కరోనా విలయంః సైకిల్‌పై నెట్టుకుంటూ శవం తరలింపు..
కరోన వైరస్ విస్తరిస్తున్న తరుణంలో ఎవరు ఏవిధంగా చనిపోయినా కూడా వారిని స్మశానానికి తరలించేందుకు ఎవరూ ముందుకు రావటంలేదు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ..
కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఎంతటి ఆత్మీయులనైనా సరే అంటరానివారిని చేస్తుంది. ఎంతమంది బంధుగణం ఉన్నప్పటికీ కోవిడ్ సోకిన వారి మరణం దిక్కులేని చావుగా చేస్తుంది. కరోన వైరస్ విస్తరిస్తున్న తరుణంలో ఎవరు ఏవిధంగా చనిపోయినా కూడా వారిని స్మశానానికి తరలించేందుకు ఎవరూ ముందుకు రావటంలేదు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను సాహసోపేతంగా నిర్వర్తిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న సంఘటన అందరినీ కలచివేసింది. వివరాల్లోకి వెళితే…
లాక్ డౌన్ పటిష్ఠంగా అమలవుతున్న వేళ కామారెడ్డి జిల్లా కేంద్రంలో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డిలోని గాంధీ గంజ్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ వ్యక్తి నగరంలోని మార్కెట్‌లో కూలీ పని చేస్తుకుంటూ జీవిస్తున్నాడు. అతడు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఆదివారం ఉన్నట్టుండి చనిపోయాడు. దీంతో ఆ శవాన్ని అతని ఇంటికి చేర్చాల్సి వచ్చింది. ముందుగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇది అనుమానాస్పద మృతి కాబట్టి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించాలని భావించారు. ఆ శవాన్ని ఆస్పత్రి మార్చురీకి తరలించే బాధ్యతను ఓ పారిశుద్ధ్య కార్మికుడికి అప్పగించారు.
అయితే, చనిపోయిన వ్యక్తి శవాన్ని తరలించేందుకు అతడు అనేక ప్రయత్నాలు చేశాడు. అంబులెన్స్‌కు ఫోన్ చేయగా అవి అందుబాటులో లేవు. చుట్టుపక్కల వారిని సాయం కోరాడు. అసలే లాక్ డౌన్ కారణంగా రాకపోకలు ఏమీ లేకపోవడంతో చేసేది లేక అతను తన సైకిల్‌పై శవాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించాడు. మృత దేహానికి బట్ట కట్టి, తన సైకిల్ వెనక సీటుపై ఉంచి నెట్టుకుంటూ వెళ్లాడు. సైకిల్‌పై నుంచి శవం పడిపోకుండా అటు ఇటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆస్పత్రి మార్చురీకి చేర్చాడు. జిల్లా వ్యాప్తంగా ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. సదరు కార్మికుడ్ని అధికారులు, స్థానికులు ఎంతగానో ప్రశంసించారు.