AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Variant XE: ఇప్పట్లో మనల్ని కరోనా వదిలేలా లేదు.. కొత్త కొత్త రూపాలతో ప్రాణాలు తోడేస్తోంది!

సుమారు రెండేళ్ల కిందట మన అంతు చూడటానికన్నట్టుగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ ఓ పట్టాన కట్టడి కావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సరికొత్త రూపాలతో మళ్లీ మళ్లీ మనల్ని పట్టి పీడిస్తోంది.

Covid Variant XE: ఇప్పట్లో మనల్ని కరోనా వదిలేలా లేదు.. కొత్త కొత్త రూపాలతో ప్రాణాలు తోడేస్తోంది!
Corona Virus
Balu
| Edited By: Balaraju Goud|

Updated on: Apr 05, 2022 | 11:31 AM

Share

New Covid Variant XE: సుమారు రెండేళ్ల కిందట మన అంతు చూడటానికన్నట్టుగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌(Corona Virus) ఓ పట్టాన కట్టడి కావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సరికొత్త రూపాలతో మళ్లీ మళ్లీ మనల్ని పట్టి పీడిస్తోంది. ఇక కరోనా దాదాపుగా ఖతమయ్యిందనుకున్నాం. ఇక ముప్పు తప్పినట్టేనని సంబరపడ్డాం. కరోనా నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదనుకున్నాం. హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చని అనుకుంటున్న తరుణంలో కొత్త కోవిడ్‌ వేరియంట్‌ వణికిస్తోంది. ఇప్పటికే చైనా(China)ను హడలెత్తిస్తోన్న ఆ కోవిడ్‌ వేరియంట్‌ బ్రిటన్‌ను కూడా గడగడలాడిస్తోంది.. ఒమిక్రాన్‌ వేరియంట్‌(Omicron Variant)లో సరికొత్త సబ్‌ వేరియంట్‌ అయిన ఈ వైరస్‌కు చాలా చాలా ప్రమాదకారి అని సైంటిస్టులు చెబుతున్నారు. కరోనా కన్నా పది రెట్లు ముప్పువాటిల్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. కరోనా వైరస్‌ పుట్టిన చైనాలోనే సరికొత్త కోవిడ్‌ వేరియంట్ విజృంభిస్తోంది. షాంఘై నగరం వైరస్‌తో భీతిల్లుతోంది. వైరస్‌ ఉద్ధృతిని అడ్డుకునేందుకు చైనా ప్రభుత్వం ఏకంగా సైన్యాన్నే రంగంలోకి దించింది. ప్రస్తుతం షాంఘైలో రెండు వేల మంది సైనిక వైద్య సిబ్బంది, పది వేల మంది ఆరోగ్య కార్యకర్తలు అహర్నిశలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సుమారు రెండున్నర కోట్ల మందికి ప్రభుత్వం సామూహిక కోవిడ్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. ముందు జాగ్రత్తగా వారం కిందట లాక్‌డౌన్‌ విధించినప్పటికీ వైరస్‌ శరవేగంతో వ్యాప్తి చెందుతోంది. మొన్న జనవరిలో బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్‌ ఇప్పుడు పదింతల శక్తితో ప్రపంచ ప్రజలపై విరుచుకుపడబోతున్నది. చైనాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఈ వైరస్‌ అన్నంత పని చేసేలా ఉంది. సరికొత్త మ్యూటెంట్లతో అత్యంత వేగంగా విజృంభిస్తోన్న ఈ న్యూ వేరియంట్‌ యిప్పుడు చైనా ప్రజలను గజగజ వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ మహమ్మారి ముప్పు మరోమారు తప్పదని చైనా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్లు బిఏ1, బిఏ2 నుంచి రూపాంతరం చెందిన ఈ వేరియంట్‌ని ఎక్స్‌ఈగా పేర్కొంటున్నారు. ముప్పేటా ముంచుకొస్తోన్న మహమ్మారి ప్రమాదంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అప్రమత్తం చేస్తోంది.

కరోనా వైరస్‌ పుట్టుకకు తాము కారణం కాదని చైనా చెబుతూ వస్తున్నప్పటికీ ఎవరూ ఆ మాట నమ్మడం లేదు. కోవిడ్‌-19తో హడలిపోయిన చైనా ఇప్పుడు కొత్త వేరియంట్‌ దెబ్బకు విలవిలలాడుతోంది..అక్కడ రెండేళ్ల తర్వాత భారీగా కేసులు నమోదవుతున్నాయి. అనేక రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ అమలులో ఉంది. అత్యవసర పరిస్థితులలో తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. కఠినమైన ఆంక్షలు విధించింది. కోవిడ్‌ చికిత్స కోసమో, మరో అత్యవసరమైన పని కోసమో అయితే తప్ప ఎవరూ అడుగు బయటపెట్టకూడదని గట్టిగా చెబుతోంది. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. నిషేధాజ్ఞలు కఠినంగా అమలు అవుతుండటంతో ప్రజలెవరూ బయటకొచ్చే సాహసం చేయడం లేదు. రెండేళ్ళ క్రితం నాటి లాక్‌డౌన్‌ కంటే ఇప్పుడు మరింత కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది చైనా ప్రభుత్వం. చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాలు బలిగొనడం ఖాయమన్న సందేశాలను రోబోల ద్వారా ప్రచారం చేస్తోంది చైనా ప్రభుత్వం.

కరోనా బీఏ2 ఒమిక్రాన్ తో పోలిస్తే ఒమిక్రాన్ ఎక్స్ఈ సబ్ వేరియంట్ వృద్ధి రేటు పది శాతం ఎక్కువగా ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ ఎపిడెమియోలాజికల్ నివేదిక హెచ్చరించింది. మొన్న ఒక్క రోజే చైనాలో 13 వేల కేసులు నమోదయ్యాయి. గత రెండేళ్ళలో అంటే ఫిబ్రవరి 2020 తర్వాత చైనాలో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కోవిడ్‌ ప్రభావంతో విలవిల్లాడిన బ్రిటన్‌లో మరోసారి ప్రమాదకర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బిఏ 2 ఇప్పుడు బ్రిటన్‌ గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తోంది. గత వారం బ్రిటన్ లో 49లక్షల మంది వైరస్‌ బారినపడినట్లు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. గతవారం రోజుల్లో దేశంలోని ప్రతి 13 మందిలో ఒకరు కరోనా బారిన పడ్డారు. ఇక, అంతకుముందు వారం 43 లక్షల మందికి కొవిడ్‌ సోకింది. తాజా పరిణామాలకు ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తీసుకున్న నిర్ణయాలే కారణమని విమర్శలు వెల్లువెత్తతున్నాయి.

నిజానికి ఈ కొత్త కరోనా వేరియంట్‌ XEను మొదట జనవరి 19న బ్రిటన్‌లో గుర్తించారు. అప్పుడు బ్రిటన్‌లో 600 కంటే అధికంగా ఎక్స్‌ఈ కేసులు నమోదైనట్టు డబ్ల్యుహెచ్‌వో వెల్లడించింది. కరోనా ముప్పు తప్పినట్టేనన్న ధీమాతో గత ఏడాది ఫిబ్రవరిలోనే బ్రిటన్‌ ప్రభుత్వం కరోనా ఆంక్షలను ఎత్తివేసింది. అలా తొందరపడింది. ఆ తొందరపాటు వల్లే ఇప్పుడీ పరిస్థితి దాపురించిందని విపక్షాలు గగ్గొలు పెడుతున్నాయి. అయితే కరోనా విజృంభణతో బ్రిటన్‌ హాస్పిటల్స్ లోచేరేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ.. మరణాల రేటు తక్కువగా ఉండటం కొంచెం ఉపశమనం కలిగించే విషయం. చైనా, బ్రిటన్‌లతో పాటు ఇప్పుడు అమెరికాలోనూ XE వేరియంట్‌ వేగంగా విజృంభిస్తోంది. XE తీవ్రతను, వేగాన్ని నిర్దిష్టంగా అంచనా వేసే పనిలో ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఉన్నారు. కరోనా వేరియంట్‌ ఒరిజినల్‌ మ్యూటెంట్ల కన్నా బిఏ2 అధిక శక్తివంతంగా ఉంది. అంతేకాదు ఇది టీకాలకు కూడా అంతుబట్టడంలేదు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి కూడా ఈ వేరియంట్‌ అంటుకుంటోంది అంతేకాదు. బహుళ వేరియంట్ల బారిన పడిన వారిలో ఈ బిఏ 2 మ్యూటెంట్‌ అత్యధికంగా కనిపిస్తుండడం ఆందోళన కలిగించే అంశం. ప్రధానంగా హాస్పిటలైజేషన్‌ని, మరణాలను తగ్గించేప్రయత్నంలో భాగంగా బూస్టర్‌ డోస్‌లను ఆశ్రయిస్తోంది బ్రిటన్‌ ప్రభుత్వం. తాజాగా బిఏ1, బిఏ 2 వేరియంట్ల నుంచి రూపాంతరం చెందిన XE వేరియంట్ మరింత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం ఎలా ఉండబోతోందన్న అనుమానం ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

Read Also… Sri Lanka Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభం మధ్య శ్రీలంక కొత్త ఆర్థిక మంత్రిగా అలీ సబ్రీ నియామకం..