Agnipath Protest: సికింద్రాబాద్ నిరసనల్లో పాల్గొన్న వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కేసు నమోదు చేస్తారేమోనని..
Agnipath Protest: ఆర్మీ నియామకాల్లో సరికొత్త విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం తీవ్ర నిరసనలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే...
Agnipath Protest: ఆర్మీ నియామకాల్లో సరికొత్త విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం తీవ్ర నిరసనలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. ఈ విధానం ద్వారా తమకు అన్యాయం జరుగుతుందని ఉద్యోగార్థులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ దాడుల్లో భారీగా ఆస్తి నష్టంసైతం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనల్లో పాల్గొన్న వారిని గుర్తించి, కేసులు నమోదు చేయడం ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో తాజాగా జనగాం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తనపై ఎక్కడ కేసు నమోదు చేస్తారోనన్న భయంతో బుధవారం ఆత్మహత్య యత్నం చేసిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ కు చెందిన గోవింద్ అజయ్ అనే యువకుడు ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్లలో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ స్టేషన్‌లో జరిగిన అల్లర్లలో పాల్గొన్న సమయంలో ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడాడు అజయ్.
దీంతో ఎక్కడ పోలీసులు తనపై కేసు నమోదు చేస్తారని భయాందోళనకు గురైన అజయ్ ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబీకులు వెంటనే అజయ్‌ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అజయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..