Maharashtra Threat: తెలంగాణకు ‘మహా’ ముప్పు.. రాకపోకలపై నిఘా లేదు.. బోర్డర్‌లో పరీక్షలు అంతంత మాత్రమే
తెలంగాణ రాష్ట్రానికి మహారాష్ట్ర ముప్పు పొంచి వుంది. గత నెలన్నర రోజులుగా ఇదే పరిస్థితి వున్నా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని రహదారులపై సరైన చర్యలు కరవయ్యాయి. దానికితోడు రెండు...
Maharashtra Threat to Telangana State: తెలంగాణ (TELANGANA) రాష్ట్రానికి మహారాష్ట్ర (MAHARASHTRA) ముప్పు పొంచి వుంది. గత నెలన్నర రోజులుగా ఇదే పరిస్థితి వున్నా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు (TELANGANA MAHARASHTRA BORDER)లోని రహదారులపై సరైన చర్యలు కరవయ్యాయి. దానికితోడు రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఎలాంటి నిఘా లేదు. బస్సులు, లారీలు, కార్లు, జీపులు, ద్విచక్రవాహనాలపై మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున జనం నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. తెలంగాణలోకి వైరస్‌ను చొప్పిస్తున్నారు. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు పెద్దగా చర్యలు లేకపోవడంతో మహారాష్ట్రలో విజృంభించిన కరోనా వైరస్ మెల్లిగా తెలంగాణ వైపు మళ్ళుతోంది.
మహారాష్ట్రలో కోవిడ్ మహమ్మారి పంజా విసురుతున్న సంగతి తెలిసింది. రోజుకు లక్ష దాకా కరోనా కేసులు ఆ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. దాంతో తెలంగాణ గజగజ వణకాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దానికి కారణం తెలంగాణలో పలు జిల్లాలకు మహారాష్ట్ర సరిహద్దుగా వుండడమే. మహారాష్ట్ర నుంచి వచ్చిపోయే వారిపై ఎలాంటి నిఘా గానీ, సరిహద్దులో కరోనా పరీక్షలు గానీ లేకపోవడంతో నిజామాబాద్ (NIZAMABAD) ఉమ్మడి జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆంక్షలు లేకుండా సాగుతోన్న రాకపోకలతో వైరస్ నిజామాబాద్, కామారెడ్డి (KAMAREDDY) జిల్లాల్లో కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. సరిహద్దుల్లో తనిఖీలు అంతంత మాత్రమే కావడం, వచ్చి పోయే వారు నిబంధనలు పాటించక పోవడంతో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఫలితంగా నిత్యం వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా, మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లా లో 21 వేలు నమోదవగా, కామారెడ్డి జిల్లాలో 15 వేల 485 పాజిటివ్ కేసులు దాటాయి. ఇప్పటికైనా సరిహద్దుల్లో రాకపోకలు నియంత్రించక పోతే వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమయ్యే పరిస్థితి నెలకొంది.
పొరుగున ఉన్న మహారాష్ట్రలో కరోనా కలకలం రేపుతోంది. అక్కడ నిత్యం వేలాది కేసులు నమోదవుతుండగా, పెద్ద సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. పొరుగునే ఉన్న దెగ్లూర్ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రావు సాహెబ్ (63) కరోనా (CORONAVIRUS)తో శుక్రవారం రాత్రి మరణించారు. సరిహద్దుల్లో ఉన్న నాందేడ్ జిల్లాలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ ప్రభావం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలపై చూపుతోంది. నాందేడ్ (NANDED) జిల్లాలోని దెగ్లూర్ (DEGLOOR), బిలోలీ (BILOLI), ధర్మాబాద్ (DHARMABAD) తదితర ప్రాంతాల నుంచి ఈ రెండు జిల్లాలకు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అంతర్రాష్ట్ర రహదారిపై మొదట్లో కొద్ది రోజులు హడావిడి చేసిన అధికారులు తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో వాహనాలు ఆగకుండానే వెళ్తున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో నిజామాబాద్ జిల్లాలో 141 కేసులు నమోదు కాగా.. కామారెడ్డి జిల్లాలో ఏకంగా 438 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
అక్కడి నుంచి వచ్చే వారి ద్వారా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందుతోంది. మద్నూర్ (MADNOOR) మండలంలోని సలాబత్‌పూర్ తనిఖీ కేంద్రం వద్ద వైద్య సిబ్బంది మహారాష్ట్ర నుంచి బస్సుల్లో వచ్చే ప్రయానికులకు థర్మల్ స్క్రీనింగ్ (THERMAL SCREENING) చేస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే ర్యాపిడ్ టెస్ట్ (RAPID TESTS)లు చేస్తున్నారు. అయితే, ఆటోలు, జీపులు, లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు మాత్రం ఆపకుండా వెళ్లి పోతున్నారు. దీంతో మద్నూర్ మండలంలోని గ్రామాలతో పాటు పిట్లం, జుక్కల్, పెద్ద కొడప్‌గల్ మండలాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మద్నూర్ మండలంలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 282కు చేరింది. బోధన్ డివిజన్‌లోని సాలూర వద్ద ఆపే వారే లేరు. వివిధ అవసరాల నిమిత్తం అక్కడి ప్రజలు బోధన్ (BODHAN), నిజామాబాద్ ప్రాంతాలకు వస్తుండగా, ఎంత మంది వైరస్‌ను మోసుకొస్తున్నారో తెలియడం లేదు. ఇదే డివిజన్ పరిధిలోని రెంజల్ మండలం కందకుర్తి వద్ద ధర్మాబాద్ ప్రాంతం నుంచి నిత్యం వందలాది మంది ప్రజలు వచ్చిపోతుంటారు. అక్కడా పట్టించుకునే వారు లేరు. దీంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకునే పరిస్థితి లేకుండా పోయింది.
ALSO READ: మయన్మార్‌లో ఆగని మారణహోమం.. 24 గంటల్లో వందమందికిపైగా హతం!
ALSO READ: ప్రచార పర్వంలో సవాళ్ళ జోరు.. హీటెక్కుతున్న తిరుపతి ఉప ఎన్నిక.. సై అంటే సై
ALSO READ: డ్రాగన్ కంట్రీలో ఉత్తుత్తి వ్యాక్సిన్.. చైనా టీకా సామర్థ్యంపై ఆ దేశ సంస్థకే అనుమానాలు