Drunk and Drive: రెండు బైకుల ఢీ.. ఒకరి మరణం..చనిపోయిన వ్యక్తి సహా నలుగురిపై కేసు..బైక్ ఇచ్చిన వారికీ తప్పని జైలు!
ఒక్క ఏక్సిడెంట్ నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుకు కారణం అయింది. రెండు బైక్ లు ఢీకొట్టుకుని ఒకరు చనిపోయారు. బైక్ నడిపిన వారు మద్యం మత్తులో ఉన్నారు. మరణించిన బైక్ రైడర్ మైనర్.
Drunk and Drive: ఒక్క ఏక్సిడెంట్ నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుకు కారణం అయింది. రెండు బైక్ లు ఢీకొట్టుకుని ఒకరు చనిపోయారు. బైక్ నడిపిన వారు మద్యం మత్తులో ఉన్నారు. మరణించిన బైక్ రైడర్ మైనర్.. మైనర్ కు బైక్ ఇచ్చిన నేరంతో ఓనర్ పై కేసు. తాగి ఉన్న వ్యక్తికి బైక్ ఇచ్చిన కారణంగా ఇంకో బైక్ ఓనర్ పైనా కేసు. ఇలా ఒకరి మరణం ముగ్గురిని కేసులో ఇరికించింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడ్డునాంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన పూర్తి వివరాలు పోలీసులు తెలిపిన దాని ప్రకారం..
బొడ్డునాంపల్లి గ్రామంలో మాచారం సాయికుమార్ అనే వ్యక్తి మద్యం మత్తులో బైక్ పై వెళుతూ ఎదురుగా వస్తున్న మరో బైక్ ను ఢీ కొట్టాడు. దీంతో ఆ బైక్ నడుపుతున్న గుండోల ప్రశాంత్ అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో సాయికుమార్ మద్యం తాగినట్టు తేలింది. అయితే, అతను నడుపుతున్న వాహనం అతనిది కాదు. సభావత్ అనే వ్యక్తి సాయికుమార్ కు బైక్ ఇచ్చాడు. దీంతో పోలీసులు సభావత్ మీద కూడా కేసు నమోదు చేశారు. తాగి ఉన్న వ్యక్తికి బైక్ ఇవ్వడం నేరం. ఇక ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మైనర్. లైసెన్స్ లేదు. ఈ బైక్ కూడా అతని సొంతం కాదు. బైండ్ల శ్రీనివాస్ అనే ఆయనది. మైనర్ కు బైక్ ఇచ్చినందుకు గానూ శ్రీనివాస్ పైన 304 పార్ట్-2 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇలా జరిగిన ప్రమాదంలో తమ ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా ఇద్దరు వ్యక్తులు జైలు పాలయ్యారు. కేసు రుజువైతే వీరికి పదేళ్ళ శిక్షపడే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.
మైనర్లకు, మద్యం తాగిన వారికీ బైక్ ఇవ్వడం చట్ట ప్రకారం నేరం. ఈ విషయాన్ని పలు మార్లు పోలీసులు చెబుతూ వస్తున్నారు. అయినా, ఎవరూ వినడం లేదు. దీంతో ఇదిగో ఇలా ఎవరికో జాలిపడి సహాయం చేసినందుకు శిక్ష అనుభవిస్తున్నారు. మొహమాటానికి పోయి ఎవరు అడిగితే వారికి వాహనాలు ఇస్తే ఇలాగే కష్టాలను కోరి తెచ్చుకున్నట్లవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి, మైనర్లకు, మద్యం తాగిన వారికి వాహనాలు ఇస్తే యజమానులు రిస్క్‌లో పడతారని చెబుతున్నారు.
Also Read: Crime: విజయవాడలో ఘోరం.. తల్లీ, ఇద్దరు పిల్లల హత్య..! భర్తపై అనుమానం..
Illicit Liquor: కాటేసిన కల్తీ మద్యం.. ఐదుగురు మృతి.. మరో ఆరుగురి పరిస్థితి విషమం..