AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delta Variant: డెల్టా వేరియంట్‌తో యమా డేంజర్.. అప్రమత్తంగా వుండాలంటున్న శాస్త్రవేత్తలు

కరోనా వైరస్‌ని నియంత్రిచడానికి ప్రపంచవ్యాప్తంగా జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిలో భాగంగా పలు వ్యాక్సిన్ల తయారీకి చాలా దేశాలు పరుగులు పెడుతున్నాయి.

Delta Variant: డెల్టా వేరియంట్‌తో యమా డేంజర్.. అప్రమత్తంగా వుండాలంటున్న శాస్త్రవేత్తలు
Delta Varient
Rajesh Sharma
|

Updated on: Jun 21, 2021 | 8:47 PM

Share

Delta Variant more dangerous than original coronavirus: కరోనా వైరస్‌ని నియంత్రిచడానికి ప్రపంచవ్యాప్తంగా జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిలో భాగంగా పలు వ్యాక్సిన్ల తయారీకి చాలా దేశాలు పరుగులు పెడుతున్నాయి. ఇందులో మన దేశం కూడా వుంది. మనదేశంలో వున్న భారీ జనాభా అంతటికీ వ్యాక్సిన్ చేరాలంటే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడంతోపాటు వ్యాక్సిన్ డ్రైవ్‌లను నిర్వహించాల్సిన పరిస్థితి. ఇలాంటి కీలక తరుణంలోనే ప్రమాదకరమైన వైరస్‌ రకాలు పుట్టుకొస్తున్నాయి. భారత్‌లో మొదటిసారిగా గుర్తించిన డెల్టా వేరియంట్‌ బ్రిటన్‌లో తీవ్రంగా వ్యాప్తి చెందుతుండటంతో అక్కడి అధికారులు ఉన్న పళంగా మిలటరీని ఆసుపత్రులకు పంపించాల్సి వచ్చింది. జూన్‌ 21న కోవిడ్‌ నిబంధనలను సడలించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని హెచ్చరించారు.

ఇతర వైరస్‌ రకాలతో పోలిస్తే డెల్టా వేరియెంట్‌ చాలా ఆందోళన కలిగిస్తోంది. SarsCov-2 డెల్టా వేరియంట్‌కి B.1.617.2 రకం అని మరో పేరుంది. ఇంతవరకు బయటపడిన కరోనా వైరస్‌ రకాల్లో ఈ డెల్టా వేరియంట్‌ అత్యంత ప్రమాదకరంగా మారడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, ఇప్పటికే బ్రిటన్‌లో కనుగొన్న అల్ఫా రకంతో పోలిస్తే ఇది 40 శాతం అధిక రేటుతో పరివర్తన చెందుతోంది. వైరస్‌ ఒరిజనల్‌ రకంతో పోలిస్తే ఇది యాభై శాతం అధికంగా పరివర్తన చెందుతున్నట్లు కనుగొన్నారు. ఏప్రిల్‌ ప్రారంభంలో ఒక్క శాతం మాత్రమే డెల్టా వేరియంట్‌ కేసులుగా బయటపడగా మే నెల మధ్యనాటికి యుకేలోని మొత్తం కేసుల్లో 70 శాతం డెల్టా వేరియంట్‌ కేసులేనని నిర్ధారించారు. ఇలాగే విస్తరిస్తే జూన్‌ చివరినాటికి ఇది అల్పా వేరియంట్‌ స్థానాన్ని అధిగమిస్తుందని చెబుతున్నారు. రెండు, ఇది అల్ఫా వైరస్‌ రకం కంటే ప్రమాదకరమైనదని భావిస్తున్నారు. ఆసుపత్రుల్లో చేర్చవలసిన పాజిటివ్‌ కేసుల శాతాన్ని ఈ వైరస్‌ రకం అమాంతంగా పెంచేస్తోంది. ఈ వైరస్‌ రకం ఇన్ఫెక్షన్లు ప్రధానంగా యువతలో అధికంగా ఏర్పడుతున్నాయి. ఇది మరింత తీవ్రంగా విస్తరిస్తోంది.

