Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 Vaccine: రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా లాభం లేదా..? ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు!

Covid 19 Vaccine: కరోనా మహమ్మారి ముగిసిపోయిందని కొందరు భావిస్తున్నారని, కానీ దాన్నుంచి ఇంకా బయటపడలేదని హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

Covid-19 Vaccine: రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా లాభం లేదా..?  ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు!
Covid 19 Vaccine
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 12, 2021 | 4:09 PM

Covid-19 Vaccine: కరోనా మహమ్మారి ముగిసిపోయిందని కొందరు భావిస్తున్నారని, కానీ దాన్నుంచి ఇంకా బయటపడలేదని హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరోసారి ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి కరోనా సోకుతుందని, వేల సంఖ్యలో మరణాల సంభవించాయని వెల్లడించింది. కరోనా ముప్పు ఇంకా పొంచి ఉందని వార్నింగ్‌ ఇచ్చారు WHO ప్రతినిధులు. వైరస్‌పై నియంత్రణ రాలేదు. ఈ ముప్పు కొనసాగుతోందని స్పష్టం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మహమ్మారికి చరమగీతం పాడేందుకు ఉన్న సాధనాలను సరిగా వినియోగించుకోవడంలేదని అభిప్రాయపడింది WHO. కొన్ని ప్రాంతాల్లో ఐసీయూలు, ఆసుపత్రులు నిండిపోతున్నాయని తెలిపింది. దాదాపు రెండేళ్ల కాలంలో సుమారు 50 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు.

ఈ నేపథ్యంలో WHO కీలక సూచనలు చేసింది. ఇప్పటికే రెండు డోసుల టీకా తీసుకున్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో బూస్టర్ డోసు కూడా తప్పనిసరి అని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బలహీన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి బూస్టర్‌ డోసు అవసరమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల కమిటీ వెల్లడించింది. బూస్టర్‌ డోసుల వినియోగం గురించి ఇమ్యూనైజేషన్‌పై ఏర్పాటైన వ్యూహాత్మక సలహాల నిపుణుల బృందం (SAGE) నాలుగు రోజులు చర్చించిన అనంతరం ఈమేరకు సిఫార్సు చేసింది. వీటికి సంబంధించిన తుది నివేదిక డిసెంబరులో విడుదల చేస్తామని WHO ప్రకటించింది.

బలహీన రోగనిరోధకత ఉన్నవారు తీవ్ర కొవిడ్‌-19 బారినపడే ప్రమాదం ఉంటుంది. అందుచేత డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం పొందిన వ్యాక్సిన్‌ డోసులకు అదనంగా మరో డోసు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం పేర్కొంది. ఇక, చైనాకు చెందిన సినోవాక్‌, సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌లు తీసుకున్న 60ఏళ్ల పైబడిన వ్యక్తులు తప్పనిసరిగా మూడో డోసు తీసుకోవాలని నిపుణుల బృందం స్పష్టం చేసింది. వీటితో పాటు ఇతర వ్యాక్సిన్‌ల లభ్యతను బట్టి ఆయా దేశాలు మూడో డోసు అందించవచ్చని సూచించింది. అయితే, దీన్ని అమలు చేసే ముందు.. రెండు డోసులు ఎక్కువ మందికి చేరిన తర్వాత మాత్రమే మూడో డోసుపై ఆలోచించాలని పేర్కొంది. వ్యాక్సిన్‌ పంపిణీలో తొలుత వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం సిఫార్సు చేసింది.

ఇక, ఈ ఏడాది చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా కనీసం 40శాతం మందికి రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ అందించడంతో పాటు వచ్చే ఏడాది జూన్‌ నాటికి 70శాతం మందికి వ్యాక్సిన్‌ పూర్తిచేసేలా అన్ని దేశాలు ప్రయత్నించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. వ్యాక్సిన్‌ పంపిణిలో వృద్థులకు, ఆరోగ్య కార్యకర్తలకు, అధిక ముప్పు పొంచివున్న వారికి తొలుత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. అనంతరం సాధారణ పౌరులకు, యుక్తవయసు వారికి వ్యాక్సిన్‌ ఇచ్చే క్రమాన్ని అనుసరించాలని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

ఇదిలాఉంటే, బూస్టర్‌ డోసు వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా సిఫార్సు చేసినప్పటికీ.. ఇప్పటికే పలు దేశాలు మూడో డోసు పంపిణీ మొదలుపెట్టాయి. ఇజ్రాయెల్‌, అమెరికాతో పాటు యూరప్‌లోని పలు దేశాలు బూస్టర్‌ డోసును అందించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌లు పెరగడం, కొత్త వేరియంట్‌లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో బూస్టర్‌ డోసు ఇస్తున్నట్లు సమర్థించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బూస్టర్‌ డోసు వినియోగానికి సిఫార్సు చేసింది.

Read Also…. PM Modi Gati Shakti Plan: స్వయం-ఆధారిత భారతదేశం కోసం పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్.. ఈ ప్రణాళిక పూర్తి సమాచారం మీకోసం!