కర్నూలు జిల్లా స్కూల్ దంపతుల ఆత్మహత్యకు కారణం అదే.. తీవ్ర ఆరోపణలు చేసిన ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్

కర్నూలు జిల్లా స్కూల్ దంపతుల ఆత్మహత్యకు కారణం అదే.. తీవ్ర ఆరోపణలు చేసిన ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్
Couple Sucide

కరోనా మహమ్మారి మిగిల్చిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు.. ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఉపాథి కోల్పోయి.. వీధిన పడ్డారు. టీచర్లకు జీతాలు ఇవ్వలేక.. భవనాల అద్దెలు చెల్లించలేక...

Balaraju Goud

| Edited By: Ravi Kiran

Aug 17, 2021 | 3:11 PM

Private schools Association: కరోనా మహమ్మారి మిగిల్చిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు.. ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఉపాథి కోల్పోయి.. వీధిన పడ్డారు. టీచర్లకు జీతాలు ఇవ్వలేక.. భవనాల అద్దెలు చెల్లించలేక ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం సతమతం అవుతున్నారు. ఈ క్రమంలోనే.. స్కూల్ నిర్వహణ కోసం సన్నిహితుల దగ్గర్నుంచి తెచ్చిన అప్పులు తీర్చలేక.. వడ్డీలు తడిసి మోపెడు కావడంతో.. కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన లైఫ్ ఎనర్జీ స్కూల్ కరస్పాండెంట్ దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

లైఫ్ ఎనర్జీ స్కూల్ కరస్పాండెంట్ సుబ్రహ్మణ్యం అతని భార్య రోహిణి ఆత్మహత్యపై ప్రైవేట్ స్కూల్ ఓనర్స్ అసోసియేషన్ స్పందించింది. ఆర్థికంగా చితికిపోతున్న ప్రైవేట్ స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన దంపతుల అంత్యక్రియలలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు. కోవిడ్ కష్టకాలంలో భుత్వ చర్యలు ప్రైవేట్ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. అలాగే, ఏపీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం కూడా ప్రైవేట్ స్కూల్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. స్కూల్ ఫీజు అడిగితే అమ్మఒడి డబ్బులు పడిన తర్వాత ఇస్తామని పేరెంట్స్ చెబుతున్నారని, అమ్మఒడి డబ్బులు వచ్చిన తర్వాత అడిగితే ఇవ్వడం లేదని వాపోయారు అసోసియేషన్ నేతలు. అమ్మ వాడి డబ్బులు పేరెంట్స్ ఖాతాల్లోకి కాకుండా స్కూల్ మేనేజ్‌మెంట్ అకౌంట్లలో వేయాలని వారు డిమాండ్ చేశారు. కోవిడ్ కాలానికి సంబంధించి ప్రతి ప్రైవేటు టీచర్ కు నెలకు ఐదు వేల చొప్పున ప్రభుత్వం సహాయం చేయాలని కోరిన నేతలు.. కోవిడ్ కాలంలో కరెంటు బిల్లు మాఫీ చేయాలన్నారు.

సుబ్రహ్మణ్యం, రోహిణీ దంపతులు గత ఐదేళ్లుగా కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో లైఫ్ ఎనర్జీ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని కొంతమంది ప్రైవేటు వ్యక్తుల వద్ద సుమారు రెండున్నర కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. గత సంవత్సరం నుంచి కరోనాతో స్కూళ్లు మూసివేయడంతో నష్టాలు వచ్చాయి. అప్పులు చెల్లించడం ఇబ్బందిగా మారగా.. డబ్బులు తిరిగి ఇవ్వాలని అప్పు ఇచ్చిన వారు తీవ్ర ఒత్తిడి చేయసాగారు.

ఇది తట్టుకోలేక.. ఆదివారం ఆత్మకూరులో ఓ వివాహనికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో.. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద భార్యభర్తలిద్దరు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు కారణం సుమన్, శ్రీను, బాలాజీ సింగ్ కుమారుడు, సునీల్ కుమార్ చేసిన వేధింపులు, అవమానాలే కారణమని.. వారి వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నామని దంపతులు సెల్ఫీ వీడియో తీశారు. కోవెలకుంట్లకు వస్తూ మార్గమధ్యంలోనే విష గుళికలు మింగారు. అక్కడికి చేరుకున్న బంధువులు వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి దంపతులు ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. కాగా, సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకుంటున్న క్రమంలో ఈ విషాద ఘటన చోటు చేసుకోవడం స్థానికులను కలిచివేసింది.

మరోవైపు, దంపతుల ఆత్మహత్యకు పాల్పడిన సుబ్రహ్మణ్యం కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆత్మకూరు పోలీసులు తెలిపారు. కాగా, సుబ్రహ్మణ్యం, అతని భార్య రోహిణి ఆత్మహత్యకు సంబంధించి సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఈ దిశగా విచారణ చేపట్టారు.

Read Also..  Covid-19 vaccination: దేశంలో 55 కోట్ల మార్క్ దాటిన కోరోనా వ్యాక్సినేషన్.. నిన్న రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ..

Ancient Greek Ghost: ఆ ఇంట్లో సంకెళ్లతో దెయ్యం.. రాత్రి అయితే చాలు శబ్దాలు విడిపించమని విన్నపాలు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu