Bank Robbery: రక్షణగా ఉన్న గార్డ్ దోచేశాడు..ఏక్సిస్ బ్యాంకులో భారీ చోరీ..సీసీ కెమెరాలతో విషయం వెలుగులోకి!
కంచే చేను మేయడం అంటే ఇదే..ఏటీఎంలో డబ్బులు ఉంచాల్సిన సొమ్మును అక్కడి సెక్యూరిటీ గార్డు దోచేశాడు. ఈ ఘటన చండీగఢ్ లోని ఒక ఏక్సిస్ బ్యాంకులో చోటు చేసుకుంది.
Bank Robbery: కంచే చేను మేయడం అంటే ఇదే..ఏటీఎంలో డబ్బులు ఉంచాల్సిన సొమ్మును అక్కడి సెక్యూరిటీ గార్డు దోచేశాడు. ఈ ఘటన చండీగఢ్ లోని ఒక ఏక్సిస్ బ్యాంకులో చోటు చేసుకుంది. సీసీ టీవీ ఫుటేజీ తో ఈ దొంగతనం విషయం బయట పడింది. సంఘటన ఎలా జరిగింది అంటే.. చంఢీగడ్ లోని ఓ ఏక్సిస్ బ్యాంకు బ్రాంచ్ నుంచి నగరంలోని అన్ని ఏటీఎంలకు డబ్బు సరఫరా చేస్తుంటారు. అక్కడ ఓ బాక్సులో ఏటీఎంలో నింపడానికి సిద్ధంగా ఉంచిన నగదును సదరు సెక్యూరిటీ గార్డు ఎత్తుకెళ్లిపోయాడు. ఆ సెక్యూరిటీ గార్డు అక్కడ మూడేళ్ళుగా పనిచేస్తుండటం విశేషం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏక్సిస్ బ్యాంకు సెక్టార్ 34 బ్రాంచ్ లో 4 కోట్లు చోరీకి గురయ్యాయి. ఈ చోరీకి పాల్పడింది అక్కడి సెక్యూరిటీ ఇన్ ఛార్జ్ సుమిత్ గా గుర్తించారు.
సంఘటన ఎలా జరిగిందంటే.. బ్యాంకుకు రెండో శనివారం, ఆదివారం సెలవు కావడంతో బ్యాంకు తెరవలేదు. నిందితుడు సుమిత్ తో పాటు పంజాబ్ పోలీస్ విహాగం కానిస్టేబుల్ రాత్రి షిఫ్ట్ లో ఉన్నారు. శనివారం రాత్రి 10 గంటలకు డ్యూటీకి వచ్చిన సుమిత్ ఉదయం 6 గంటలకు ఇంటికి వెళ్ళిపోయాడు. బ్రాంచి వెలుపల సెక్యూరిటీకోసం పోలీసులు ఉన్నారు. అదేవిధంగా ఆదివారం రాత్రి కూడా పది గంటలకు డ్యూటీకి వచ్చిన సుమిత్ సోమవారం తెల్లవారు జామున మూడు గంటల నుంచి కనిపించలేదు. దీంతో అక్కడి కానిస్టేబుల్ పోలీసులను అప్రమత్తం చేశాడు.
అక్కడకు వచ్చిన పోలీసులు బ్యాంకులోని నగదు పెట్టెను తెరచి అందులో డబ్బు ఎత్తుకుపోయినట్టు గుర్చించారు. వారు బ్యాంకు సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చిన తరువాత లెక్కలు చూసి నాలుగు కోట్ల రూపాయలు చోరీ అయినట్టు నిర్ధారించారు. అనంతరం విచారణలో భాగంగా సీసీ టీవీ ఫుటేజిలు పరిశీలిస్తున్న పోలీసులకు సుమిత్ ట్రంకు పెట్టెను తెరిచి అందులోని డబ్బు తన దుస్తుల్లో నింపుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అనంతరం తన వాహనంపై అక్కడ నుంచి నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడ్ని గుర్తించామనీ, అతడిని త్వరలో పట్టుకుంటామని అన్నారు. అతడి మొబైల్ ప్రస్తుతం సిచ్చాఫ్ చేసి ఉన్నట్టు చండీగఢ్ ఎస్పీ కుల్ దీప్ సింగ్ చాహల్ చెప్పారు.