ఫేస్‌బుక్ ఎఫెక్ట్.. తుపాకితో నలుగురిపై విచక్షణ రహితంగా కాల్పులు.. తీవ్రగాయాలు
యువతపై సోషల్‌మీడియా ప్రభావం మామూలుగా లేదు. కొంతమంది ఈ ప్లాట్‌ఫాంను ప్రజలకు మంచి చేయడానికి వాడుతుంటే

యువతపై సోషల్‌మీడియా ప్రభావం మామూలుగా లేదు. కొంతమంది ఈ ప్లాట్‌ఫాంను ప్రజలకు మంచి చేయడానికి వాడుతుంటే మరికొంత మంది టైంపాస్ చేయడానికి వాడుతున్నారు. దీనివల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్టుపై కామెంట్ చేసినందుకు తుపాకితో బెదిరించాడు ఓ వ్యక్తి . న్యూ ఢిల్లీలోని నంగ్లోయ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నంగ్లోయ్‌కి చెందిన ఓ మైనర్ బాలుడు నిందితుడి ఫేస్‌బుక్ ఫ్రొఫైల్‌కి సంబంధించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆగ్రహించిన అతడు ఆ బాలుడి ఉన్న ప్రదేశానికి చేరుకొని పెద్ద గొడవ చేశాడు. అంతేకాకుండా అతడి చెంపపై కొట్టి కాలితో తన్నాడు. ఇంతలో ఆ బాలుడి స్నేహితుడు ఒకరు అడ్డు రావడంతో మరింతగా ఊగిపోయాడు. అతడిని ఏదో ఒకటి చేయాలని మనసులో అనుకున్నాడు. అక్కడి నుంచి వెళ్లిపోయి ఆ బాలుడి అడ్రస్ తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి తుపాకితో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యుల్లోని నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలను గమనించిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గమనించి గాయాలైన వ్యక్తులను ఆస్పత్రకి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం వెతుకుతున్నారు.



