Cyber Crime: 77 ఏళ్ల వృద్ధుడికి డేటింగ్ పేరుతో వల.. చిక్కిన తర్వాత సినిమా చూపించారు..
ప్రజంట్ అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. టెక్నాలజీ మంచిదే. కానీ దాన్ని వినియోగించే విధానం మాత్రం లిమిట్స్ దాటుతుంది. సైబర్ కేటుగాళ్లు....
ప్రజంట్ అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. టెక్నాలజీ మంచిదే. కానీ దాన్ని వినియోగించే విధానం మాత్రం లిమిట్స్ దాటుతుంది. సైబర్ కేటుగాళ్లు తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నారు. అడ్డూ అదుపు లేకుండా దోపిడికి తెగబడుతున్నారు. బాధితులు బయటకు చెప్పుకోలేని విధంగా సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. వలపు వల వేసి కొందరిని.. డేటింగ్ అంటూ మరికొందరినీ ట్రాప్ చేసి అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా డేటింగ్ పేరుతో 77 ఏళ్ల వృద్ధుడికి వల వేశారు. ఆయనవైపు నుంచి రెస్పాన్స్ రావడంతో కేటుగాళ్ళు 11 లక్షల రూపాయలు కాజేశారు. డేటింగ్ యాప్‌లో అమ్మాయిల పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి 77 ఏళ్ల వృద్ధునికి సైబర్ మోసగాళ్లు వలపు వల విసిరారు. అమ్మాయేనని భ్రమ పడిన వృద్ధుడు వారి మాయలో పడిపోయాడు. ఇక బాధితునితో ప్రేమ, డేటింగ్ అంటూ శృతి మించి రహస్యంగా చాటింగ్ చేశారు. సరదాగా చాట్ చేసిన వృద్ధుడి నుంచి.. వివిధ కారణాలు చెబుతూ రూ. 11 లక్షల వరకూ కాజేశారు. మరిన్ని డబ్బులు పంపించాలని పదే, పదే ఒత్తిడి చేయడం వల్ల… అనుమానం వచ్చింది. ఆ తర్వాత క్రాస్ చెక్ చేసుకోగా మోసపోయానని గుర్తించాడు. వెంటనే హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల పట్ల అలెర్ట్‌గా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరినీ గుడ్డిగా నమ్మి లావాదేవీలు జరపకూడదని సూచిస్తున్నారు. ఈ మధ్య నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు సృష్టించి వసూళ్లకు పాల్పడుతున్నారని… డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండి.. అవతలి వ్యక్తి గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. కళ్ల ముందే ఎన్నో మోసాలు జరుగుతున్నా.. ప్రజలు మోసపోవటం అజాగ్రత్తకు, అత్యాశకు నిదర్శనమని పోలీసులు చురకలంటిస్తున్నారు.
Also Read: రూ.200 ఇవ్వలేదని కన్నతండ్రినే దారుణంగా చంపేశాడు