AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు Wake up.. వర్షాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే!

వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు, కఫం పెరుగుతాయని చాలామంది భావిస్తారు. అయితే ఇది అందరికీ వర్తించే నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. తాజా పెరుగును ఫ్రిజ్‌ నుంచి తీసిన వెంటనే కాకుండా గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత తీసుకోవడం మంచిది. పెరుగులోని ప్రోబయోటిక్స్‌ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. అయితే సైనస్‌, అలర్జీలు లేదా పాల ఉత్పత్తుల పట్ల అసహనం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి..

ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు Wake up.. వర్షాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే!
Eating Curd In Rainy Season
Srilakshmi C
|

Updated on: Aug 11, 2026 | 1:48 PM

Share

వర్షాకాలం ప్రారంభమైతే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేవారు చాలామందే. వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు, కఫం పెరుగుతాయని ఓ సాధారణ నమ్మకం ఉంది. అయితే ఇది అందరికీ వర్తించే నియమం కాదని నిపుణులు చెబుతున్నారు. పెరుగు తినే విధానం, దాని తాజాదనం, ఉష్ణోగ్రతతో పాటు వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి వర్షాకాలంలో పెరుగు తినవచ్చా? ఎలా తీసుకోవాలి? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? తెలుసుకుందాం.

వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు వస్తుందా?

అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌కు చెందిన క్రిటికల్ కేర్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఆశిష్ మెహ్రోత్రా ఏం చెబుతున్నారంటే.. వర్షాకాలంలో పెరుగు తింటే అందరికీ జలుబు, దగ్గు వస్తాయనడం సరైనది కాదు. పెరుగు నేరుగా జలుబు లేదా దగ్గుకు కారణమవుతుందని చెప్పడానికి ఆధారం లేదు. అయితే ఫ్రిజ్‌లో నుంచి తీసిన వెంటనే చాలా చల్లగా ఉన్న పెరుగును తినడం కొంతమందికి గొంతులో అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అందుకే పెరుగును కొంతసేపు బయట ఉంచి సాధారణ గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత తీసుకోవడం మంచిది. ముఖ్యంగా పెరుగు తాజాగా ఉందా లేదా అన్నది కూడా చూసుకోవాలి.

పెరుగులోని ప్రోబయోటిక్స్‌తో ప్రయోజనాలు

పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేసే సజీవ బ్యాక్టీరియా. ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను సమతుల్యం చేయడంలో, జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడతాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా తమకు సరిపడే మోతాదులో తాజా పెరుగును సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరి శరీర తత్వం భిన్నంగా ఉంటుంది కాబట్టి, పెరుగు తిన్న తర్వాత ఏవైనా ఇబ్బందులు ఎదురైతే దాని వినియోగాన్ని తగ్గించడం మంచిది.

ఇవి కూడా చదవండి

వర్షాకాలంలో పెరుగును ఎలా తినాలి?

  • ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే పెరుగును తినకుండా కొంతసేపు బయట ఉంచాలి.
  • గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత తీసుకోవడం మంచిది.
  • ఎప్పుడూ తాజాగా ఉన్న పెరుగునే తీసుకోవాలి.
  • పెరుగు రంగు, వాసన లేదా రుచి మారితే తినకూడదు.
  • రుచికి తగినంత ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి లేదా కొద్దిగా నల్ల మిరియాల పొడి కలుపుకోవచ్చు.
  • పెరుగులో ఎక్కువగా మసాలాలు కలపాల్సిన అవసరం లేదు.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

ఇప్పటికే సైనస్, అలర్జీ లేదా తరచుగా జలుబు వంటి సమస్యలు ఉన్నవారు పెరుగు తీసుకునే విషయంలో తమ శరీర స్పందనను గమనించాలి. పెరుగు తిన్న ప్రతిసారీ గొంతులో అసౌకర్యం, కఫం లేదా ఇతర సమస్యలు కనిపిస్తే దాని వినియోగాన్ని తగ్గించి వైద్యుడిని సంప్రదించడం మంచిది. అలాగే పాలు, పాల ఉత్పత్తుల పట్ల అలెర్జీ లేదా అసహనం ఉన్నవారు నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే పెరుగును ఆహారంలో చేర్చుకోవాలి. వర్షాకాలంలో పెరుగు తినకూడదనే నియమం అందరికీ వర్తించదు. తాజాగా, సరైన ఉష్ణోగ్రతలో, మితమైన పరిమాణంలో పెరుగును తీసుకోవచ్చు. అయితే పెరుగు తిన్న తర్వాత మీకు పదేపదే ఏదైనా అసౌకర్యం కలుగుతుంటే దానిని నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Follow Us