Crime News: నాంపల్లి ఫోక్సో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు.. మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ వ్యక్తికి జీవితఖైదు.. !
హైదరాబాద్‌లో మూడేళ్ల క్రితం మైనర్ బాలికపై జరిగిన లైంగికదాడి కేసులో ఫోక్సో స్పెషల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Pocso Special Court Sentences: హైదరాబాద్‌లో మూడేళ్ల క్రితం మైనర్ బాలికపై జరిగిన లైంగికదాడి కేసులో ఫోక్సో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పదమూడేళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యెడ్ల రమేశ్ (43) అనే నిందితుడికి నాంపల్లి ఒకటవ అదనపు ప్రత్యేక పోక్సో కోర్టు జీవితఖైదుతోపాటు రూ.20 వేల జరిమానా విధించింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.సురేష్ ఈ తీర్పును వెలువరించారు. పోక్సో చట్టంతోపాటు ఐపీసీ, అట్రాసిటీ చట్టాల ప్రకారం జీవిత ఖైదు, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. 2018 లో సైఫాబాద్‌లో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
2018 జూన్ 16న తమకు పరిచయమున్న యెడ్ల రమేష్ అనే వ్యక్తి పదమూడేళ్ల మైనర్ అయిన తన కూతురిని బిర్లా టెంపుల్ వద్దకు తీసుకువచ్చాడు. అక్కడి నుండి బలవంతంగా బషీర్ బాగ్‌లోని తన రియల్ ఎస్టేట్ కార్యాలయానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
మైనర్ దళిత బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ, అతనిపై పోక్సో చట్టం, ఐపీసీ, అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేసిన అధికారులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. అనంతరం చార్జ్ షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. అప్పటి నుంచి కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గాజీ బాలిక తరఫున వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా సాగిన కేసు విచారణలో అందరు సాక్షులను విచారించిన మొదటి అదనపు ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.సురేష్ తీర్పు వెలువరించారు. నేరం రుజువైందని చెప్పిన ఆయన.. నిందితుడికి జీవిత ఖైదు, ఇరవై వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. అదే విధంగా నిందితుడికి అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. కాగా, దుర్మార్గానికి ఒడిగట్టిన నిందితుడికి శిక్ష పడటంపట్ల బాలిక కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి ఇది గుణపాఠం కావాలన్నారు.