Hyderabad: భార్యను దారుణంగా చంపి.. రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. మృతుని వద్ద లభించిన డైరీ ఆధారంగా
దాంపత్య జీవితంలో ఆలూమగల మధ్య గొడవలు సాధారణమే. అలా అని వాటిని తేలిగ్గా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే వాటిని పరిష్కరించుకోకుండా పెద్దవి చేసుకుంటున్నారు. చేజేతులా నిండు జీవితాలను....
దాంపత్య జీవితంలో ఆలూమగల మధ్య గొడవలు సాధారణమే. అలా అని వాటిని తేలిగ్గా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే వాటిని పరిష్కరించుకోకుండా పెద్దవి చేసుకుంటున్నారు. చేజేతులా నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దంపతుల మధ్య జరిగిన ఘర్షణతో భర్త తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. భార్య తలను నీటిలో ముంచి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని పంజాగుట్టలో జరిగింది. అస్సాం రాష్ట్రానికి చెందిన మహానంద బిశ్వాస్, పంప సర్కార్ దంపతులు. వీరు జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట ప్రేమ్‌నగర్ కు వచ్చారు. అక్కడే నివాసముంటూ ఓ మాల్ లో దంపతులిద్దరూ సెక్యూరిటీ గార్డ్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా.. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య గొడవ జరుగుతోంది. సోమవారం వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తీవ్ర కోపోద్రిక్తుడైన భర్త మహానంద.. తన భార్యను నీళ్లతో ఉన్న బకెట్లో తలవరకు ముంచి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతదేహాన్ని గమనించిన రైల్వే పోలీసులు.. బిశ్వాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తుండగా అతని వద్ద కీలక సమాచారం బయటపడింది. చిన్న డైరీలో తన భార్యను చంపినట్లు రాసుకున్నాడు. తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించాడు. వెంటనే నాంపల్లి రైల్వే పోలీసులు అప్రమత్తమై పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రేమ్‌నగర్‌లోని మృతుడి నివాసానికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో తాళం పగులగొట్టి లోపలకు వెళ్లారు. ఇంట్లో ఉన్న పంప సర్కార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి