AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ 2027 నుంచి కాటేరమ్మ పెద్ద కొడుకు ఔట్..!

Travis Head: ఐపీఎల్ అభిమానులకు, ముఖ్యంగా ఆరెంజ్ ఆర్మీకి షాకింగ్ న్యూస్. విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఐపీఎల్ 2027 సీజన్‌కు దూరం కానున్నాడు. వర్క్‌లోడ్ కారణంతోనే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్‌కు రూ. 14 కోట్లు మిగలనున్నాయి.

SRH ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ 2027 నుంచి కాటేరమ్మ పెద్ద కొడుకు ఔట్..!
Travis Head
Venkata Chari
|

Updated on: Nov 17, 2026 | 4:07 PM

Share

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు జీర్ణించుకోలేని వార్త ఇది. గత మూడు సీజన్లుగా ఆరెంజ్ జెర్సీలో ప్రత్యర్థి బౌలర్లకు వెన్నులో వణుకు పుట్టించిన ఆస్ట్రేలియా విధ్వంసక వీరుడు ట్రావిస్ హెడ్.. ఐపీఎల్ 2027కు దూరం కానున్నాడు. క్రిక్‌ఇన్‌ఫో కథనం ప్రకారం.. తీవ్ర అంతర్జాతీయ షెడ్యూల్ నేపథ్యంలో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా హెడ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని SRH యాజమాన్యానికి అధికారికంగా తెలియజేసినట్లు సమాచారం.

2024లో సన్‌రైజర్స్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి హెడ్ జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. అభిషేక్ శర్మతో కలిసి ఏర్పాటు చేసిన ఓపెనింగ్ జోడీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విధ్వంసక జోడీల్లో ఒకటిగా నిలిచింది. హెడ్ – అభిషేక్ – ఇషాన్ కిషన్.. ఈ త్రిమూర్తుల టాపార్డర్ చూస్తే చాలు ప్రత్యర్థి కెప్టెన్లు ఫీల్డింగ్ ఎలా సర్దాలో తెలియక తలలు పట్టుకునేవారు. ఇప్పుడు ఆ గోడకు మొదటి ఇటుకే కదిలిపోయింది.

ఎందుకీ నిర్ణయం? క్యాలెండర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

సీనియర్ క్రికెటర్‌గా హెడ్ నిర్ణయాన్ని తప్పుపట్టలేం. ఎందుకంటే ఆస్ట్రేలియా ముందున్న షెడ్యూల్ అంత కఠినంగా ఉంది.

ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో హై-వోల్టేజ్ వన్డే సిరీస్‌తో 2027 వరల్డ్ కప్‌కు సన్నద్ధమవుతున్న ఆసీస్.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడనుంది. ఆ వెంటనే జనవరి-మార్చి విండోలో భారత్‌లో ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఉంది.

అంతేకాదు, WTC పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్ చేరితే.. జూన్ 2027లో ఓవల్‌లో తలపడాల్సి ఉంటుంది. ఆ వెంటనే జూన్-జులైలో ఇంగ్లండ్ గడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్.. ఆపై ఆఫ్రికా గడ్డపై వన్డే ప్రపంచకప్. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని హెడ్ భావిస్తున్నాడు. దేశం కోసం ఫ్రాంచైజీ క్రికెట్‌ను త్యాగం చేయడం అతడి నిబద్ధతకు నిదర్శనం.

SRHకు 14 కోట్ల బూస్ట్.. కానీ ఆటగాడు దొరుకుతాడా?

ఆర్థికంగా చూస్తే SRHకు ఇది ఊరటనిచ్చే అంశమే. 6.8 కోట్లకు కొనుగోలు చేసిన హెడ్‌ను 2025 మెగా వేలానికి ముందు 14 కోట్లకు రిటైన్ చేసుకుంది హైదరాబాద్. 43 మ్యాచ్‌ల్లో 32.95 సగటు, 176.14 స్ట్రైక్ రేట్‌తో 1351 పరుగులు.. ఈ గణాంకాలే అతడి విలువను చెబుతున్నాయి.

ఇప్పుడు హెడ్ తప్పుకోవడంతో మినీ వేలానికి SRH పర్స్‌లో అదనంగా 14 కోట్లు చేరనున్నాయి. కానీ, అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. మినీ వేలం పూల్‌లో హెడ్ స్థాయి ఓపెనర్ దొరకడం అంత సులభం కాదు. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను శాసించగల లెఫ్ట్ హ్యాండర్.. అగ్రెసివ్ స్టార్ట్ ఇవ్వగల ప్లేయర్ కోసం SRH థింక్ ట్యాంక్ తీవ్రంగా శ్రమించక తప్పదు.

మొత్తంగా.. డబ్బు వచ్చింది, కానీ మ్యాచ్ విన్నర్ పోయాడు. ఈ లోటును SRH ఎలా పూడ్చుతుంది? వేలంలో ఎవరిని టార్గెట్ చేస్తుంది? అనేది వేచి చూడాలి.

Follow Us