AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Face Authentication: యూపీఎస్సీ పరీక్షల్లో ఫేస్ ఆథెంటికేషన్‌ విజయవంతం.. డమ్మీ అభ్యర్థుల బెడదకు చెక్‌

సివిల్ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ) పరీక్ష-2026లో యూపీఎస్సీ తొలిసారిగా రియల్‌టైమ్‌ ఫేస్‌ ఆథెంటికేషన్‌ టెక్నాలజీని విజయవంతంగా అమలు చేసింది. దేశవ్యాప్తంగా 2,072 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల ముఖాలను దరఖాస్తు సమయంలో అప్‌లోడ్‌ చేసిన ఫొటోలతో సరిపోల్చి ధృవీకరించారు. ఈ విధానం ద్వారా డమ్మీ అభ్యర్థులు పరీక్షలు రాయడం వంటి మోసాలకు అడ్డుకట్ట పడిందని యూపీఎస్సీ తెలిపింది. కేవలం 6 నుంచి 8 సెకన్లలో పూర్తయ్యే ఈ ప్రక్రియను ఇన్విజిలేటర్లు తమ ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్ల ద్వారానే నిర్వహించడం విశేషం. పరీక్షల్లో పారదర్శకత, భద్రత, సాంకేతిక వినూత్నతకు ఇది కీలక ముందడుగుగా యూపీఎస్సీ పేర్కొంది..

UPSC Face Authentication: యూపీఎస్సీ పరీక్షల్లో ఫేస్ ఆథెంటికేషన్‌ విజయవంతం.. డమ్మీ అభ్యర్థుల బెడదకు చెక్‌
UPSC face authentication in Prelims
Srilakshmi C
|

Updated on: Jun 05, 2026 | 3:33 PM

Share

హైదరాబాద్‌, జూన్ 5: ప్రతిష్టాత్మక యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో నకిలీ అభ్యర్థులను పరిహరించేందుకు ప్రవేశపెట్టిన ఫేస్‌ అథెంటికేషన్‌ ప్రక్రియను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) విజయవంతంగా అమలు చేసింది. మే 24న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షలో ముఖ గుర్తింపు కోసం ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని విజయవంతంగా అమలు చేసినట్లు గురువారం (జూన్‌ 4) కమిషన్‌ ప్రకటించింది. దరఖాస్తు ఫారం నింపే సమయంలో అప్‌లోడ్‌ చేసిన ఫోటో, అడ్మిట్‌ కార్డులోని అభ్యర్థి ఫోటోతో సరిపోలుతుందో? లేదో గుర్తించేందుకు ఈ వ్యవస్థ ధృవీకరిస్తుందని యూపీఎస్సీ వెల్లడించింది. నేషనల్‌ ఈ- గవర్నెన్స్‌ డివిజన్‌ అందించిన సాంకేతిక సహకారంతో సొంతంగా ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు యూపీఎస్సీ పేర్కొంది.

దరఖాస్తు చేసుకున్న 8,19,732 మంది అభ్యర్థులలో దాదాపు 5.49 లక్షల మంది అంటే సుమారు 67 శాతం పరీక్షకు హాజరయ్యారు. వీరందరికీ ముఖ గుర్తింపు కోసం ఈ యాప్‌ని వినియోగించారు. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలోని నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) సాంకేతిక సహకారంతో యూపీఎస్సీ ఈ ఫేస్ అథెంటికేషన్ అప్లికేషన్‌ను అంతర్గతంగా అభివృద్ధి చేసింది. అభ్యర్థులు పరీక్షా హాలులోకి ప్రవేశించే ముందు తప్పనిసరిగా ముఖ ధృవీకరణ చేయించుకోవలసి ఉంటుంది. ఇన్విజిలేటర్ల వద్ద ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ధృవీకరణ ప్రక్రియ చేపట్టారు. దీనివల్ల ఖరీదైన హార్డ్‌వేర్ అవసరం లేకుండా పోయి, నిర్వహణపరమైన సవాళ్లు కూడా తగ్గాయని కమిషన్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి

పైగా కొత్త పరికరాల కొనుగోలు, వాటి రవాణా ఖర్చు కూడా తప్పింది. ఒక్కో అభ్యర్థి ముఖ గుర్తింపునకు 6-8 సెకన్ల సమయం మాత్రమే పట్టింది. 7 వేల మందికిపైగా ఇన్విజిలేటర్లు ఏకకాలంలో ఈ యాప్‌ను ఉపయోగించి నిమిషానికి 12వేలమంది అభ్యర్థుల ముఖాలను గుర్తించారు. ఈ ప్రక్రియ సజావుగా అమలు జరిగేలా చూసేందుకు పర్యవేక్షకులకు పలు దఫాలుగా శిక్షణ అందించినట్లు యూపీఎస్సీ తన ప్రకటనలో వివరించింది. దీని ద్వారా నకిలీ అభ్యర్థులను గుర్తించి, పరీక్షలో అవకతవకలు జరగకుండా నివారించేందుకు అవకాశం ఉంటుందని యూపీఎస్సీ ఛైర్మన్ అజయ్ కుమార్ వెల్లడించారు. ప్రభుత్వ పరీక్షలలో పారదర్శకత, నిష్పక్షపాతత, నిబద్ధత కోసం రియల్-టైమ్ ఫేస్ అథెంటికేషన్ విజయవంతంగా అమలు చేసినట్లు కమిషన్ పేర్కొంది.

Follow Us