SI Madhu : ఎస్సై మధు పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఆత్మహత్యాయత్నం చేసిన యువతి
ఎస్‌ఐ తనను మోసం చేశాడని రాజధాని నగరం హైదరాబాద్‌లో ఆత్మహత్యకు యత్నించింది ఓ బాధితురాలు. హైదరాబాద్ పాతబస్తీలోని టపాచబుత్ర పోలీస్టేషన్ ఎస్సై..
Tappachabutra SI Madhu : ఎస్ ఐ (పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్) తనను మోసం చేశాడని రాజధాని నగరం హైదరాబాద్‌లో ఆత్మహత్యకు యత్నించింది ఓ బాధితురాలు. హైదరాబాద్ పాతబస్తీలోని టపాచబుత్ర పోలీస్ స్టేషన్ ఎస్సైగా పని చేస్తున్న మధు తనను మోసం చేశాడని సదరు యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో హుటాహుటీన బాధితురాలిని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తనను పెళ్లి చేసుకుంటానని ఎస్‌ఐ మధు మోసం చేశాడని బేగంపేట పోలీస్టేషన్‌తో పాటు టపాచబుత్ర, పశ్చిమ మండల డిసిపికి ఇప్పటికే ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఇలా ఉంటే, గతంలోనే ఎస్‌ఐ మధుకు వివాహం జరిగింది. అయితే వివాహేతర సంబంధంపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈనెల 15న ఎస్‌ఐ మధుని సస్పెండ్ చేశారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎస్ఐ మధుకు గతంలో వివాహం అయినప్పటికీ అసలు విషయం చెప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పి, ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నట్టు బాధితురాలు చెబుతోంది. యువతి పెళ్లి ప్రస్తావన తేవడంతో.. కొన్ని రోజుల నుంచి ఎస్ఐ ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. దీంతో మోసపోయానని తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఇవాళ ఆత్మహత్యాయత్నం చేసింది.