హైదరాబాద్‌లో విషాదం..కరోనాతో 7రోజుల పసికందు మృతి
తెలంగాణలో కరోనా మహమ్మారి జడలు విప్పుకుంటోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో బుసలు కొడుతున్న కరోనా చిన్నారులను బలితీసుకుంటోంది. కరోనా బారిన పడి హైదరాబాద్‌లో ఏడు రోజుల పసికందు మృతి చెందింది. తల్లికి కరోనా లేకుండా బిడ్డకు వ్యాధి సోకి మరణించడం తీవ్ర కలకలం రేపింది.

తెలంగాణలో కరోనా మహమ్మారి జడలు విప్పుకుంటోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో బుసలు కొడుతున్న కరోనా చిన్నారులను బలితీసుకుంటోంది. కరోనా బారిన పడి హైదరాబాద్‌లో ఏడు రోజుల పసికందు మృతి చెందింది. తల్లికి కరోనా లేకుండా బిడ్డకు వ్యాధి సోకి మరణించడం తీవ్ర కలకలం రేపింది. అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా సోకి ఇంత తక్కువ వయసులో చనిపోవడం ఇదే తొలిసారి. వివరాల్లోకి వెళితే..
కుత్భుల్లాపూర్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల నిలోఫర్ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ, క్షేమంగా ఉండటంతో వారిని డిశ్చార్జీ చేశారు. ఆ తర్వాత చిన్నారి అనారోగ్యానికి గురి కావడంతో పరీక్షలు జరపగా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ప్రసవానికి ముందే తల్లి, బిడ్డకు కరోనా పరీక్షలు చేశారు. వారి కుటుంబంలో కూడా ఎవరికి కరోనా లక్షణాలు లేవు. ఈ క్రమంలో ఆస్పత్రిలోనే ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. శిశువు ఉన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవారిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ మాత్రం వైరస్ లక్షణాలు కనిపించినా, అనుమానం కలిగినా వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఇదిలా ఉంటే, తెలంగాణలో తాజాగా నమోదైన కరోనా కేసుల సంఖ్య చూస్తుంటే..కరోనా తిరిగి పంజా విసురుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రమే కేసులు నమోదు కాగా, తాజాగా, రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చల్ జిల్లాలో 6 కేసులు..సూర్యాపేట్, వికారాబాద్, నల్గొండ, నారాయణ్ పేట్ జిల్లాల్లో ఒక్కోకేసు నమోదవడం కలకలం రేపుతోంది. అటు గత కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటం భయాందోళనలు కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1991కి చేరగా, అందులో 650 యాక్టివ్ కేసులు ఉండగా.. 1284 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.