Leopard Attack: అహోబిలం ఆలయం వద్ద చిరుత దాడి.. తృటిలో తప్పించుకున్న భక్తుడు
కర్నూలు జిల్లాలో మరోసారి చిరుత దాడికి తెగబడింది. ఎగువ అహోబిలం ఆలయం వద్ద భక్తుడిపై చిరుత దాడి చేసింది.

Leopard Attack on Devotee: ప్రముఖ పుణ్య క్షేత్రం అహోబిలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలంలో మరోసారి చిరుత దాడికి తెగబడింది. అహోబిలం ఆలయం వద్ద భక్తుడిపై చిరుత దాడి చేసింది. పావన నరసింహా స్వామి ఆలయ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాలి నడక దారిలో ఒక్కసారిగా భక్తుడిపై చిరుతు దాడి చేసింది. దీంతో తప్పించుకున్న భక్తుడు మెట్లపై నుంచి కిందకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. ఇందుకు సంబంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే, గత వారం రోజులుగా చిరుత సంచారంతో అహోబిలం ఆలయ పరిసరాల ప్రాంతాల భక్తులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుంటే, ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి పంట పొలాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఓ రైతు… పంటకు నీరు అందించి బైక్‌పై వెళ్తుండగా చిరుత ఎదురుపడింది. దీంతో అతను తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు, గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులతో కలిసి పులి కోసం పంట పొలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
ఆలయం ధ్వజస్తంభం వద్ద చిరుత సంచారం ఇదిలావుంటే గత శుక్రవారం ఎగువ అహోబిలంలో చిరుత సంచరించింది. ఆలయం వెనుక భాగంలో ఉన్న రామానుజాచార్యులు మండపం వద్ద ఉన్న కుక్క పిల్లను చిరుత పట్టుకుని పోయింది. అర్ధరాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో చిరుత ఆలయ పరిసరాల్లో సంచరించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల ద్వారా తెలిసింది. దీంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు.
Read Also…. CM Jagan-Chiru: నేడు సీఎం జగన్‌తో మెగాస్టార్ లంచ్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ
