Good News: త్వరలో మరో కొత్త కోవిడ్ వ్యాక్సిన్… మిగిలిన వ్యాక్సిన్లను తలదన్నే సమర్థతతో..
New Covid Vaccine- Vaccinate All: దేశంలో కరోనా మహమ్మారి తుదముట్టించేందుకు మరో వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) మరో వ్యాక్సిన్‌ను తీసుకురానుంది.
దేశంలో కరోనా మహమ్మారిని తుదముట్టించేందుకు మరో వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) మరో వ్యాక్సిన్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను తలదన్నే సమర్థతతో దీన్ని తయారు చేస్తున్నారు. గదిలోనూ ఈ వ్యాక్సిన్లను నిల్వ ఉంచొచ్చు. ఈ వ్యాక్సిన్‌పై ప్రయోగాలు కొనసాగుతుండగా…మరో ఏడాదికాలంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఈ వ్యాక్సిన్‌ను రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన ప్రయోగాలు జంతువుల్లో కొనసాగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ అలాంటిలాంటిది కాదు. ఇది ప్రత్యేకించి ఇండియాలో సోకుతున్న మొండి కరోనా వైరస్ ను అంతం చెయ్యగలదంటున్నారు. ఎందుకంటే… ఐఐఎస్ లోని మాలిక్యూలర్ బయోఫిజిక్స్ యూనిట్లోని వారు ప్రత్యేకమైన మాలిక్యూల్స్ని కనిపెట్టారు. ఇవి చాలా శక్తిమంతమైనవి అనీ… కరోనాతో బాగా పోరాడగలవని చెబుతున్నారు. ఈ మాలిక్యూల్స్ని వ్యాక్సిన్ రూపంలో శరీరంలో ప్రవేశపెడితే.. ఇవి పెద్ద సంఖ్యలో యాంటీ బాడీలు ఉత్పత్తి అయ్యేలా చెయ్యగలవు అంటున్నారు. ఇప్పుడు మనం వేయించుకుంటున్న వ్యాక్సిన్లతో వచ్చే యాంటీ బాడీల కంటే..ఈ కొత్త వ్యాక్సిన్తో వచ్చే యాంటీబాడీలు చాలా ఎక్కువ అంటున్నారు.
అంతేకాదు… ఈ వ్యాక్సిన్ ను సాధారణ గది ఉష్ణోగ్రతల్లోనే నిల్వ చేసుకోవచ్చు. దీన్ని ఫ్రిజ్లో ఉంచాల్సిన పనిలేదు. ఇప్పటి వరకూ అందుబాటులోకి వచ్చిన టీకాలు అన్నీ శీతల ఉష్ణోగ్రతల్లోనే నిల్వ చేయాల్సి ఉంది. కొవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్-వి టీకాలు 8సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. ఫైజర్ టీకా అయితే ఏకంగా మైనస్ 71 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. కానీ ఇప్పుడు ఐఐఎస్ తయారు చేసే టీకా సాధారణ గది ఉష్ణోగ్రతల్లోనే నిల్వ చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎటువంటి సమస్యలు లేకుండా వ్యాక్సినేషన్ చేయవచ్చని చెబుతున్నారు.
ఇప్పటికే ఈ కొత్త మాలిక్యూల్స్ని జంతువులపై ప్రయోగించారు. అంటే… చుంచెలుకలు, హామ్స్టెర్స్పై ట్రయల్స్ చేశారు. ఇప్పుడు కరోనా పేషెంట్లకు వ్యాక్సిన్ ఇస్తున్నప్పుడు ఎన్ని యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయో…వాటికంటే 8 రెట్లు ఎక్కువ సంఖ్యలో యాంటీబాడీలు జంతువుల్లో ఉత్పత్తి అయినట్లు తెలిపారు. కరోనా కొత్త వేరియంట్లను ఎదుర్కొనే శక్తి… ఈ కొత్త వ్యాక్సిన్ కి ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే… కొత్త వేరియంట్లను ఎదుర్కోవడానికి ఎన్ని యాంటీబాడీలు కావాలో…అంత కంటే ఎక్కువే దీని వల్ల ఉత్పత్తి అవుతాయని ఐఐఎస్‌లో మాలిక్యూలర్ బయోఫిజిక్స్ ప్రొఫెసర్ రాఘవన్ వరదరాజన్ తెలిపారు.
ప్రత్యేకమైన వ్యాక్సిన్.. ప్రస్తుతమున్న లైసెన్డ్స్ వ్యాక్సిన్లతో పోలిస్తే తాము తయారు చేసే వ్యాక్సిన్ వేరని సైంటిస్టులు చెప్పారు. తమ వ్యాక్సిన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ అని.. వైరస్ స్పైక్ ప్రోటీన్‌తో టీకాను డెవలప్ చేస్తున్నామని వివరించారు. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో డెవలప్ చేశాక చిన్న జంతువులపై విష ప్రభావం, సేఫ్టీ విషయంలో ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. తర్వాత మనుషులపై వేర్వేరు దశల్లో క్లినికల్ ట్రయల్స్ చేస్తామని తెలిపారు. వ్యాక్సిన్ మార్కెట్‌లోకి రావడానికి సంవత్సర కాలం పడుతుందని వివరించారు.
ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? ఈ వ్యాక్సిన్ని సబ్ యూనిట్ వ్యాక్సిన్ అంటున్నారు. కరోనా వైరస్ చుట్టూ కొవ్వు లాంటి ప్రోటీన్ పదార్థం… ముళ్ల రూపంలో ఉంటుందని మీకు తెలుసు కదా..ఈ ముళ్లు కణానికి అతుక్కుంటాయి. ఈ ముళ్ల ప్రోటీన్ మొత్తం 1700 అమైనో యాసిడ్లతో ఉంటుంది. ఇందులో 200 అమైనో యాసిడ్లు కణానికి అతుక్కుంటాయి. ఇలా అతుక్కోకుండా చెయ్యడం ఇప్పుడున్న వ్యాక్సిన్లకు కుదరట్లేదు. ‘‘మా వ్యాక్సిన్ వాటికి భిన్నమైనది. మాది సబ్ యూనిట్ వ్యాక్సిన్. మాది కరోనాను సమర్థంగా ఎదుర్కొంటుంది” అని ప్రొఫెసర్ వరదరాజన్ తెలిపారు. ఈ ల్యాబ్ నాలుగేళ్లుగా ఇన్ఫ్లూయెంజా వ్యాక్సిన్ తయారీపై దృష్టిపెట్టింది. ఇంతలో కరోనా రావడంతో… గతేడాది కరోనా వ్యాక్సిన్ తయారీపై ఫోకస్ పెట్టింది.
ఈ వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుంది? జంతువులపై క్లినికల్ ట్రయల్స్ 6 నెలల్లో పూర్తవుతాయి. ఆ తర్వాత మనుషులపై ట్రయల్స్ మరో 4 నెలల్లో పూర్తవుతాయి. అంటే… ఓ సంవత్సరం తర్వాత ఈ వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. ఇండియాలో థర్డ్ వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉందని కొందరు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేటుగా వచ్చినా తమది సరైన వ్యాక్సిన్ కాబట్టి… ఇది అందరికీ ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ వరదరాజన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి… ఫ్రీగా ఇస్తే మంచి మందై పోతుందా..? అనుమతి లేని నాటు వైద్యం కరెక్టేనా?
ఒక్కరికి కరోనా వస్తే.. 27 మందికి వచ్చినట్టే.! ఐసీఎంఆర్ సర్వేలో షాకింగ్ నిజాలు..