Khammam: సత్తుపల్లిలో విషాదం.. కొడుకు చనిపోయాడని తండ్రి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..?
Shocking Incident: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఒక్కరోజు వ్యవధిలో తండ్రి, కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత రెండు రోజుల క్రితం 10వ తరగతి చదువుతున్న చల్ల భాను ప్రకాష్
Shocking Incident: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఒక్కరోజు వ్యవధిలో తండ్రి, కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత రెండు రోజుల క్రితం 10వ తరగతి చదువుతున్న చల్ల భాను ప్రకాష్ ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో బాను ప్రకాష్‌ను కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా.. నిన్న మృతి చెందాడు. భాను ప్రకాష్ అంత్యక్రియల అనంతరం తీవ్ర మనోవేదనకు గురైన తండ్రి చల్ల రాంబాబు ఆదివారం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భాను ప్రకాష్ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. అక్కడ బర్త్ డే వేడుకలు చేసుకున్నాడంటూ పాఠశాల యాజమాన్యం భానుప్రకాష్‌ను వారం పాటు సస్పెండ్ చేసింది. దీంతో మనోవేదనకు గురైన భానుప్రకాష్ సత్తుపల్లిలో ఉన్న తన ఇంటికి వచ్చి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాను ప్రకాష్‌ను హైదరాబాద్‌కు తరలించారు. అయితే భాను ప్రకాష్ తన ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ.. పురుగుల మందు తాగినట్లు పేర్కొన్నాడు. అయితే.. భాను హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ నిన్న మృతిచెందాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కళ్లముందే కన్న కొడుకు మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైన తండ్రి రాంబాబు.. కొడుకు అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతానికి కొద్దిదూరంలోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంటల వ్యవధిలో తండ్రి, కొడుకు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
కాగా.. తన కొడుకు మృతికి కారణం పాఠశాల యాజమాన్యమేనని.. తన కొడుకుని ఆ కారణంగా దూషించి సస్పెండ్ చేసినట్లు తోటి విద్యార్థులు తనతో చెప్పారని మృతుడి భార్య పేర్కొంటోంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన తమ కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. కొడుకు మృతిని చూసి తట్టుకోలేక తన భర్త ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతురాలి భార్య కన్నీటిపర్యంతం అవుతోంది. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది.
Also Read: