లాక్‌డౌన్‌లోనూ తెలంగాణలో తగ్గని ఆదాయం…20 రోజుల్లో రూ.100 కోట్లు
కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో సర్కార్‌కు రాబడి భారీగా తగ్గిపోయింది. కానీ, తెలంగాణలో మాత్రం ఓ శాఖ ఆదాయం రికార్డ్ బ్రేక్ చేస్తోంది. లాక్‌డౌన్‌లోనూ కోట్లల్లో ఆదాయం తెచ్చిపెడుతోంది.

చిన్న వైరస్ యావత్ ప్రపంచాన్నే కాలు కదపకుండా కట్టిపడేసింది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్ని కుదేలైపోయాయి. భారత్‌లోనూ కోవిడ్ 19 పంజా విసరడంతో కేంద్రం లాక్‌డౌన్ విధించింది. దీంతో సామాన్యుల నుంచి బడా వ్యాపార వర్గాల కార్యకలాపాలాన్ని స్తంభించిపోయాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో సర్కార్‌కు రాబడి కూడా భారీగా తగ్గిపోయింది. కానీ, తెలంగాణలో మాత్రం ఓ శాఖ ఆదాయం రికార్డ్ బ్రేక్ చేస్తోంది. లాక్‌డౌన్‌లోనూ కోట్లల్లో ఆదాయం తెచ్చిపెడుతోంది.
తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి మే 1 నుంచి భారీగా పెరిగింది. ఈ నెల 1వ తేదీ నుంచి 20 రోజుల్లోనే రూ. 100 కోట్లు దాటింది. ఏప్రిల్ నెలలో శాఖకు కేవలం రూ. 13 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఈ నెలలో మే 20వ తేదీ వరకు రూ. 104 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ. 117 కోట్లు సమకూరినట్లయింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 4,499 రిజిస్ట్రేషన్లు జరగ్గా, రూ.12.6 కోట్లు లభించిందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ మూడు జిల్లాల్లోనే రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగినట్లు అధికారులు వివరించారు.




