Corona Pandemic: ప్రభుత్వ నిబంధనలు పాటించండి..కరోనా బారిన పడకండి..కేంద్ర అధికారుల సూచన

కరోనా మహమ్మారి కోరల్లో దేశంలోని పది రాష్ట్రాలు తీవ్రంగా చిక్కుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ పది రాష్ట్రాల్లోనే కోవిడ్ మరణాలు అధికంగా నమోదు అవుతున్నట్టు తెలిపింది.

Corona Pandemic: ప్రభుత్వ నిబంధనలు పాటించండి..కరోనా బారిన పడకండి..కేంద్ర అధికారుల సూచన
Coronavirus In India
Follow us

|

Updated on: Apr 30, 2021 | 11:03 PM

Corona Pandemic: కరోనా మహమ్మారి కోరల్లో దేశంలోని పది రాష్ట్రాలు తీవ్రంగా చిక్కుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ పది రాష్ట్రాల్లోనే కోవిడ్ మరణాలు అధికంగా నమోదు అవుతున్నట్టు తెలిపింది. దేశంలో కరోనా పరిస్థితులను కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వాలు జారీ చేసే నిబంధనలు ప్రజలు తప్పకుండా పాటించాలని ఆయన చెప్పారు. దేశ ప్రజలు కరోనా విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు అని ఆయన అన్నారు. గడచిన నాలుగువారాల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌‌, కర్ణాటక, యూపీ, ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్‌లలో మరణాలు పెరుగుతూ వచ్చాయని చెప్పారు. గతంతో పోలిస్తే ఈ రెండో వేవ్ ఉధృతి ఎక్కువగా ఉందన్నారు. రాజస్థాన్, యూపీ లలో 5 రెట్లు వైరస్ ఉధృతి పెరిగిందని తెలిపారు. అలాగే ఛత్తీస్‌గఢ్ లో 4.5 రెట్లు, ఢిల్లీలో   3.3రెట్లు పెరిగినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా.. కరోనా లేదూ.. ఏమీ లేదూ.. నా ప్రాణాలకు ఏమీ కాదు అని మాస్క్ అవసరం లేదని భావించే కొందరు ప్రజల వలనే కేసులు ఎక్కువ అవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలనీ, ధీమాకు పోవద్దనీ ఆయన సూచించారు. అలాగే ఆందోళనకు గురికావద్దన్నారు.

దేశంలో సరిపడా లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నట్టు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. రాష్ట్రాలకు కేటాయించే అంశంపై రోజువారీ సమీక్షిస్తున్నట్టు చెప్పారు. ఏ ఆస్పత్రిలోనూ ఆక్సిజన్‌ కొరత లేకుండా చూసేందుకు వీలుగా రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొనేందుకు 24X7 కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. భారతీయ రైల్వే, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ సంస్థలు ఆక్సిజన్‌ సజావుగా సరఫరా జరిగేలా దోహదం చేస్తున్నాయన్నారు. ఇప్పటివరకు 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాతలకు 8,593 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను కేటాయించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక దేశంలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో గురువారం.. 3,86,452 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 3,498 మంది బాధితులు మరణించారు. తాజాగా నమోదైన కేసుల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,62,976(1.87 కోట్లు) కు పెరగగా.. మరణాల సంఖ్య 2,08,330 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. దేశంలో కరోనా మొదలైన నాటినుంచి.. ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

ఇదిలాఉంటే.. గురువారం కరోనా నుంచి 2,97,540 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,53,84,418 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 31,70,228 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 81.99 శాతం ఉండగా.. మరణాల రేటు 1.11 శాతం ఉంది.