Coroanvirus: అక్కడ పాఠ్యాంశంగా ‘కరోనా వైరస్’.. తొలుత 11వ తరగతి సిలబస్‌లో చేర్చిన విద్యాశాఖ..!
కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ప్రపంచాన్నే మంచానికి కట్టేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తున్నా జనంలో చలనం రావట్లేదు.
Coronavirus in School Syllabus: కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ప్రపంచాన్నే మంచానికి కట్టేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తున్నా జనంలో చలనం రావట్లేదు. ఇళ్లలోంచి బయటకు రావొద్దని చెబుతున్నా చాలా మంది పెడచెవిన పెడుతున్నారు. చీటికీ మాటికీ రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వారికి కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వివిధ పద్ధతులు ఎంచుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఓ పాఠ్యాంశంలా బోధించాలని నిర్ణయించింది బెంగాల్ సర్కార్. ఇకపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లోని 11వ తరగతిలో ‘హెల్త్ అండ్ ఫిజకల్ ఎడ్యుకేషన్’ సబ్జెక్ట్‌లో కరోనా వైరస్‌కు సంబంధించిన పూర్తి అంశాలను బోధించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కరోనా మహ్మరికి సంబంధించిన పాఠ్యాంశంగా ప్రవేశపెడుతోంది. ఇందులో కరోనా అంటే ఏమిటి? అది ఇతరులకు ఎలా వ్యాపిస్తుంది? వైరస్ లక్షణాలేమిటి? క్వారంటైన్‌కి సంబంధించిన తదితర వివరాలు పూర్తిగా ఉంటాయి. అంతే కాదు.. కేవలం 11వ తరగతికి మాత్రమే కాకుండా 6 నుంచి10వ తరగతి పాఠ్యాంశాల్లో బోధించాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విద్యా శాఖ యోచిస్తోంది.
ఈమేరకు అలాంటి ఆలోచనలతో ముందుకు రావాలని కరోనా నియంత్రణకు ఏర్పాటు చేసిన సలహా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. విద్యాశాఖకు సంబంధించిన ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘కొవిడ్ వల్ల మన ఆత్మీయులను కోల్పోవాల్సి వచ్చింది. అందుకే విద్యార్థులకు దీని మీద కనీస అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అన్నారు. విద్యార్థుల్లో అవగాహన పట్ల వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తతో కొంత నియంత్రించవచ్చన్నారు. ఇదే విషయంపై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటు వ్యాధుల నిపుణులు డా. యోగిరాజ్ రాయ్ మాట్లాడుతూ..‘‘ కరోనా వైరస్ గురించి పాఠ్యాంశాల్లో చేర్చడమనేది ఓ మంచి నిర్ణయం. పిల్లలకు కనుక దీని మీద అవగాహన వస్తే.. ముందస్తు నిర్ధారణకు ఉపయోగపడుతుంది. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా త్వరగా పూర్తవుతుంది’’ అన్నారు. ప్రజా ఆరోగ్య నిపుణులు కాజల్ కృష్ణ బానిక్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాల్యం నుంచే పిల్లలకు అవగాహన తీసుకురావాల్సిన అవసరం చాలా ఉందన్నారు. తద్వారా సమాజంలో కరోనా అంటే భయంపోతుందన్నారు.