Viral: పైకి చూస్తే మ్యూజిక్ బాక్సులు.. ఓపెన్ చేసి చూడగా కంగుతిన్న పోలీసులు..
మాల్దా రైల్వే స్టేషన్‌లో పోలీసులు పకడ్బందీగా గస్తీ కాస్తున్నారు. అప్పుడే ముర్షీదాబాద్‌లోని లాల్‌గోలా నుంచి వస్తోన్న ట్రైన్ మాల్దా రైల్వే...
మాల్దా రైల్వే స్టేషన్‌లో పోలీసులు పకడ్బందీగా గస్తీ కాస్తున్నారు. అప్పుడే ముర్షీదాబాద్‌లోని లాల్‌గోలా నుంచి వస్తోన్న ట్రైన్ మాల్దా రైల్వే స్టేషన్‌లో ఆగింది. ప్రయాణీకులు ఒక్కొక్కరిగా దిగుతున్నారు. కొద్దిసేపటి ముందే పైఅధికారుల నుంచి మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోంది. ప్రతీ లగేజీని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశాలు రావడంతో.. స్టేషన్‌లో డ్యూటీ చేస్తోన్న పోలీసులు అలెర్ట్‌గా ఉండి.. ప్రతీ ప్రయాణీకుడి లగేజీని చెక్ చేస్తున్నారు. అయితే ఆ పోలీసుల్లో ఒకరికి.. అటుగా వస్తోన్న ఇద్దరిపై అనుమానమొచ్చింది. చూడటానికి వారు భార్యాభర్తల మాదిరి ఉన్నారు.. కానీ కదలికలు మాత్రం అనుమానాస్పదంగా ఉన్నాయి. దీనితో అక్కడున్న పోలీసులు వారిని ఆపారు. ముందుగా కొన్ని ప్రశ్నలు అడిగారు.. వాటికి సదరు జంట నుంచి పొంతన లేని సమాధానాలు వచ్చాయి. లగేజీ చెక్ చేస్తుండగా మ్యూజిక్ బాక్సులపై పోలీసులకు డౌట్ వచ్చింది. వాటిని ఓపెన్ చేసి చూడగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలు ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..
వివరాల్లోకి వెళ్తే.. మాల్దా రైల్వే స్టేషన్‌లో బుధవారం రాత్రి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తోన్న జంట అడ్డంగా దొరికిపోయారు. వారి నుంచి పోలీసులు రూ. 12 కోట్లు విలువ చేసే 2.5 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గోలమ్ ముస్తఫా, రియాన్ షఫిన్‌లను అదుపులోకి తీసుకున్న మాల్దా పోలీసులు.. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నిందితులు ఇరువురూ డ్రగ్స్‌ను మ్యూజిక్ బాక్సుల్లోని ప్లాస్టిక్ ప్యాకెట్లలో దాచిపెట్టారని.. మాల్దా రైల్వే స్టేషన్‌లో దిగినట్లు ఇన్ఫర్మేషన్ రావడంతో గస్తీ కాసి పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. గతంలోనూ మాల్దాలో డ్రగ్స్ సరఫరా జరిగేదని.. ఇక్కడ నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకూ, బంగ్లాదేశ్‌కు సరఫరా చేస్తారన్నారు. ప్రస్తుతం పోలీసుల నిఘా అన్ని చోట్లా ఉండటంతో డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయని పోలీసులు స్పష్టం చేశారు.