క‌రోనా కష్టకాలంలో పరిమళించిన రోజా మానవత్వం

రాష్ట్రంలో కరోనా కోర‌లు చాస్తోంది. వైర‌స్‌ మహమ్మారి రోజురోజుకూ విస్త‌రిస్తూ... విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో..

  • Jyothi Gadda
  • Publish Date - 7:22 am, Tue, 7 April 20
క‌రోనా కష్టకాలంలో పరిమళించిన రోజా మానవత్వం
రాష్ట్రంలో కరోనా కోర‌లు చాస్తోంది. వైర‌స్‌ మహమ్మారి రోజురోజుకూ విస్త‌రిస్తూ… విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో తన నియోజకవర్గ ప్రజలకు ధైర్యాన్ని నూరిపోస్తూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్యపరుస్తున్నారు. తనకున్న సినీమా ఇమేజ్‌ను పక్కన పెట్టి ప్రతీ వాడా, ప్రతీ గ్రామం తిరుగుతూ నిత్యం ప్రజలతో మమేకమై సేవలు అందిస్తున్నారు. లాక్‌ డౌన్‌ సమయంలో ప్రజలు ఎదర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని నిత్యాన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో ఉచిత భోజన సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తన కార్యకర్తలు, అనుచరుల సహాయంతో కార్యక్రమాలను ముమ్మరం చేశారు.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు నగరి నియోజకవర్గంలో కొనసాగుతున్న అధికారిక చర్యల్లో తొలిరోజు నుంచి ముం దు నిలుస్తున్నారు రోజా. చాలామంది ప్రజా ప్రతినిధులలాగానే ప్రజలను కరోనా కట్టడి ఆవశ్యకత విషయంలో అప్రమత్తం చేస్తూనే అందుకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. నియోజకవర్గ ప్రజల అవసరాన్ని గుర్తించి కరోనా వ్యాధి సోకకుండా చూసేందుకు పెద్ద సంఖ్యలో మాస్కులను, శానిటైజర్లను పంపిణీ చేసారు. ఒక సామాజికకార్యకర్తలా వాటిని ఎలా వినియోగించుకుని తనను, తన కుటుంబాన్ని, సమాజాన్ని రక్షించుకోవాలో వివరిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యారు.
ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు అధికారులతో కలిసి రోడ్లపై తిరుగుతూ లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించేవారిని నయాన భయాన అదుపు చేయడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. అన్నిటినికి మించి కరోనా వ్యాప్తి నియంత్రణ విధులను నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, పారామెడికల్‌ సిబ్బందికి తదితరులకు మాస్కులు అందించడంతో పాటు వారి కుటుంబాలకు అవసరమైన నిత్యావసర వస్తువులను అందించే కార్యక్రమాలలో కీలకపాత్ర పోషిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా తిండి దొరకని పరిస్థితుల్లో ఆకలితో అలమటిస్తున్నవారికి ఆహారపొట్లాలను, నీటిబాటిళ్లను అందించడానికి విశేష కృషి చేస్తున్నారు. అన్నిటినిమించి విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర వస్తువులు అందించడంతో పాటు వారి వాహనాలకు ఉచితంగా పెట్రోలు పోయించే విలక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రోజా చేపట్టారు.
సామాజిక దూరం పాటించాలని సూచిస్తూనే.. సేవాల కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. మానవ ప్రయత్నాలకు భగవంతుని ఆశీస్సులు కూడా అవసర మనే భావనతో ప్రత్యేక పూజలు, యాగాలను నిర్వహించి ప్రజలకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. సమాజానికి ప్రముఖ సినీనటిగా తెలిసిన ఆర్‌.కె.రోజా నగరి నియోజ కవర్గంలో మాత్రం ప్రజలకు సేవలందించే ప్రజా ప్రతినిధిగా మారిపోతారు. రెండుసార్లు తనను శాసనసభ్యు రాలిగా గెలిపించిన నగరి నియోజకవర్గ ప్రజల కష్టసుఖా లలో భాగస్వామిగా వ్యవహరించడంలో ముందుంటారు. కరోనా కష్టాలను ఎదుర్కొంటున్న ప్ర‌జ‌ల‌కు చేదోడు వాదోడుగా ఉంటూ తల్లిగా, అక్కగా, చెల్లిగా ఎమ్మెల్యే రోజా పోషిస్తున్న బహుముఖ పాత్ర పట్ల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.