డెల్టా వేరియంట్‌.. వ్యాక్సిన్లకు ప్రభావితం అవుతుందా అంటే సమాధానం చెప్పడం కష్టమే. ఇంగ్లండ్‌ ప్రజారోగ్య శాఖ చెబుతున్న దానిప్రకారం ఫైజర్, బయోన్‌ టెక్, అస్ట్రాజెనెకా కంపెనీల వ్యాక్సిన్లు తొలి డోస్‌ తీసుకున్నవారికి డెల్టా వేరియంట్‌ నుంచి 30 శాతం రక్షణ మాత్రమే లభించిందని తెలుస్తోంది. అయితే ఫైజర్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న వారిలో 88 శాతం మందికి అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకున్నవారిలో 60 శాతం మందికి ఈ వైరస్‌ రకం నుంచి రక్షణ లభించిందని తేలింది. ఈ రకమైన రక్షణ అల్పా, బీటా వేరియంట్లలో చాలా తక్కువ. జనాభాలో ఎక్కువమంది వ్యాక్సిన్‌ ఇంకా తీసుకోనప్పుడు, లేదా ఇంతవరకు ఒక డోస్‌ మాత్రమే తీసుకున్నప్పుడు డెల్టా వేరియంట్‌ కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.

బ్రిటన్‌లో ఇప్పటికే డెల్టా వేరియంట్‌ వ్యాప్తి అదుపు తప్పింది. అమెరికాలో, యూరోపియన్‌ యూనియన్‌లోని ఇతర దేశాల్లో ఇది ప్రాథమిక దశలో ఉంది. ఈ వైరస్‌ రకం ఇప్పటికే కనిపించిన దేశాలు దీని నివారణకు ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. వ్యాక్సిన్‌ను వీలైనంత ఎక్కువమందికి అందించడం, అదే సమయంలో పరీక్షలు, జన్యుపరమైన నిఘాను పెంచడాన్ని కూడా రెట్టింపు చేయాలి. మొత్తం జనాభాలో సగంమందికి వ్యాక్సిన్‌ ఇప్పించిన ఇజ్రాయెల్‌ డెల్టా వేరియంట్‌ని కూడా బాగానే అదుపు చేయగలిగింది. అయితే ఇంతవరకు జనాభాలో 42.3 శాతం మందికి టీకా వేయించిన బ్రిటన్‌లో ముందుగానే లాక్‌డౌన్‌ సడలించడం, డెల్టా వేరియంట్‌ వ్యాప్తి కావడంతో కేసులు అధికమవుతున్నాయి. అమెరికాలో కూడా యూకే తరహాలోనే వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగుతుండటంతో అక్కడా డెల్టా వేరియంట్‌ ప్రమాదం పొంచుకుని ఉంది.

ఇంతవరకు కరోనా వైరస్‌ బారిన పడకుండా పిల్లలు చాలావరకు తప్పించుకున్నారు. అలాగని వీరికి కరోనా వైరస్‌తో ఎలాంటి ప్రమాదం లేదని కాదు. పెద్దవారికైతే ఇప్పటికే వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. వ్యాక్సిన్‌ తీసుకోనివారికి, అది ఇంకా అందనివారికి మందులతో పనిలేని నివారణ పద్ధతులు అంటే మాస్కులు, భౌతిక దూరం పాటించడం వంటివి ఉపయోగంలో ఉంటున్నాయి. వైరస్‌ కాంట్రాక్ట్‌ ప్రమాదం తక్కువగా ఉండి కమ్యూనిటీ కేసులు పరిమితంగా ఉన్నం తవరకు ఇవి పనిచేస్తాయి. అయితే డెల్టా వేరియంట్‌ కానీ, ఇతర వైరస్‌ రకాలు కానీ చిన్నపిల్లలపై తీవ్రంగా ప్రభావితం చేస్తాయని తేలినప్పుడు నష్టం భయం గురించిన మన అంచనాలను పూర్తిగా పునఃపరిశీలించుకోవలిసి ఉంటుంది. ఇప్పటికే బ్రిటన్‌లో యువతలో చాలామంది ఆసుపత్రుల పాలైన నేపథ్యంలో సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ మనకంటే కాస్త ముందే ఉందని గ్రహించాలి. వ్యాక్సినేషన్‌ని అధికస్థాయికి తీసుకుపోవడం, పరీక్షలను కొనసాగించడం ద్వారా కరోనాపై పోరులో మన చొరవను రెట్టింపు చేసుకోవాలి.