Cake Drugs: సైకాలజిస్ట్ నయా దందా.. కేకుల్లో డ్రగ్స్ పెట్టి రేవ్ పార్టీలకు సరఫరా.. విచారణలో షాకింగ్ నిజాలు
NCB Arrests psychologist: ఎలాగైనా అడ్డంగా సంపాదించాలనే కక్కుర్తితో.. ఉన్నత విద్యావంతులు కూడా అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా.. మనుషుల మసస్తత్వంపై అధ్యయనం చేసే ఓ సైకాలజిస్టు
NCB Arrests psychologist: ఎలాగైనా అడ్డంగా సంపాదించాలనే కక్కుర్తితో.. ఉన్నత విద్యావంతులు కూడా అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా.. మనుషుల మసస్తత్వంపై అధ్యయనం చేసే ఓ సైకాలజిస్టు కూడా డబ్బుకోసం అడ్డదారులు తొక్కి పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని ఓ ఆసుపత్రిలో సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్న రహమీన్ చరాణియా (25) ఓ బేకరీ ప్రారంభించి కేకుల్లో డ్రగ్స్ పెట్టి సరఫరా చేస్తూ దొరికిపోయాడని ఎన్‌సీబీ అధికారులు బుధవారం వెల్లడించారు. ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించగా కేకులు, బ్రౌనీల్లో డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నాడని తేలిందన్నారు. ఈ డ్రగ్స్ కేకులను రేవ్ పార్టీలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు ఎన్‌సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ మీడియాతో మాట్లాడారు. చూడటానికి కేకుల్లా కనిపించినా.. వీటిల్లో డ్రగ్స్ నింపి డెలివరీ చేస్తున్నట్లు వివరించారు. తనిఖీల్లో 10 కిలోల కేకుల్లో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించామన్నారు. జనాలను ఆకట్టుకునేందుకు రెయిన్‌బో కేకులని చెప్పి అందులోని తయారు చేసే మైదాపిండిలో మాదకద్రవ్యాలను కలుపుతున్నట్లు వివరించారు. చరాణియా ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించగా.. రూ.1.7లక్షలు విలువజేసే ఓపీఎమ్ డ్రగ్ లభ్యమైందని పేర్కొన్నారు. కాగా.. ఎన్‌సీబీ విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయని అధికారులు తెలిపారు.
ఓటీటీల్లో వచ్చే అంతర్జాతీయ వెబ్‌సిరీస్‌లు చూసి ఇలాంటి ఈ దందా చేస్తున్నట్లు నిందితుడు ఎన్‌సీబీ అధికారులకు తెలిపాడు. కేకుల్లో డ్రగ్స్ పెట్టి సరఫరా చేయడం క్షుణ్ణంగా పరిశీలించానని.. ఆతర్వాత తాను కూడా ఇలాంటి దందా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడన్నారు. అయితే.. డ్రగ్స్ విక్రయాన్ని సోషల్ మీడియా ద్వారా నిర్వహించేవాడని, దీనికోసం సౌత్, వెస్ట్ ముంబైలో రమ్‌జాన్ అనే వ్యక్తిని సహాయకుడిగా నియమించుకున్నాడని అధికారులు తెలిపారు. అతడిని కూడా పోలీసులు పట్టుకున్నట్లు వెల్లడించారు. డబ్బు సంపాదించాలనే ఆశతో డ్రగ్స్ వ్యాపారాన్ని ఎంచుకున్నాడని జోనల్ డైరెక్టర్ సమీర్ వివరించారు.
Also Read: