Corona Virus: కొవిడ్ నుంచి కోలుకున్నాక డెలిరియం వస్తోందట..! లక్షణాలు ఎలా ఉన్నాయంటే..?
Corona Virus: అమెరికాలో కరోనాతో ఆస్పత్రిలో చేరిన 150 మంది రోగులపై జరిపిన అధ్యయనంలో 73 శాతం మంది రోగులకు డెలిరియం వ్యాధి ఉన్నట్లు తేలింది.
Corona Virus: అమెరికాలో కరోనాతో ఆస్పత్రిలో చేరిన 150 మంది రోగులపై జరిపిన అధ్యయనంలో 73 శాతం మంది రోగులకు డెలిరియం వ్యాధి ఉన్నట్లు తేలింది. డెలిరియం అంటే మతిమరుపుకి సంబంధించిన సమస్య. మానసిక స్థితి సరిగ్గా ఉండదు. ఆలోచించే శక్తిని కోల్పోతాడు. నిత్యం పరధ్యానంలో ఉంటాడు. ఈ పరిస్థితి ఎక్కువగా వృద్ధులలో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కొవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్లలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. ‘BMJ ఓపెన్’ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనంలో.. డెలిరియం ఉన్న పేషెంట్లు అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడుతున్నట్లు కనుగొన్నారు. కోవిడ్ -19 కి సంబంధించిన లక్షణాలు వారిలో మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి.
యుఎస్‌లోని మిచిగాన్ విశ్వవిద్యాలయంలో అధ్యయన నిర్వాహకుడు ఫిలిప్ వ్లెసైడ్స్ మాట్లాడుతూ ‘కోవిడ్ అనేక ఇతర వ్యాధి కారకాలతో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే కరోనా నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పాడు. కోవిడ్ -19 తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన రోగులు ఎక్కువగా డిప్రెషన్‌కు గురై మతిమరుపుతో బాధపడుతున్నారని ఫిలిప్ చెప్పారు. ఇది దీర్ఘకాలిక న్యూరోలాజికల్ ఎఫెక్ట్‌లను కలిగి ఉంటుందన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పేషెంట్లు ఆలోచనా సామర్థ్యం కోల్పోతున్నారని అధ్యయనం తేల్చింది. చాలామంది రోగులు మతిమరుపుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కొంతమంది రోగులలో ఈ లక్షణాలు నెలరోజుల పాటు ఉంటున్నాయి. దీంతో కోలుకోవడానికి చాలా సమయం పడుతున్నట్లు చెబుతున్నారు.