AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా మూడో దశకు ఆయుష్మాన్ భారత్ సిద్ధం

భారత్‌లో ప్రవేశించిన కరోనా ప్రస్తుతానికి రెండో దశలో ఉంది. అంటే... విదేశీయులతో సంబంధం లేకుండా... ఇండియాలో ఉన్నవారి నుంచే ఇండియాలో ఉన్నవారికి కరోనా వైరస్ సోకుతోంది. ఇది మూడో దశకు వెళ్తే..

కరోనా మూడో దశకు ఆయుష్మాన్ భారత్ సిద్ధం
Jyothi Gadda
|

Updated on: Mar 19, 2020 | 10:25 AM

Share

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కరాళనృత్యం చేస్తోంది. మహమ్మారి దెబ్బకు అన్ని దేశాలు వణికిపోతున్నాయి. మొత్తం 171 దేశాలకు వైరస్‌ వ్యాపించింది. ఇప్పటి వరకూ సుమారు 9వేల మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. 2 లక్షల మందికిపైగా వైరస్‌ సోకింది. అన్ని దేశాలు కరోనాపై యుద్ధం ప్రకటించాయి. వైరస్‌ వ్యాపించకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. పలుదేశాలు సరిహద్దులను మూసివేశాయి. విమానాల రాకపోకలను రద్దు చేశాయి. స్కూల్స్‌, యూనివర్శిటీలు, బహిరంగసభలపై ఆంక్షలు విధించాయి. హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాయి.

భారత్‌లో ప్రవేశించిన కరోనా ప్రస్తుతానికి రెండో దశలో ఉంది. అంటే… విదేశీయులతో సంబంధం లేకుండా… ఇండియాలో ఉన్నవారి నుంచే ఇండియాలో ఉన్నవారికి కరోనా వైరస్ సోకుతోంది. ఇది మూడో దశకు వెళ్తే ప్రమాదమే. అప్పుడు ఇటలీ, ఇరాన్‌లో లాగా వైరస్ విపరీతంగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అది రాకుండా భారత్ అప్రమత్తమైంది. ముందుస్తుగానే ఇండియా జాగ్రత్త పడుతోంది. ఓ నెల పాటూ ప్రజలంతా స్వయంగా జాగ్రత్తలు పాటిస్తేనే మూడో దశలోకి వెళ్లకుండా ఉండగలమని నిపుణులు చెబుతున్నారు. తాజాగా హర్యానా, పుదుచ్చేరిలో కూడా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా రోజురోజుకూ కరోనా సోకుతున్న రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. దేశంలో ఎక్కువ కరోనా కేసులున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఎడమ చేతులపై స్టాంప్ ట్యాగ్ వేసి… 14 రోజులు ఇళ్లలోనే ఉండేలా చేస్తోంది. దేశంలో తొలి కరోనా మృతి సంభవించిన కర్ణాటకలో హెల్త్ ఎమర్జెన్సీ ఉంది. సాప్ట్‌వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇక రైల్వే శాఖ… ప్లాట్ ఫామ్ టికెట్ రేటును రూ.50 చేసింది. తద్వారా ఎక్కువ మంది రైల్వేస్టేషన్లకు రాకుండా ఆపాలని చూస్తోంది.

దేశంలో కరోనా వైరస్‌ సాంకేతికంగా రెండో దశలోనే ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో మూడో దశ మీద దృష్టి కేంద్రీకరిస్తున్నది. ఒకవైపు రెండోదశ తాలూకు జాగ్రత్త చర్యలను తీసుకుంటూనే, మూడోదశలో తీసుకోవాల్సిన చర్యలకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. సామూహిక వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రయివేటు ఆసుపత్రుల్ని, లేబొరేటరీలను కూడా భాగస్వాముల్ని చేస్తోంది. ముఖ్యంగా మహరాష్ట్రలాంటి చోట్ల ఇలాంటి చర్యలు సత్వరం అనివార్యమవుతున్నట్టు కేంద్రం గుర్తించింది. ఐసొలేషన్‌ వార్డులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సి వస్తుందన్న ఆలోచనతో ఎన్నెన్ని ఇండిపెండెంట్‌ రూములు, బెడ్లు అవసరమవుతాయన్న అంచనాల తయారీలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉన్నట్టు తెలుస్తోంది. హెల్త్‌కేర్‌ వర్కర్లకు పెద్ద ఎత్తున శిక్షణకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవేళ కరోనా వ్యాప్తిలో దేశం గనక మూడో దశలోకి ప్రవేశిస్తే హెల్త్‌ ప్యాకేజీలను, ఇతర ప్రొటోకాల్స్‌ను సిద్ధం చేయాలని ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్యబీమా పథకానికి నోడల్‌ ఏజన్సీగా వ్యవహరిస్తున్న నేషనల్‌ హెల్త్‌ అథారిటీని ఆదేశించారు.