Maoist Martyrs: నిశ్శబ్దంగా దండకారణ్యం.. ఏజెన్సీలో మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు
Maoist Martyrs Week celebrations: దండకారణ్యం ఎరుపెక్కింది.. వారోత్సవాలకు సిద్దమైంది. ఇదంతా నిశ్శబ్దంగా సాగుతోంది. బుధవారం నుంచి (జూలై 28) జరుగనున్న మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపధ్యంలో ఏవోబీ..
Maoist Martyrs’ Week – Andhra Odisha Border: దండకారణ్యం ఎరుపెక్కింది.. వారోత్సవాలకు సిద్దమైంది. ఇదంతా నిశ్శబ్దంగా సాగుతోంది. బుధవారం నుంచి (జూలై 28) జరుగనున్న మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపధ్యంలో ఏవోబీ(ఆంధ్ర – ఒడిశా బోర్డర్)లో హై అలర్ట్‌గా మారింది. రంగంలోకి అదనపు పోలీస్ బలగాలు.. విశాఖ ఏజెన్సీలో వాహనాలను తనిఖీలు ముమ్మరం చేశారు. ఇన్ఫార్మర్ల నెపంతో గిరిజనులను మిలీషియా నాయకులు హతమార్చే అవకాశముందని భావిస్తున్న పోలీస్ వర్గాలు.. ఆ ముందస్తు చర్యలకు దిగుతున్నారు. ఇలా ఉండగా, వారోత్సవాల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో పోలీసులు మావోల కోసం జల్లెడపడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా చింతాగుఫా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కు చెందిన రెండు బెటాలియన్లు, డీఆర్జీ, ఎస్టీఎఫ్ భద్రతా దళాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
మావోయిస్టుల మాయమాటల్లో గిరిజనులు పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు. పోలీసులిస్తున్న ఉపాధి శిక్షణను గిరియువత సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. మావోయిస్టుల వారోత్సవాల దృష్ట్యా పోలీస్ బలగాలు అడవుల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల నుంచి కూంబింగ్ ఆపరేషన్ ను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
డ్రోన్లను సైతం..
ఈనెల 26 నుండి మావోయిస్టులు వారోత్సవాలు జరుపుతున్నారనే సమాచారంతో అడవిని జల్లెడ పడుతున్నారు పోలీసులు. కూంబింగ్ ను ముమ్మరం చేశారు. మరో వైపు ఏజెన్సీలో డ్రోన్లను సైతం రంగంలోకి దింపారు. సీసీ కెమెరాలతో నిఘా పెంచారు.
మావోయిస్టుల స్థూపాలు..
మరోపక్కా ఏవోబీలో మూరుమూల ప్రాంతాల్లో మావోయిస్టులు స్థూపాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మారుమూల ప్రాంతాలకు వెళ్ళే ఆర్టీసీ బస్సులను తగ్గించారు ఆర్టీసీ అధికారులు. వాహనాలను తనిఖీలు చేస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు.