AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tahawwur Rana: ముంబై ఉగ్రదాడి కేసులో ముందడుగు.. మరికొన్ని గంటల్లోనే భారత్‌కు కీలక నిందితుడు

ముంబై పేలుళ్లకు కారణమైన తహవూర్ రాణా మరికొన్న గంటల్లో ఇండియాకు రానున్నాడు. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ తహవూర్ వేసిన పిటిషన్లను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో తహవూర్‌ను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారుజామున తహవూర్ రాణా భారత్‌కు చేరుకుంటాడని NIA అధికారులు వెల్లడిచారు. దీంతో ఢిల్లీలోని తీహార్ జైలు, ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులోని హై-సెక్యూరిటీ సెల్స్‌ను అప్రమత్తం చేసినట్లు అధికారులు ధృవీకరించారు.

Tahawwur Rana: ముంబై ఉగ్రదాడి కేసులో ముందడుగు.. మరికొన్ని గంటల్లోనే భారత్‌కు కీలక నిందితుడు
Tahawwur Rana
Gopikrishna Meka
| Edited By: Anand T|

Updated on: Apr 09, 2025 | 1:40 PM

Share

2008 నవంబర్ 26న ముంబై నగరంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడులను భారతదేశ చరిత్రలో ఎవరు మరిచిపోలేరు. పాకిస్తాన్‌లోని లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబైకి చేరుకుని, నగరంలోని పలు కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్, నరిమన్ హౌస్, కామా హాస్పిటల్, లియోపోల్డ్ కేఫ్ వంటి ప్రాంతాల్లో AK-47 రైఫిళ్లు, గ్రనేడ్లు, RDX బాంబులతో ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో ఏకంగా 175 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 600 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 60 గంటల పాటు సాగిన ఈ దాడులను జాతీయ భద్రతా గార్డ్ (NSG) కమాండోలు అంతమొందించారు. ఈ ఘటనలో పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను 2012లో భారత ప్రభుత్వం ఉరితీసింది.

ఈ ఉగ్రదాడి కారణమైన కీలక నిందితుల్లో తహవూర్ రాణా కూడా ఒకడు. రాణా పాకిస్తానీ కెనడియన్ వ్యాపారవేత్తగా ఉంటూ, ఈ దాడులకు ముందు ముంబైలో సర్వే చేసిన డేవిడ్ కోల్మన్ హెడ్లీకి సహాయం చేశాడని ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. లష్కర్-ఎ-తోయిబాతో సంబంధాలు కలిగి ఉన్న రాణాపై భారత్‌లో నేరపూరిత కుట్ర, ఉగ్రవాద చర్యలు, హత్య వంటి ఆరోపణలతో పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇతను అమెరికాలో ఉన్న లాస్ ఏంజిల్స్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నాడు.

ఇటీవల అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీ తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కోరారు. అందుకు అంగీకరించిన ట్రంప్‌ రాణాను భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లను పూర్తి చేయించారు. ఇప్పటివరకు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్న రాణాను భారత్‌కు అప్పగించే ప్రక్రియను అమెరికా పూర్తి చేసింది. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ తహవూర్ వేసిన పిటిషన్‌లను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. రేపు (ఏప్రిల్ 10, 2025) లేదా ఇవాళ రాత్రికి తహవూర్ రాణా భారత్‌కు చేరుకోనున్నాడు. ఇద్దరు NIA అధికారులు, ఇంటలిజెన్స్ సహా దర్యాప్తు అధికారుల బృందం అతన్ని ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకురానుంది.

భారత్‌కు వచ్చిన వెంటనే రాణాను ఢిల్లీ NIA కోర్టులో హాజరుపరచనున్నారు. ఆ తర్వాత జైలుకు తరలించనున్నారు. అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముంబై లేదా ఢిల్లీ జైళ్లలో రాణా కోసం అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తహవూర్ రాణా రాకతో, ఈ కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..