3 రోజుల్లో కేబినెట్..లాక్‌డౌన్‌పై నిర్ణయం
కరోనాతో భయపడాల్సిన పనిలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో కేసులు పెరుగుతున్నాయని, అయితే..
కరోనాతో భయపడాల్సిన పనిలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో కేసులు పెరుగుతున్నాయని, ప్రతీ రోజు వెయ్యి చేరువలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే మరణాల రేటు తక్కువగా ఉందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో కరోనా ప్రభావం తక్కువగానే ఉందని, హైదరాబాద్ కాస్మో పాలిటన్ సిటీ కాబట్టి కేసులు పెరిగాయని చెప్పారు. ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారమే బాధితులకు ట్రీట్‌మెంట్ ఇస్తున్నామని, కరోనా బాధితులకు వెంటిలేటర్లకన్నా ఆక్సిజన్ అవసరం ఎక్కువ ఉందని మంత్రి ఈటల స్పష్టం చేశారు.
కరోనా రోగులకు సరైన చికిత్స అందడంలేదన్నది అవాస్తవమని ఈటల అన్నారు. కరోనా రోగులు కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు వైఫై సౌకర్యం కల్పించామన్నారు. కానీ, కొంతమంది దానిని దుర్వినియోగం చేసుకున్నారని, సోషల్‌మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 184 మంది పోలీసులకు కరోనా సోకిందని తెలిపారు. అందరూ కరోనా నుంచి కోలుకున్నారని చెప్పారు. 258 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. హెడ్ నర్సు మృతి చెందారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్ల కొరత లేదన్నారు. వారం రోజుల్లో 10వేల బెడ్స్ అందుబాటులోకి వస్తాయని మంత్రి ఈటల తెలిపారు.
ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి ఈటల స్పష్టం చేశారు. తెలంగాణలో కోవిడ్ బెడ్లు, ఐసోలేషన్ వార్డులకు కొదువలేదన్నారు. రాష్ట్రంలో మళ్లీ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని, పరీక్షల సంఖ్య పెంచామని తెలిపారు. కేసులు ఎక్కువగా ఉన్న చోట్ల మళ్లీ కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అవసరం అనుకుంటే లాక్‌డౌన్‌కు వెళ్దామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మూడు రోజుల్లో కేబినెట్ భేటీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ భేటీ అనంతరం లాక్‌డౌన్‌పై స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తారని తెలిపారు.