అండగా ఉంటుందని తెలిపారు. దీనిలో భాగంగా కార్మికుల కుటుంబీకుల్లో అర్హులైన ఒకరికి తక్షణమే వారు కోరుకున్న ఏరియాలో ఉద్యోగం కల్పించనున్నామని ప్రకటించారు. అలాగే గని మ్రాదంలో మృతి చెందిన కార్మికులకు యాజమాన్యం తరపున చెల్లించే మ్యాచింగ్‌ గ్రాంట్‌, గ్రాట్యూటీ తదితర చెల్లింపులు కలుపుకొని సుమారు రూ. 70 లక్షల నుంచి రూ. కోటి వరకు అందజేయనున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన సంబంధిత అధికారులకు మౌఖిక ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also….  Lakshman Naik IPS: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి లక్ష్మణ్‌ నాయక్‌పై వేటు.. సస్పెండ్‌ చేసిన కేరళ ప్రభుత్వం.. కారణం అదేనా..?