ట్రాన్సాక్షన్ చేయకుండానే క్రెడిట్ కార్డ్ నుంచి రెండున్నర లక్షలు వాడినట్టు మెసేజ్ వచ్చింది.. అసలు కథ ఇదీ..!

విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన బ్యాంక్‌ ఉద్యోగి కొల్లు నాగేశ్వరరావు.. క్రెడిట్‌ కార్డులు పొందిన నిరక్షరాస్యులను..

ట్రాన్సాక్షన్ చేయకుండానే క్రెడిట్ కార్డ్ నుంచి రెండున్నర లక్షలు వాడినట్టు మెసేజ్ వచ్చింది.. అసలు కథ ఇదీ..!
Credit Card
Follow us

|

Updated on: Jul 04, 2021 | 9:52 PM

Creidt Card Fraud : విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన బ్యాంక్‌ ఉద్యోగి కొల్లు నాగేశ్వరరావు.. క్రెడిట్‌ కార్డులు పొందిన నిరక్షరాస్యులను టార్గెట్‌గా చేసుకుని వారి ఖాతాలో నగదు మాయం చేస్తున్నట్టు గుంటూరు జిల్లా నగరంపాలెం ఇన్‌ఛార్జి సీఐ రత్నస్వామి తెలిపారు. ఈనెల 2న గుంటూరికి చెందిన తోట శ్రీకాంత్‌ తన క్రెడిట్‌ కార్డు నుంచి రూ.2,53,250 నగదు మాయమైనట్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్టు చెప్పారు.

వివరాల్లోకి వెళితే, గుంటూరు వెంకటరమణ కాలనీకి చెందిన తోట శ్రీకాంత్‌ ద్విచక్రవాహనాల మెకానిక్‌ దుకాణం నిర్వహిస్తుంటాడు. ఐదేళ్లుగా కొటక్‌ మహేంద్రబ్యాంక్‌ క్రెడిట్‌కార్డు ఉపయోగిస్తున్నాడు. ఈనెల 2న మధ్యాహ్నం తన సెల్ ఫోన్ కి క్రెడిట్‌కార్డు ద్వారా రూ.2,53,250 వాడుకున్నట్టు సంక్షిప్త సందేశం వచ్చింది. ఎలాంటి లావాదేవీలు చేయకపోయినా నగదు వాడుకున్నట్టు సందేశం రావడంతో ఆందోళనకు గురైన బాధితుడు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కట్ చేస్తే, కృష్ణా జిల్లా విజయవాడకి చెందిన కొల్లు నాగేశ్వరరావు ఎంబీఏ పూర్తి చేసి నగరంలోని కొటక్‌ మహేంద్ర బ్యాంకులో క్రెడిట్‌కార్డు డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన నాగేశ్వరరావు సునాయాసంగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. క్రెడిట్‌కార్డు పొందిన వారిలో సాంకేతిక పరిజ్ఞానం లేనివారిని, నిరక్షరాస్యులను టార్గెట్‌గా చేసుకున్నాడు. క్రెడిట్‌కార్డు పొందే సమయంలో వారు ఇచ్చే మెయిల్‌ ఐడీలను మార్చి కొత్త మెయిల్‌ ఐడీని క్రియేట్‌ చేసి వాటి సాయంతో ఓటీపీ తెలుసుకుని నగదు మాయం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

కాగా,  నిందితుడు నాగేశ్వరరావు ఈరోజు మధ్యాహ్నం గుంటూరుకి చెందిన శ్రీకాంత్‌ క్రెడిట్‌కార్డుతో బంగారు దుకాణంలో ఆభరణాలు కొనుగోలు చేశాడు. దుకాణం యజమానికి మెసేజ్‌ వచ్చింది కానీ నగదు జమకాలేదు. ఎంత సేపటికి నగదు ఖాతాలోకి జమకాకపోవడం గమనించిన నిందితుడు అక్కడి నుంచి జారుకున్నాడు. దుకాణం యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. సైబర్‌ క్రైమ్‌ జరిగిందని బాధితుడు వచ్చి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అకౌంట్ ఫ్రీజ్ చేశామని, అందుకే బంగారు దుకాణంలో నగదు బదిలీ కాలేదని సీఐ తెలిపారు. నాగేశ్వరరావును అరెస్టు చేసి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్టు సీఐ రత్నస్వామి వెల్లడించారు.

Read also : సిరిసిల్లలో బిజీ.. బిజీగా గడిపిన సీఎం.. ఓ వైపు చలోక్తులు, మరో వైపు అభివృద్ధి మాటలు, మరోచోట తీవ్ర అసహనం.!