రైతు ఏడాదంతా కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకు ఖాతాలో వేశాడు.. ఐదు నిమిషాల వ్యవధిలో హాంఫట్ చేశారు కేటుగాళ్లు

సైబర్ నేరగాళ్లు ఓ రైతును నట్టేట ముంచారు.. ఒక్క క్లిక్కుతో 2 లక్షల 76 వేల 300 రూపాయలు మాయం చేశారు. ఆరుగాలం శ్రమించి రైతు పండించిన పంట డబ్బును రైతు అకౌంట్ నుంచి ఆన్ లైన్ ద్వారా కొట్టేసిన సంఘటన జోగులాంబ...

రైతు ఏడాదంతా కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకు ఖాతాలో వేశాడు.. ఐదు నిమిషాల వ్యవధిలో హాంఫట్ చేశారు కేటుగాళ్లు
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 31, 2021 | 11:01 AM

సైబర్ నేరగాళ్లు ఓ రైతును నట్టేట ముంచారు.. ఒక్క క్లిక్కుతో 2 లక్షల 76 వేల 300 రూపాయలు మాయం చేశారు. ఆరుగాలం శ్రమించి రైతు పండించిన పంట డబ్బును రైతు అకౌంట్ నుంచి ఆన్ లైన్ ద్వారా కొట్టేసిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా చెన్నిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.

వివరాల్లోకి వెళ్తే.. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన బోయ రామకృష్ణ అనే రైతు తనకున్న కొద్దిపాటి పొలంతో పాటు బీడుగా ఉన్న 20 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తిపంట వేశాడు. ఇద్దరు కొడుకుల సాయంతో ఏడాది కష్టపడి పత్తి పండించారు. పండించిన పత్తిని సిసిఐ అడ్డాకుల కేంద్రంలో అమ్మగా వచ్చిన డబ్బు 3 లక్షల 41 వెయ్యి199 రూపాయలు రైతు ఎస్‌బీఐ అకౌంట్‌లో ఈ నెల 25వ తారీకు జమయ్యాయి. ఆ డబ్బు నుండి 50 వేల రూపాయలు అదే రోజు రైతు బ్యాంకు ద్వారా డ్రా చేసుకుని మిగిలిన డబ్బులు తన చిన్న కొడుకు అయిన సోమశేఖర్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేశాడు.

అయితే అదే రోజు సోమశేఖర్ తమ ఏటీఎం ద్వారా డబ్బు డ్రా చేసుకునే ప్రయత్నించగా ఏటీఎంలో డబ్బులు లేనందున ఎనిమిది వేలు మాత్రమే డ్రా చేసుకున్నాడు. మరుసటి రోజు 26వ తేదీన సోమశేఖర్ సెల్‌కు ఐదు నిమిషాల వ్యవధిలో 19 సార్లు డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్‌లు రావడంతో ఆ రైతు బిత్తరపోయాడు. ఆ రోజు బ్యాంక్ హాలిడే కావటంతో మరుసటి రోజు ఎస్బిఐ మానపాడు బ్రాంచ్‌కి వెళ్లి విషయంపై ఫిర్యాదు చేయగా…. నెట్ బ్యాంకింగ్ ద్వారా డ్రా అయినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ విషయంపై తాను ఎవరికీ ఓటీపీ నెంబర్ కానీ ఏటీఎమ్ నెంబర్‌ను గానీ, ఫోన్ ద్వారా ఎవరికీ ఇవ్వలేదని చెప్పాడు. కానీ, డబ్బులు మాత్రం డ్రా అయినట్లు మెసేజ్‌లు వచ్చాయని రైతు లబోదిబోమంటున్నాడు.

రైతు ఫిర్యాదుపై స్పందించిన ఎస్ఐ, అకౌంట్‌లోని నగదు..రోజర్ పే,కేయూ అనే కంపెనీ ద్వారా డ్రా అయినట్లు గుర్తించామని ఇది సైబర్ క్రైమ్ కింద నమోదు చేసుకుని గద్వాల్ లోని సైబర్ క్రైమ్ సి ఐకి బదిలీ చేశామని చెప్పారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేపడతామని తెలిపారు. జరిగిన ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ రైతు కుటుంబం..మాకు ఆత్మహత్యలే శరణ్యమని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Also Read:

శుక్రవారం జరిగిన పందాల్లో ప్రథమ స్థానంలో నిలిచాయి.. శనివారం తెల్లవారుజూముకల్లా నురగలు కక్కి చనిపోయాయి

ఇంట్లో సమస్యలున్నాయి అన్నాడు.. ఊరి పొలిమేరలో పూజలన్నాడు.. అందినకాడికి దోచుకుని పరారయ్యాడు

ఆలయం గాలి గోపురానికి రంధ్రం చేసి పురాతన నాణేల చోరి.. పోలీసులు విచారణలో తేలింది ఏంటంటే..?