UPSC Civils Mains 2024: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసిందోచ్
వివిధ కేంద్ర సర్వీసుల్లో నియామకాలకు నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ) 2024కు సంబంధించి యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్ష తేదీల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు యూపీఎస్సీ అధికారిక ప్రకటనను జారీ చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించి త్వరలో అడ్మిట్ కార్డులు విడుదల..
న్యూఢిల్లీ, ఆగస్టు 14: వివిధ కేంద్ర సర్వీసుల్లో నియామకాలకు నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ) 2024కు సంబంధించి యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్ష తేదీల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు యూపీఎస్సీ అధికారిక ప్రకటనను జారీ చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించి త్వరలో అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్ ప్రధాన పరీక్షలు రాసేందుకు అర్హత పొందుతారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా యూపీఎస్సీ జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు జులై 1న విడుదలయ్యాయి.
మెయిన్ పరీక్షలు రోజుకు రెండు సెషన్ల చొప్పున జరుగుతాయి. ఉదయం 9:00 గంటల నుంచి 12:00 గంటల వరకు మొదటి సెషన్ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు ఉంటాయి. ఒక్కో సెషన్ పరీక్ష మూడు గంటల పాటు జరుగుతుంది. మెయిన్స్ పరీక్షలు మొత్తం ఐదు రోజుల పాటు కొనసాగుతాయి. మెయిన్స్ అనంతరం ప్రతిభకనబరచిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. మెయిన్స్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా సర్వీసులను కేటాయిస్తారు. కాగా ప్రతీయేట సివిల్ సర్వీసులకు యూసీఎస్సీ నియామక ప్రక్రియ చేపడుతోన్న సంగతి తెలిసిందే. యేటా దేశ వ్యాప్తంగా లక్షలాది యువత ఈ పరీక్షలకు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు.
యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే..
- సెప్టెంబర్ 20, 2024న ఉదయం పేపర్-1 ఎస్సే ఉంటుంది.
- సెప్టెంబర్ 21, 2024న ఉదయం పేపర్-2 జనరల్ స్టడీస్-1 పరీక్ష, మధ్యాహ్నం పేపర్-3 జనరల్ స్టడీస్-2 పరీక్ష ఉంటుంది
- సెప్టెంబర్ 22, 2024న ఉదయం పేపర్-4 జనరల్ స్టడీస్-3 పరీక్ష పరీక్ష, మధ్యాహ్నం పేపర్-5 జనరల్ స్టడీస్-4 పరీక్ష ఉంటుంది
- సెప్టెంబర్ 28, 2024న ఉదయం పేపర్-ఎ (ఇండియన్ లాంగ్వేజ్) పరీక్ష, మధ్యాహ్నం పేపర్-బి (ఇంగ్లిష్) పరీక్ష ఉంటుంది
- సెప్టెంబర్ 29, 2024న ఉదయం పేపర్-6 (ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-1) పరీక్ష, మధ్యాహ్నం పేపర్-7 (ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-2) పరీక్ష ఉంటుంది